అనేక రకాలైన వ్యాధులు – మనం తీసు కోవలసిన జాగ్రత్తలు

మనుషుల నుంచి మనుషులకు చాలా వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వీటిని అంటురోగములుగా మనం పరిగణిస్తాము . కొన్ని అంటురోగములు జంతువులు , పక్షుల నుంచికూడా మనుజులకు సంక్రమిస్తాయి. వీటిని జంతు సంబంధ వ్యాధులు ( Zoonosis ) గా పరిగణిస్తారు. ఈ వ్యాధులను సూక్ష్మజీవులు ( Bacteria ), కానీ పరాన్నభుక్తులు (Parasites ), కానీ విష జీవాంశువులు ( Viruses ) కానీ , శిలీంధ్రములు ( Fungi ) కానీ కలిగిస్తాయి.

సూక్ష్మాంగజీవులు ( Bacteria ) : సూక్ష్మాంగజీవులు ఏకకణజీవులు. వీటికి కణకవచము ( cell wall ) , కణవేష్టనము( cell membrane ) ఉన్నా , పొరలలో అమరిన న్యూక్లియస్లు , మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మజీవులను గ్రామ్స్ వర్ణకము ( Gram’s stain ) చేర్చి సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకముల బట్టి గ్రామ్ పోజిటివ్ , గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదారంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబిరంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళములు ( cocci ) , కోలలు ( rods ), సర్పిలములు ( spirals ) గా వర్ణిస్తారు. చాలా సూక్ష్మాంగజీవులు మన శరీరము పైన , శరీరము లోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు , కణజాలముల లోనికి చొచ్చుకొని వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు కలుషిత ఆహారము , కలుషిత పానీయములు , లేక కలుషితపు గాలి ద్వారా శరీరములోనికి చొచ్చుకొని వ్యాధులకు కారణమవుతాయి. మనుజుల నుంచి మనుజులకు కూడా సూక్ష్మజీవులు వ్యాపించగలవు.

పరాన్నభుక్తులు ( Parasites ) : ఇవి ఇతరజీవులలో జీవించే జీవులు. ఇవి ఏకకణజీవులు ( ఉదా : మలేరియా పరాన్నభుక్తులు కాని , బహుకణజీవులు కాని కావచ్చును . ఇవి వాటి జీవనమునకు , వృద్ధికి ఇతర జీవులపై ఆధారపడుతాయి. పేలు , నల్లులు వంటి పరాన్నభుక్తులు శరీరము బయట ఉన్నా మనుజులనుండి మనుజులకు వ్యాపించగలవు. గజ్జి ( scabies ) క్రిములు ( Sarcoptes scabiei ) కూడా మనుజులు ఒకరికొకరు సన్నిహితముగా ఉండడము వలన వ్యాపిస్తాయి.
విషజీవాంశువులు ( Viruses ) :విషజీవాంశువులు ( viruses ) జీవకణములలో వృద్ధి చెంది విసర్జింపబడే జన్యుపదార్థములు. ఇవి రైబోన్యూక్లియక్ ఆమ్లమును ( Ribo Nucleic Acid ) కాని డీఆక్సీరైబో న్యూక్లియక్ ఆమ్లమును( Deoxyribo Nucleic Acid ) కాని కలిగి ఉంటాయి. బయట మాంసకృత్తు ఆచ్ఛదనను( capsid) కలిగి ఉంటాయి. కొన్ని కొవ్వు ఆచ్ఛాదనను కలిగి ఉంటాయి. వీటికి జీవము లేకపోయినా యితర జీవకణముల లోనికి చేరినపుడు ఆ కణములలో వృద్ధిపొందుతాయి . జీవులలో ఇవి వ్యాధులను కలుగజేయగలవు . ఈ విషజీవాంశువులకు యితర జీవవ్యాపారక్రియలు ఉండవు.
శిలీంధ్రములు ( Fungi )
  • ఇవి వృక్షజాతులకు జంతుజాలమునకు విభిన్నమైన జీవరాశులు. ఆహారమునకు ఇతర జీవులపై ఆధారపడుతాయి . వీని కణకవచములు ఖైటిన్ అను బహుళశర్కరను కలిగి ఉంటాయి. ఇవి మృతకణములపై జీవిస్తాయి.

