
జామ చెట్లు ఉష్ణమండలానికి చెందిన చెట్లు. ప్రపంచమంతా జామను పండిస్తున్నా వీటి జన్మస్థలం అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం. ఇవి మిర్టాసియా కుటుంబానికి చెందినవి. జామ చెట్లను విత్తనాలు మరియు గ్రాఫ్టింగ్ పద్ధతుల ద్వారా పెంచుతారు. జామ కాయలను నేరుగా తినటానికే కాక జెల్లీలు, జామ్ తయారీలో కూడా వాడతారు.
జామ ఆకులు పచ్చగా సుమారుగా ఒకటి నుండి మూడు అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వీటిపూలు చాలా చిన్నగా ఉంటాయి. తెల్లగా నాలుగు రేకలతో ఉంటాయి. ఈ పూలే జాయకాయలుగా మారుతాయి. జామకాయలు గుండ్రంగా లేక కోలగా ఉంటాయి. జామకాయ పైభాగం ఆకుపచ్చగా ఉండి లోపలి కండభాగం తెల్లగా లేక లేత గులాబీ రంగులో ఉంటుంది.
జామకాయలు సంవత్సరమంతా కాస్తాయి. కానీ వర్షాకాలం ముగిసిన తరువాత వీటి దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
జామ కాయలలో A,B,C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.