Logo Raju's Resource Hub

లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్

Google ad
బాల గంగాధర్ తిలక్

నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం.. ఎందరో మహోన్నత వ్యక్తుల త్యాగాల ఫలితం. స్వాతంత్ర పోరాటంలో సమిధలుగా మారి.. ప్రస్తుత సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. అటువంటి వారిలో బాలగంగాధర్‌ తిలక్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ఒకరు ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అంటే, ఇంకొకరు స్వరాజ్య సాధన కోసం జీవితాన్నే త్యాగం చేశారు. తిలక్‌ తన మాటలతో యువతలో స్ఫూర్తిని రగిలించి, స్వరాజ్య సాధన దిశగా సాధారణ ప్రజలను సైతం ముందుకు నడిపించారు.

స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసిన ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయుల్లో మొదటి వారు తిలక్‌. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు.

జాతీయవాదానికి బీజం వేసి, స్వరాజ్యకాంక్షను రగిలించిన మహా నాయకుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు. భారతీయతకు ప్రతీక ఆధునిక భావాలతో కళాశాల విద్య అభ్యసించిన తిలక్‌, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. పాశ్చాత్య విద్యావిధానం వల్ల భారతీయుల్లో సంస్కృతి పట్ల అవగాహన కొరవడిందని, అది భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా ఉందనే ఉద్దేశంతో బాహాటంగానే నిరసన వ్యక్తం చేశారు.

మంచి విద్య ద్వారానే మంచి పౌరులు తయారవుతారనే ఆలోచనతో, ప్రతి భారతీయుడికి సంస్కృతి గురించి, దేశ ఔన్నత్యాన్ని గురించి బోధించాలన్న సంకల్పంతో ‘డక్కన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ స్థాపించారు. మరాఠీ భాషలో కేసరి దినపత్రికను నడిపి, వాక్‌ స్వాతంత్య్రం, భారతీయ సంస్కృతి పట్ల బ్రిటిష్‌ పాలకులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిపై, తిలక్‌ యుద్ధం ప్రకటించారు. భారతీయ సంస్కృతిపై బ్రిటిష్‌ నాయకుల అణచివేతను 1857 తిరుగుబాటు తరువాత అంతగా నిరసించిన వ్యక్తిగా ఆయన పేరు చెప్పుకోవాలి.

Google ad

జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని తిలక్‌ వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు తిలక్‌ ప్రారంభించినవే. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఇవన్నీ స్వరాజ్య సాధనకు ప్రభావిత మాధ్యమాలుగా మారాయి. ఇవే తిలక్‌కు స్వాతంత్య్ర సంగ్రామంలో ఓ ప్రాధాన్యత కల్పించాయి. 1920లో మరణించినప్పుడు ఆయన్ను ‘నవభారత నిర్మాత’గా మహాత్మ గాంధీ అభివర్ణించారు. తిలక్‌ తరవాతా ఆయన స్ఫూర్తి స్వాతంత్య్ర ఉద్యమం దిశగా యావత్‌ భారతాన్ని నడిపించింది. నేటికీ జాతీయవాద స్ఫూర్తిని మనలో నింపుతూనే ఉంది.

స్వాతంత్ర పోరాటంలో తిలక్‌ అనేకమార్లు జైలుకు వెళ్లారు. ఏ దశలోనూ జైలు గదులు ఆయన స్వరాజ్య నినాదాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆయనను జైల్లో బంధించడాన్ని రాజనీతిజ్ఞులంతా వ్యతిరేకించి, విడుదల చేయమంటే- ఉత్సవాల్లో పాల్గొనకూడదు, ప్రభుత్వాన్ని విమర్శించకూడదనే ఆంక్షలను నాటి ప్రభుత్వం ఆయన ముందుంచింది. పిరికివాడిగా బతకడం కంటే అండమాన్‌ జైలులో ఉండటమే మేలని నాడు ఆయన చెప్పిన మాటలు యావత్‌ దేశాన్ని ఉత్తేజపరచాయి. 1908లో దేశద్రోహ నేరం కింద నాటి బ్రిటిష్‌ కోర్టు ఆరేల్ల పాటు ద్వీపాంతర జైలుశిక్ష విధించింది. 1908 నుంచి 1914 వరకు తిలక్‌, బర్మాలోని మాండలే జైలులో ఉన్నారు. చాలా చిన్న జైలుగదిలో ఒంటరి జీవితం గడిపిన తిలక్‌, గీతారహస్యం పేరుతో భగవద్గీత మీద గొప్ప వ్యాఖ్యానం రాశారు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading