పాశ్చాత్య వంటకాల్లో ముఖ్యంగా ఇటాలియన్, గ్రీక్, అమెరికన్ వంటకాల్లో ఒరెగానోని తప్పనిసరిగా వాడతారు. ఈ ఆకునే పిజా ఆకు అని కూడా అంటారు. తక్కువ ఎత్తులో నేలకు సమాంతరంగా ఎదిగే పచ్చదనాల ఒరెగానో పుదీనా కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఒరెగానో వల్లేగర్. ఇది అడుగున్నర ఎత్తు వరకూ పెరుగుతుంది. ఒక్కసారి నాటుకుంటే చాలు, ఏళ్ల పాటు బతికేస్తుంది. అండాకారంలో కనిపించే ఆకులే కాదు… వీటికి కంకులు కూడా వస్తాయి.
వీటిల్లో చిన్న చిన్న పూలూ పూస్తాయి. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ, కె, బి6 వంటి వాటితోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. జలుబు, దగ్గులకు ఇది మంచి ఔషధం.

ఎలా పెరుగుతుంది…
ఒరెగానోని కుండీల్లోనే కాదు… హైడ్రోపోనిక్ విధానంలోనూ పెంచుకోవచ్చు. అయితే, పూర్తి సూర్యకాంతి అవసరం. ఎండ సరిగా పడకపోతే… కనీసం కృత్రిమ వెలుతురైనా అందేలా చూసుకోవాలి. అయితే, మట్టి మాత్రం సారవంతంగా, పొడిగా ఉంటే మేలు. నీటి ఎద్దడిని తట్టుకోగలదు. ఎరువులు కూడా పెద్దగా అవసరం లేదు. అప్పుడప్పుడూ కంపోస్ట్ చుట్టూ ఉన్న మట్టిలో కలిపితే చాలు. ఒరెగానోకి సాధారణంగా రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి. బూడిద తెగులు ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు లీటరు నీటిలో చెంచా వేపనూనె కలిపి పిచికారీ చేస్తే ఇబ్బంది వదిలిపోతుంది. వీటిని విత్తనాలతోనే కాదు… కొమ్మ కత్తిరింపులతోనూ కొత్తవి ఉత్పత్తి చేయొచ్చు.
Raju's Resource Hub