  • అంటురోగములను కలిగించే వ్యాధిజనకములు ( pathogens ) వ్యాధిగ్రస్థులనుంచి ఇతరుల శరీరములకు ప్రాకి వారికి కూడా వ్యాధులను కలిగిస్తాయి.

  • ఇప్పుడు ‘ కోవిడ్ 19 ‘ చైనాలో హుయాన్ నగరములో పొడచూపి ప్రపంచమంతటా అనతికాలములో బహుళముగా వ్యాప్తి చెందడము చూస్తే , వ్యాధుల వ్యాప్తిని అరికట్టుటలో మన జాగ్రత్తలు చాలవు అనియు, ఆ జాగ్రత్తలు లోప భూయిష్ఠములు అనియు తెలుస్తుంది .

  • వైద్యులు , వైద్యరంగములో పనిచేయు సిబ్బంది అంటువ్యాధుల బరి పడుతూనే ఉంటారు.

  • వీరి నుంచి ఆ వ్యాధులు ఇతర రోగులకు కూడా వ్యాప్తి చెందగలవు. అందువలన ఆ రోగములవ్యాప్తిని అరికట్టుటకు తీసుకోవలసిన జాగ్రత్తలను చర్చిద్దాము .
ప్రత్యేక జాగ్రత్తలు:-
మనిషికి మనిషి మధ్య దూరము గా ఉండడం :

(Social Distancing)
  • మనుజుల మధ్య సాధారణ పరిస్థితులలో కూడా కొంచెమైనా దూరము పాటించుట మేలు. జలుబు , వ్యాపకజ్వరము( Influenza ), కోవిడ్ 19 వంటి వ్యాధులను కలిగించు జీవాంశువులు ( viruses ) గల తుంపరులు ( droplets ) 5 మైక్రోమిల్లిమీటరులను మించిన పరిమాణములో ఉంటాయి.

  • ఇవి తుమ్ము , దగ్గు , మాటల తుంపరుల ద్వారా గాలిలో కొద్ది సేపు ఉండి పిదప క్రిందకు భూతలము పైన , వస్తువుల ఉపరితలముల పైన ఒరిగిపోతాయి. అందువలన ఇవి 3నుంచి ఆరడుగుల దూరములోపల ఉన్న యితరులకు తుంపరల ద్వారా వ్యాప్తి చెందగలవు.

  • వ్యాధిగ్రస్థుల నుంచి 3 నుంచి 6 అడుగుల దూరము పాటించుట వలన , వస్తువులను తాకిన చేతులను సబ్బునీళ్ళతో కాని ఆల్కహాలు గల శుద్ధిపదార్థములతో ( sanitizers ) కాని శుభ్రము చేసుకొనుట వలన , సబ్బునీళ్ళు లేక ఆల్కహాలు గల శుద్ధిపదార్థములతో శుద్ధి చేయబడని చేతులను ముఖముపై చేర్చకపోవుట వలన ఈ వ్యాధులను నివారించవచ్చును.

  • వ్యాధిగ్రస్తులు, తుమ్ములు, దగ్గులు కలవారు నోటికి, ముక్కుకి, ఆచ్ఛాదనములు కప్పులు (masks ) ధరించవలెను.

    • వైద్యశాలలలో వీరిని ఒంటరి గదులలో ఉంచాలి. ఈ రోగులకు సేవలు అందించు వైద్యులు, వైద్యసిబ్బంది గాలిని 95% వడకట్టు N-95 ఆచ్ఛాదనములను ( N-95% masks ) ధరించాలి.

