📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పింగళి వెంకయ్య

పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారతదేశ జాతీయ పతాకరూపకర్త.
పింగళి వెంకయ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో జన్మించాడు. తల్లిదండ్రులు హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లిలోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబోవెళ్లాడు.

19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశాడు. గాంధీతో వెంకయ్యకు యేర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధశతాబ్దం పాటు కొనసాగింది. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై, నాయకులందరితోనూ జాతీయ పతాక రూపకల్పన గురించి చర్చలు జరిపేవాడు. 1916లో “భారతదేశానికొక జాతీయ జెండా ” అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. ఈ గ్రంథానికి అప్పటి వైస్రాయ్ కార్యనిర్వాహక సభ్యుడైన కేంద్రమంత్రి సర్ బి.ఎన్.శర్మ ఉత్తేజకరమైన పీఠిక రాసి, ప్రచురించాడు.

1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయపతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిలభారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు.

Google ad

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం రూపొందింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారత దేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ సంఘటనలలో పాల్గొనటం జరిగింది. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బెంగుళూరు మరియు మద్రాసులలో రైల్వే గార్డుగా పనిచేశాడు. ఆ తరువాత కొంత కాలం బళ్లారిలో ప్లేగు అధికారిగా ప్రభుత్వ ఉద్యోగము చేశాడు. వెంకయ్యలో ఉన్న దేశభక్తి వలన ఆయన ఎంతో కాలము ఉద్యోగం చేయలేదు. జ్ఞానసముపార్జన ఆశయముతో లాహోరులోని ఆంగ్లో – వేదిక్ క‌ళాశాలలో చేరి ఉర్దూ మరియు జపాన్ భాషలను నేర్చుకున్నాడు. ఈయన ప్రొఫెసర్ గోటే ఆధ్వర్యములో జపనీస్ మరియు చరిత్ర అభ్యసించాడు.

క్రమంగా వెంకయ్య రాజకీయాల నుండి దూరమయ్యాడు. మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి ‘డిప్లొమా’ తీసుకొన్నాడు. తరువాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ అభ్రకం (మైకా) గురించి పరిశోధన చేశాడు. వజ్రకరూరు, హంపిలలో ఖనిజాలు, వజ్రాలు గురించి విశేషంగా పరిశోధనలు జరిపి ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయి అనే గ్రంథం రాసి 1955లో దాన్ని ప్రచురించాడు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధకశాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసాడు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్యంలో బతకవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. భారతదేశానికి ఒక పతాకాన్ని రూపొందించాడు.

ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం, జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం. తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు.

జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా ఇబ్బందిపడి నానా ఇబ్బందులు పడినట్లు ‘ త్రివేణి ‘ సంపాదకులు డా. భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్యను సత్కరించి వారికి కొంత డబ్బును అందించారు. ఆ సత్కారం జరిగిన తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4 న వెంకయ్య గారు దివంగతుడయ్యాడు.

కన్నుమూసేముందు ఆయన చివరి కోరికను వెల్లడిస్తూ ” నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక ” అన్నారు. జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది.

వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేశాడు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు. కూతురు సీతామహలక్ష్మి మాచర్లలో స్థిరపడింది.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading