Logo Raju's Resource Hub

విప్లవవీరులు – భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్

Google ad

లాలా లజపత్ రాయ్ ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్, ఆయన సహచరులు. ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్దికాలానికి దిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయింది. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి… మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్థులకు చేసినట్లుగా తాడుకు కట్టి ఉరితీయ వద్దని, రాజకీయ ఖైదీలం కాబట్టి నేరుగా తుపాకితో కాల్చి చంపండని ముగ్గురూ విజ్ఞప్తి చేశారు. ఆంగ్లేయ సర్కారు ఆ చివరి కోరిక తీర్చటానికి నిరాకరించింది. 1931 మార్చి 24 తెల్లవారుజామున భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను ఉరితీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. యావద్దేశం ఉడికిపోతోంది. అశక్తతతో రగిలిపోతోంది. ఏదైనా అనూహ్యం జరిగి మరణశిక్ష ఆగిపోవాలని ప్రార్థిస్తూనే… 24 ఉదయం కోసం యావద్దేశం ఉద్విగ్నంగా మేల్కొంది. పరిస్థితి గమనించిన బ్రిటిష్ అధికారులు అనూహ్యంగా రాత్రికి రాత్రి ప్రణాళికను మార్చేశారు. ఉరితీతను 11 గంటలు ముందుకు జరిపారు. 23నాడు రాత్రి 7.30 నిమిషాలకే పని కానిచ్చేయాలని నిర్ణయించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను లాహోర్ సెంట్రల్ జైల్లోని మైదానంలోకి తీసుకొచ్చారు. వెంట ఉన్న కొంతమంది భారతీయ పోలీసుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నా… భగత్ సింగ్ లో మాత్రం ఎలాంటి బాధా, ఆందోళన కనిపించలేదు. ఈ సమయం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నవారిలా కన్పించారు. ఎడమవైపు సుఖ్ దేవ్ , కుడివైపు రాజ్ గురు… మధ్యలో భగత్ ను నిలబెట్టారు. బలిపీఠంపైకి చేర్చగానే… ముగ్గురూ ఉరితాడును ముద్దాడి మెడలో వేసుకున్నారు. దిల్ సే నిక్ లేగీ న మర్ కర్ భీ వతన్ కీ ఉల్ఫత్… మేరీ మిట్టీ సే భీ ఖుష్ బూ వతన్ ఆయేగీ (మరణించినా మాలో దేశభక్తి మిగిలే ఉంటుంది. మట్టిలో కలసిపోయాక కూడా అందులోంచి మాతృభూమి గుబాళింపే వస్తుంది) అంటూ 23 ఏళ్ల భగత్ ఎలుగెత్తగానే… మిగిలిన ఇద్దరూ గళం కలిపారు. అలా దేశం కోసం నినదిస్తూ ముగ్గురు వీరుల ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి.

ఉరితీత పూర్తికాగానే బ్రిటిష్ సర్కారు తదుపరి కార్యక్రమాన్ని చకచకా ముగించటానికి వేగిరపడింది. ఎందుకంటే కొద్దిరోజుల ముందు లాహోర్ జైలులో ఖైదీల హక్కుల కోసం 63 రోజులు నిరశన దీక్షకు దిగి ప్రాణాలు కోల్పోయిన జతీంద్రనాథ్ దాస్ అంతిమయాత్ర జనసంద్రమై… ఆంగ్ల సర్కారును భయపెట్టింది. భగత్ సింగ్ లాంటివారి అంతిమయాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే ఆంగ్లేయులు భయపడ్డారు. అందుకే ఉరి సమయాన్ని మార్చటంతో పాటు… తెల్లవారే లోపు వారి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలనుకున్నారు. వెంటనే ముగ్గురి మృతదేహాలనూ దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కారు. వాటిని రహస్యంగా రాత్రి ట్రక్ లో వేసి జైలు దాటించారు. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత కసూర్ చేరుకున్నారు. అప్పటికే… సట్లెజ్ నది ఒడ్డున పోలీసులు అంతా సిద్ధం చేసిపెట్టారు. అంత్యక్రియలు నిర్వహించటానికి ఇద్దరు పూజారులను కూడా తెచ్చారు. సిక్కు సంప్రదాయ పద్ధతిలో భగత్ కు, మిగిలిన ఇద్దరికి హిందూ పద్ధతుల్లో తంతు ముగించి… దహనం చేశారు. అర్ధరాత్రి దాటాక… మంటలు వస్తుండటంతో అక్కడి ఊరివాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో అంతా చిందరవందర చేసి, పూర్తిగా దహనం కాకుండానే వాటిని నదిలోకి తోయటానికి ప్రయత్నించి… పూజారులను తీసుకొని పోలీసులు హడావుడిగా వెళ్లిపోయారు. అక్కడికి వచ్చిన గ్రామస్థులకు పరిస్థితి అర్థమైంది. వెంటనే నదిలో చిందరవందరగా పడ్డ మృతదేహాల భాగాలను కూడా సేకరించి… వాటన్నింటినీ మళ్లీ చితిపైకి చేర్చి అంత్యక్రియలు ముగించారు. ఏ ప్రజలకు దక్కవద్దని ఆంగ్లేయులు అనుకున్నారో చివరకు ఆ ప్రజల చేతుల మీదుగానే భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాత్రి జరిగిన సంఘటన తెలియగానే ఊరూరూ ఆవేశంతో, ఆవేదనతో ఊగిపోయింది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading