Logo Raju's Resource Hub

జో బైడెన్

Google ad
(పై చిత్రం గూగుల్ సౌజన్యం)

2020 నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు, అధిక మొత్తంలో ఎలక్టొరల్ కాలేజ్ సీట్లు సంపాదించిన జో బైడెన్ (Joe Biden) అమెరికా సంయుక్త రాష్ట్రాలకి 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం 2021 జనవరి 20న మొదలై నాలుగేళ్ల పాటు కొనసాగుతుంది.

జో బైడెన్ పూర్తి పేరు జోసఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ (Joseph Robinette Biden, Jr). ఈయన 1942 నవంబర్ 20 తేదీ పెన్సిల్వేనియా రాష్ట్రంలో జన్మించాడు. తండ్రి పేరు జోసఫ్ బైడెన్ సీనియర్ (Joseph Biden, Sr), తల్లి పేరు కేథరిన్ యూజీనియా ఫినెగాన్ (Catherine Eugenia Finnegan). తండ్రి పాత కార్ల సేల్స్‌మన్‌గా పనిచేసేవాడు. తల్లి గృహిణి. వీళ్లది మధ్యతరగతి ఐరిష్ కేతలిక్ కుటుంబం.

చిన్నతనంలో జో బైడెన్ నత్తితో ఇబ్బంది పడేవాడు. ఆ కారణంతో బడిలో సహవిద్యార్ధుల హేళనకి గురయ్యేవాడు. దాన్ని అధిగమించటానికి గంటలతరబడి అద్దం ముందు నిలబడి, పొడుగాటి ఆంగ్ల పద్యాలు, పాఠాలు కంఠస్తం చేసి వల్లెవేస్తూ … కాలక్రమంలో ఆ సమస్యని అధిగమించటమే కాకుండా మంచి వక్తగా రూపొందాడు. (నత్తివల్ల వచ్చిన ఆ తడబాటు ఇప్పటికీ అప్పుడప్పుడూ బో బైడెన్ ఉపన్యాసాల్లో తొంగిచూస్తుంది).

అమెరికాలో ఓ మధ్యతరగతి విద్యార్ధి చదువుకోవటం అంత తేలిక కాదు. మంచి పాఠశాలల్లో ప్రవేశం సాధించాలంటే అవసరమయ్యే రుసుం కోసం చిన్నతనంలోనే జో బైడెన్ ఖాళీ సమయాల్లో కిటికీలు శుభ్రం చేయటం, తోట పనులు చేయటం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. అలా ప్రసిద్ధ ఆర్క్‌మియర్ అకాడమీలో (Archmere Academy) ప్రవేశం సాధించిన జో బైడెన్, 1961లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఆ తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా సాధన ఆరంభించాడు. ఈ క్రమంలో, న్యాయకళాశాలలో తన సహాధ్యాయిగా పరిచయమైన నైలియా హంటర్ (Neilia Hunter) ప్రేమలో పడి, 1966లో ఆమెని వివాహం చేసుకున్నాడు.

Google ad

న్యాయవాద జీవితంలో ఉండగా జో బైడెన్ దృష్టి రాజకీయాల మీదకి మళ్లింది. 1970 ప్రాంతంలో డెమొక్రాటిక్ పార్టీలో సభ్యుడిగా నమోదు చేసుకుని, ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటం ప్రారంభించాడు. 1972లో డెమొక్రాటిక్ పార్టీ తరపుని అమెరికా అత్యున్నత విధాన సభ ‘సెనెట్’కి పోటీ చేసి అనూహ్య విజయం సాధించి, 29 ఏళ్ల వయసులో ఆ సభకి ఎన్నికైన పిన్నవయస్కుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు.

తొలిసారి సెనెటర్‌గా ప్రమాణస్వీకారం చేసేలోగానే జో బైడెన్ జీవితంలో ఓ మహావిషాదం చోటుచేసుకుంది. 1972 డిసెంబర్‌లో ఆయన భార్య, కుమార్తె ఓ రహదారి ప్రమాదంలో మరణించారు. పసితనంలోనే ఉన్న ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనతో కుంగిపోయిన జో బైడెన్ ఆత్మహత్యాలోచన చేసినట్లు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

మిగిలిన ఇద్దరు కుమారుల ఆలనాపాలనా చూసుకోవటం కోసం ఆయన సొంతవూరిలోనే నివాసం ఉంటూ, సెనెటర్ హోదాలో ఉన్నప్పటికీ ఓ సాధారణ ఉద్యోగిలా నిత్యం రైల్లో ప్రయాణించి రాజధాని వాషింగ్టన్ డి.సి. కి వెళ్లివచ్చేవాడు. ఆయన సెనెటర్‌గా ఉన్న ముప్పై ఆరేళ్ల పాటూ ఇదే అలవాటు కొనసాగింది. (ఈ విషయంలో మన భారతీయ పార్లమెంట్ మెంబర్లని ఓ సారి పోల్చి చూడండి).

సెనెటర్‌గా వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన బైడెన్, ముప్పై ఆరేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో చట్టాల రూపకల్పనలో పాలుపంచుకోవటమే కాకుండా, అమెరికన్ విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేశాడు. సెనెటర్‌గా ఉంటూనే 1987లో డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీచేయటానికి విఫల యత్నం చేశాడు. ఆ తర్వాత 20 ఏళ్లకి, 2007లో మరో మారు అధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్ధి స్థానం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, ఈ సారి పార్టీ అభ్యర్ధిగా రంగంలో ఉన్న బరాక్ ఒబామా విజ్ఞప్తిని మన్నించి, ఒబామాకి తోడుగా ఉపాధ్యక్ష అభ్యర్ధిగా రంగంలోకి దిగాడు.

ఈ జంట 2008 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అద్వితీయ విజయం సాధించింది. ఆ తర్వాత 2012 నవంబర్లో మరోమారు విజయం సాధించింది. అలా ఒబామా-బైడెన్ ఎనిమిదేళ్ల పాటు అమెరికా అధ్యక్ష-ఉపాధ్యక్ష పదవుల్లో కొనసాగి, తీవ్ర ఆర్ధిక మాంద్యంతో కునారిల్లుతూ తమ చేతికొచ్చిన దేశాన్ని తిరిగి గాడిన పెట్టినవారిగా చరిత్రలో మిగిలిపోయారు. రాజకీయాల్లో యువకుడైన ఒబామాకి, తలపండిన జో బైడెన్ జత కలవటం వల్ల; ఉదారవాద ఒబామా విధానాలని, మధ్యేవాద బైడెన్ విధానాలు సమతూకంలో ఉంచేవి. సౌమ్యుడిగా పేరొందిన జో బైడెన్ ఇటు సొంత డెమొక్రటిక్ పార్టీనే కాక అటు ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ నాయకులని కూడా కలుపుకుపోతూ కార్యాలు చక్కబెట్టటంలో దిట్ట అని పేరొందాడు. ఒబామా ఓ సందర్భంలో జో బైడెన్‌ని, ‘అమెరికా చరిత్రలో అందరికంటే గొప్ప ఉపాధ్యక్షుడు’ అని ప్రశంసించటం జరిగింది.

ఉపాధ్యక్షుడిగా తన ఎనిమిదేళ్ల హయాం ముగింపుకొస్తున్న దశలో జో బైడెన్ వ్యక్తిగత జీవితంలో మరో విషాదం సంభవించింది. 2015లో, బైడెన్ పెద్ద కుమారుడు బ్యూ బైడెన్ (Beau Biden) కాన్సర్‌తో పోరాడుతూ 46 ఏళ్ల వయసులో మరణించాడు. (ఈ సమయంలో కుమారుడి ఆసుపత్రి ఖర్చులకి, అతని కుటుంబాన్ని ఆదుకోవటానికి అవసరమైన నిధుల కోసం ఉపాధ్యక్షుడు జో బైడెన్ తన సొంత ఇంటిని అమ్మకానికి పెట్టబోగా, అధ్యక్షుడు ఒబామా వారించి అవసరమైన మొత్తం తాను సర్దుబాటు చేస్తానని చెప్పాడట)

మొదటి భార్య మరణించిన ఐదేళ్ల తర్వాత, 1977లో జో బైడెన్ జిల్ ట్రేసీ జాకబ్స్ (Jill Tracy Jacobs) అనే ఉపాధ్యాయురాలిని వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ ఆష్లీ బైడెన్ (Ashley Biden) అనే కుమార్తె. జో బైడెన్ తొలి కళత్రం ద్వారా కలిగిన ఇరువురు కుమారుల్ని కూడా ఈమె సొంత తల్లిలా సాకిందని అంటారు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎనిమిదేళ్ల పాటూ, సెకండ్ లేడీ హోదాలో ఉంటూ కూడా ఈమె తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించింది. ఆ హోదాలో ఉద్యోగం చేసిన తొలి ‘ద్వితీయ మహిళ’గా జిల్ బైడెన్ చరిత్రకెక్కింది.

ఉపాధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన నాలుగేళ్ల తర్వాత, అధ్యక్ష స్థానానికి డెమొక్రటిక్ పార్టీ తరపున తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించాడు జో బైడెన్. అయితే ఆయన అభ్యర్ధిత్వం ఖరారు కావటం నల్లేరు మీద నడకేమీ కాలేదు. ఆరు నెలల పైగా సుదీర్ఘంగా సాగిన డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియలో – తొలి దశల్లో పాతతరపు జో బైడెన్ ఉదారవాద అభ్యర్ధుల ధాటికి వెనకపడిపోయాడు. ఆయన వయసు (77 ఏళ్లు) కూడా అభ్యర్ధిత్వానికి అడ్డంకిగా మారింది. సౌమ్యుడు కావటం వల్ల ప్రత్యర్ధి పార్టీ తరపున రంగంలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు, మొరటు రాజకీయాలకి పేరొందిన డొనాల్డ్ ట్రంప్ ముందు తేలిపోతాడనే అంచనాలు కూడా జో బైడెన్ వెనకపడటానికి దోహదపడ్డాయి. అయినా డీలా పడకుండా ముందుకి సాగి, క్రమంగా పుంజుకుని, ఆఖరికి పార్టీ అభ్యర్ధిత్వాన్ని సాధించాడు జో బైడెన్.

తనకి జతగా, ఉపాధ్యక్ష స్థానానికి అభ్యర్ధిగా కమలా దేవి హారిస్ (Kamala Devi Haris) ని ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశాడు. కమలా హారిస్ భారతీయ మూలాలు, ఆమె నల్లజాతి మూలాలు, ఆమె మహిళ కావటం – ఇవి కాదు ఆశ్చర్యానికి కారణం. ప్రైమరీ ఎన్నికల్లో జరిగిన డిబేట్ల సందర్భంగా ఉదారవాది ఐన కమలా హారిస్ ఏ విధంగా జో బైడెన్‌పై దాడి చేసిందో చూసిన వారికి, ఈ ఎంపిక ఆశ్చర్యకరమే. అయితే – ఆ పని చేయటం జో బైడెన్ కలుపుగోలు తత్వాన్ని, తనకి భిన్నమైన వాదన కూడా అర్ధం చేసుకునే గుణాన్ని ఎత్తిచూపుతుంది.

ఇక – అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ప్రచారం కూడా అత్యంత సంయమనంతో సాగింది. ట్రంప్ వ్యక్తిగత దూషణలతో ఎంత కవ్వించినా జో బైడెన్ ఆ ఉచ్చులో పడకుండా తన ప్రచారాన్ని ఎక్కువగా తన పాలన ఏ విధంగా ఉండబోతోందనే విషయమ్మీదనే కేంద్రీకరించాడు. మరోపక్క కరోనా వైరస్ దాడిని ఎదుర్కునే విషయంలో ట్రంప్ సర్కార్ ఒక విధానం అంటూ లేకుండా ప్రవర్తించటం కూడా జో బైడెన్‌కి కలిసొచ్చింది. నవంబర్ 3, 2020 నాడు జరిగిన ఎన్నికల్లో బైడెన్-హ్యారిస్ జంట సుమారు 53 లక్షల వోట్ల తేడాతో, 306-232 ఎలక్టొరల్ కాలేజ్ స్థానాలతో ట్రంప్-పెన్స్ జంటపై స్పష్టమైన విజయం సాధించింది. అమెరికా చరిత్రలో ప్రత్యర్ధిపై ఇంత ఎక్కువ ప్రజాదరణ వోటు ఆధిక్యత సాధించిన అభ్యర్ధి మరెవరూ లేరు!

జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండవ రోమన్ కేతలిక్. 1961లో జాన్ కెనడీ ఆ ఘనత సాధించిన తొలి కేతలిక్. ఇరువురికీ ఐరిష్ మూలాలు ఉండటం విశేషం. అధ్యక్ష ఎన్నికల్లో మతం పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ, కీలకమైన కొన్ని రాష్ట్రాల్లో విజయానికి అభ్యర్ధుల మత ప్రాధాన్యతలు, నమ్మకాలు కూడా దోహదపడతాయి. ముఖ్యంగా – ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ల ఆధిక్యత ఉండే రాష్ట్రాల్లో విజయం అధ్యక్ష ఎన్నికల ఫలితాలని నిర్ణయిస్తుంది. ఆ రాష్ట్రాల్లో, సంప్రదాయకంగా కేతలిక్‌లంటే పొసగని ప్రొటెస్టంట్‌లని కూడా ఆకట్టుకుని గెలవటం ఆషామాషీ కాదు. గత ఎన్నికల్లో ట్రంప్ వెంట నిలచిన సంప్రదాయవాద ప్రొటెస్టెంట్లలో చాలామందిని తనవైపుకు తిప్పుకోవటం బైడెన్ విజయానికి దోహద పడింది. అలాగే – 28 ఏళ్ల తర్వాత తొలిసారిగా జార్జియా రాష్ట్రంలో, 24 ఏళ్ల తర్వాత తొలిసారి అరిజోనా రాష్ట్రంలో విజయపతాక ఎగరవేసిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా జో బైడెన్ రికార్డు సృష్టించాడు. (2004, 2008 ఎన్నికల్లో ఒబామా వెల్లువలో కూడా ఈ రెండు రాష్ట్రాలు రిపబ్లికన్ అభ్యర్ధులనే గెలిపించటం గమనార్హం.)

జో బైడెన్ అధ్యక్షత 2021 జనవరి 20 నాడు మొదలవుతుంది. ప్రస్తుతానికి ప్రపంచమంతా ఈయన్ని తదుపరి అమెరికా అధ్యక్షుడిగా గుర్తిస్తున్నా, ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన ఓటమి అంగీకరించక మొండిగా వ్యవహరిస్తుండంతో, బైడెన్‌కి అధికార బదలాయింపు ప్రక్రియలో తాత్సారం జరుగుతోంది. అయితే బైడెన్ మాత్రం తదుపరి అధ్యక్షుడి హోదాలో (president-elect) ఇప్పటికే తన పని ప్రారంభించేశాడు. అమెరికన్ మీడియా సైతం – ఇంతకు ముందెన్నడు లేని విధంగా – ప్రస్తుత అధ్యక్షుడిని పట్టించుకోవటం మానేసి, రాబోయే అధ్యక్షుడి విధాన ప్రకటనలు, వ్యవహారాలకే అధిక ప్రాముఖ్యత ఇస్తోండటం ఒక విశేషం!

అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రయాణం అత్యంత కఠిన పరీక్షలనెదుర్కోబోతోంది. కోవిడ్-19 వల్ల కుదేలైన ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టాల్సి ఉంది. ట్రంప్ అసమర్ధత, నాయకత్వ లేమి వల్ల నాలుగేళ్లలో అమెరికా ఎన్నో విధాలుగా నష్టపోయింది. అన్నిటినీ మించి, ట్రంప్ విభజన రాజకీయాల వల్ల అమెరికా సమాజంలో వచ్చిన చీలిక ఇప్పుడప్పుడే పోయేది కాదు. ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ పూర్తిగా ట్రంప్ కుటుంబం చేతిలో ఆటబొమ్మగా మారిపోవటం వల్ల, ట్రంప్ అధ్యక్ష పదవి నుండి దిగిపోయాక కూడా, ఆ పార్టీని అడ్డుపెట్టుకుని అమెరికన్ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమం కొనసాగించే అవకాశం ఉంది. ఒక రకంగా జో బైడెన్ పరిస్థితి 1860లలో అబ్రహాం లింకన్ ఎదుర్కొన్న పరిస్థితి లాంటిది. మరి ఆయన ఎలా నెట్టుకొస్తాడో వేచి చూద్దాం.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading