
మర్రి చెట్టు గొప్పదనాన్ని గుర్తించి భారత దేశం మర్రి చెట్టును దేశ జాతీయ వృక్షంగా ప్రకటించింది.
పొడవైన ఊడలతో ఎంతో పెద్దగా ఉండే మర్రి చెట్టు బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫిగ్ చెట్లలో 750కిపైగా వృక్ష జాతులుంటాయి. అందులో మర్రి చెట్టును ఒకటి.
ఈ చెట్టును వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఇంకా బెంగాల్ ఫిగ్, ఇండియన్ ఫిగ్ అంటూ రకరకాల పేర్లు ఉన్నాయి. మర్రి చెట్టు శాస్త్రీయ నామం ‘ఫైకస్ బెంగాలెన్సిస్’. ఒకప్పుడు బాటసారులు, వ్యాపారులు ప్రయాణాలు చేస్తూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకునేవారు. ఆ వ్యాపారుల్నే బనియాలు అనే వారు. అలా ఈ చెట్లకు బనియన్ ట్రీ అనే పేరు వచ్చిందంటారు.
ఈ చెట్ల విత్తనాలు చాలా చిన్నవి. చెట్లు మాత్రం మహావృక్షంగా మారిపోతాయి. మర్రి చెట్ల నీడలో దాదాపు పదివేల మంది ఒకేసారి విశ్రాంతి తీసుకునేంత పెద్దవిగా పెరుగుతాయి. ఈ చెట్ల వేర్లు భూమిపైకి కనిపిస్తుంటాయి. కొమ్మలు ఊడలుగా మారి కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి. లావుగా ఉండే మాను, అనేక శాఖలు, చిన్న చిన్న ఎర్రని పండ్లు, పెద్ద ఊడలతో ఉంటుంది.
ఈ చెట్టు వయసు పెరిగే కొద్దీ ఊడల్ని నేలలో దింపుతూ ఎకరాలకు ఎకరాలు వ్యాపించుకుంటూ పెరుగుతుంది. పక్షులు నా గింజల్ని వేరే చెట్టు పగుళ్లలో లేదంటే పెద్ద పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ల సందుల్లో పడేస్తే అక్కడ మర్రి చెట్లు చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతాయి. మర్రి చెట్ల నీడలో వేరే చెట్లు పెరగవు. ఈ చెట్టు చాలా విశాలంగా దట్టంగా ఉంటుంది
దృఢంగా ఉండే ఈ చెట్ల కలపతో తలుపులు, పెద్ద పెట్టెలు తయారుచేస్తారు. ఈ చెట్ల బెరడు ద్వారా వచ్చే జిగురును పంటి నొప్పులు, కాలి బొబ్బలకువాడతారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ చెట్ల బెరడును, ఆకులను, పండ్లను రకరకాల ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తిమ్మమ్మ మర్రిమాను అని పిలువబడే మర్రి చెట్టు దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి. 1989లో ఇది గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ స్థలం పర్యాటక స్థలంగా మారింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో పిల్లల మర్రి చెట్టు అని పిలువబడే మర్రి చెట్టు కూడా చాలా పెద్దిది. ఈ చెట్టును చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెట్టుకి 700 ఏళ్లు.
కోల్‌కతా దగ్గర్లో ఆచార్య జగదీశ్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్‌లో ‘గ్రేట్ బనియన్ ట్రీ’ ఉంది. అతి పెద్ద మర్రిచెట్లలో ఇదీ ఒకటి.
Raju's Resource Hub