    • కళ్ళకు రక్షక కంటద్దములను ( safety goggles ) ధరించాలి. చేతులకు చేతొడుగులు ( gloves) ధరించాలి. దుస్తులపై శస్త్రచికిత్సకుల నిలువుటంగీలను ( surgical gowns ) ధరించాలి. వ్యాధిగ్రస్తులకు సేవలు అందించి వారి గదుల నుంచి బయటకు వచ్చాక వాటిని జాగ్రత్తగా తొలగించుకోవాలి.

    • చేతొడుగులు ధరించినా చేతులను సబ్బునీళ్ళతో శుభ్రము చేసుకోవాలి. పాదరక్షలను కూడా వ్యాధిజనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేసుకోవాలి.

    • కొన్ని సూక్ష్మజీవులు , విషజీవాంశువుల పరిమాణము 5 మైక్రోమీటర్లు కంటె తక్కువ ఉండుటవలన అవి గాలిలో చాలా గంటల సేపు తేలియాడుతు ఉండగలవు . వేపపువ్వు ( measles ) , ఆటాలమ్మ ( chickenpox ) వ్యాధులు కలిగించే విషజీవాంశువులు ఈ కోవకు చెందినవి. గాలి ద్వారా ఈ వ్యాధులు వ్యాపించగలవు.

    • వ్యాధినివారణశక్తి లోపించిన వారు , శరీర రక్షణవ్యవస్థ లోపములు కలవారు , గర్భిణీస్త్రీలు ఈ రోగుల పరిసరములలో చొరకూడదు. వైద్యశాలలలో ఉన్న రోగులను ఋణ వాయుపీడనము కల ( negative air pressure ) ప్రత్యేకమైన ఒంటరి గదులలో ఉంచాలి.

    • వీరిని సందర్శించువారు నోరు , ముక్కులను కప్పే N- 95 ఆచ్ఛాదనములను
    • ( masks ) కప్పులు ధరించాలి. వ్యాధిగ్రస్తులు వారి గదుల నుంచి బయటకు రావలసిన అవసరము కలిగితే వారు శస్త్రచికిత్సకుల ఆచ్ఛాదనములను ( surgical masks ) ధరించాలి.
    సాధారణ జాగ్రత్తలు : (General Precaustions)
    • వైద్యులు , వైద్యసిబ్బంది రోగులను పరీక్షించే ముందు , పరీక్షించిన పిదప చేతులను శుద్ధిపదార్థములతో( sanitizers ) రోగికి, రోగికి మధ్య శుభ్రము చేసుకోవాలి. వైద్యులు , నర్సులు వారు వాడే వినికిడి గొట్టములను ( stethoscopes ) కూడా ఆల్కహాలుతో శుభ్రము చేసుకొనుట మేలు.

    • (Clostridium difficile) వ్యాధిగ్రస్థులను పరీక్షించాక చేతులను సబ్బు , నీళ్ళతోనే శుభ్రము చేసుకోవాలి. ఈ సూక్ష్మజీవులు పెద్దప్రేవులలో తాపము కలిగించి అతిసారమును కలిగిస్తుంది. వీటి బీజములు( spores ) ఆల్కహాలు వలన నశింపవు.

    • రోగి శరీర ద్రవములు ( రక్తము , చీము , లాలాజలము , శ్లేష్మము వగైరా ) అంటుకొనే అవకాశములు ఉన్నపుడు చేతొడుగులను ( gloves ) తప్పక ధరించాలి. శరీరద్రవములు ( body fluids ) దుస్తులపై చిమ్మే అవకాశమున్నపుడు దుస్తులపైన నిలువుటంగీలను ( gowns ) ధరించాలి. రోగి శరీరద్రవములు కళ్ళలో చిందే అవకాశము ఉన్నపుడు కళ్ళరక్షణకు అద్దాలను ( safety goggles ) కాని పారదర్శక కవచములను ( transparent shields ) కాని ధరించాలి.

    • రోగులపై శస్త్రచికిత్సలు , శరీరములోనికి సూదులు, ఇతర పరికరములు చొప్పించే పరీక్షలు , ప్రక్రియలు ( invasive procedures ) సలిపేటప్పుడు కూడా వ్యాధిజనక రహిత ( sterilized ) నిలువుటంగీలు , చేదొడుగులు , నోటి – ముక్కు కప్పులు ధరించాలి .

    • రోగులపై వాడిన సూదులు , పరికరములు , వారి దెబ్బలకు , పుళ్ళకు కట్టిన కట్టులు,వాడిన చేతొడుగులు (గ్లోవ్స్), నిలువుటంగీలను (plasters) సక్రమముగా ఇతరులకు హాని కలుగకుండా విసర్జించాలి.

    • తిరిగి వాడే పరికరములను వ్యాధిజనకరహితములుగా ( sterilize ) చెయ్యాలి .

    ఏకాంత వాసము ( Isolation ) :
    • సులభముగా ఇతరులకు సంక్రమించు అంటురోగములు కలవారిని , ప్రమాదకరమైన అంటురోగములు కలవారిని ఏకాంతవాసములో ( isolation ) ఉంచవలెను. వీరిని సందర్శించువారు నిలువుటంగీలు , నోటి – ముక్కు కప్పులు , చేతొడుగులు ధరించి వారి గదుల నుంచి బయటకు వచ్చాక వాటిని జాగ్రత్తగా విసర్జించాలి. ఆపై చేతులను సబ్బు నీళ్ళతో కడుగుకొనాలి.

    • ఆ రోగులకు వాడే ఉష్ణమాపకములు( thermometers),వినికిడిగొట్టములు (stethoscopes) ప్రత్యేకముగా వారికొఱకు ఉండాలి. అట్టి రోగులను వివిధపరీక్షలకై వారి గదుల నుంచి తీసుకువెళ్ళేటప్పుడు వారికి నిలువుటంగీలు , నోటి – ముక్కు కప్పులు తొడగాలి.

    శ్వాసపథ రక్షణ ( Airway protection ) :
    • శరీరమును ఆక్రమించే చాలా వ్యాధిజనకములు శ్వాసపథము ద్వారా ప్రవేశిస్తాయి. దగ్గులు, తుమ్ములు, మాటల వలన తుంపరుల రూపములో కాని, నిశ్వాసక్రియలో వాయువాహకములు ( airborne ) గా గాని వ్యాధిజనకములు వెదజల్లబడి. ఇతరుల శ్వాసపథము లోనికి గాలి పీల్చునపుడు ప్రవేశించగలవు.

    • అందువలన అంటురోగములు జలుబు , ఇన్ఫ్లుయెంజా ,ఆటాలమ్మ ( chickenpox ) వంటి మనము చిన్న వ్యాధులుగా పరిగణించే వ్యాధులైనా సరే కలవారు నోటి -ముక్కు కప్పులను (facemasks) ధరించాలి. ఈ చిన్నవ్యాధులు ఆపై నాసికాకుహరములలోతాపము ( sinusitis ) , శ్వాసనాళములలో తాపము ( bronchitis ) , ఊపిరితిత్తులలోతాపములకు ( pneumonias ) దారితీయవచ్చును. వైద్యశాలలలో వైద్యులు, ఇతరసిబ్బంది, రోగులను దర్శించువారు నోటి ముక్కు కప్పులు ధరించుట మేలు.

      • విమానములు , ఎ.సి కారులు , ఎ.సి రైళ్ళలో ప్రయాణించునపుడు మూసిఉంచిన స్థలములలో చాలా మంది కలసి, చాలా సమయము గడిపి , చాలా దూరము ప్రయాణిస్తారు. అందువలన ఈ ప్రయాణీకులకు నోటి ముక్కు కప్పుల ధారణ తప్పనిసరి చేసి , ప్రయాణసాధనములను వ్యాధిజనక విధ్వంసకములతో ( disinfectants ) శుభ్రము చేయుట వలన అనేక శ్వాసపథ వ్యాధులను నివారించగలము. దూరప్రయాణీకులు ప్రయాణము పిమ్మట వ్యాధిగ్రస్థులు అగుట మనము చాలా సారులు గమనిస్తాము.

      కరచాలనములు ఆలింగనము: (Shakehands, hugging)
      • కరచాలనముల వలన చాలా అంటురోగములు వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్యరంగములో పనిచేసేవారు కరచాలనములు అసలు చేయకూడదు. ఇతరులు కూడా కరచాలనముల అలవాటును వదల్చుకోవాలి.

      • ఆత్మీయ ఆలింగనముల అలవాటు కూడా మంచిది కాదు. ఒకరినొకరు వీలైనంత వరకు తాకకుండా ఆదరాభిమానములు చూపించుకొనుట ఉత్తమము.

      ఎంగిలితినరాదు :
      • ఆహార పానీయములు సేవించేటప్పుడు ఎవరి గ్లాసులు సీసాలు (Glass, bottles) వారికే ఉండాలి

      • ఒకరు వాడే పలుదోము కుంచెలు (toothbrushes), క్షురకత్తెరలు (Sciessers), దువ్వెనలు (combs) , తువ్వాళ్ళు (Hand towels ) వేరొకరు వాడకూడదు.

      ఆహార పానీయముల శౌచ్యము :
      • జీర్ణాశయము, ప్రేవులలో సూక్ష్మాంగజీవులు కలిగించే కలరా, టైఫాయిడ్, అతిసారము , వంటి అంటురోగములను ఉంటున్నప్పుడు సమాజములో ప్రజలందఱికీ పరిశుద్ధమైన మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చి దొడ్లను సూక్ష్మజీవ రహితముగా మలచుట ఈ వ్యాధులను నిర్మూలించే అవకాశము కలదు.

        • మనము తినే ఆహారపదార్థాలు , త్రాగే పానీయములు శుచిగా ఉండాలి. ఆహారపదార్థాలపై ఈగలు , క్రిములు చేరకుండా జాగ్రత్తపడాలి.

        • అంటురోగములను నివారించుటకు, చికిత్స చేయుటకు చాల రసాయినక పదార్థములను మందులు ఆయుర్వేద చికిత్సలు చేస్తున్నారు.

        వ్యాధిజనక విధ్వంసకములు ( Disinfectants ):
        • ఇవి వస్తువులపై ఉన్న సూక్ష్మజీవులను ( bacteria ) , శిలీంధ్రములను ( fungi ), విషజీవాంశువులను ( viruses ) ధ్వంసము చేసే రసాయినక పదార్థములు . వీనిలో కొన్ని మృదుపదార్థములను ( alcohol , hydrogen peroxide, dettol , betadine ) చేతులు శుభ్రము చేసుకొందుకు వాడినా, వ్రణముల పైన వాడకూడదు , దేహము లోపలకు తీసుకోకూడదు . ఇవి ఔషధములు కాదు. వీనిని ఇంటి అరుగులు , వస్తు తలములు పరికరములను శుద్ధి చేయుటకు వాడుతారు.
        సూక్ష్మజీవి సంహారక లేపనములు ( Antiseptics ):
        • ఇవి చర్మమునకు , దెబ్బలకు , పుళ్ళకు పూయబడే సూక్ష్మజీవి సంహారక రసాయినక పదార్థములు. వీనిని శరీరము లోనికి తీసుకోకూడదు .
        సూక్ష్మజీవి విపక్ష ఔషధములు ( Antibiotics ) :
        • ఇవి శరీరములోనికి నోటి ద్వారా , కండరముల ద్వారా , సిరల ద్వారా తీసుకొనే సూక్ష్మజీవులను నశింపచేయు ఔషధములు .

        • విషజీవాంశు విపక్షములు ( Antivirals ) : ఇవి విషజీవాంశువుల ( viruses ) వృద్ధిని అరికట్టు ఔషధములు . వీనిని చర్మము పైన కాని , శరీరము లోపలకు కాని వాడుతారు.

        %d bloggers like this: