
కథాకళి అంటే నృత్యం ద్వారా ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన నాట్యరూపం. ఇందులో నేత్రా చలనాలు, ఆహార్యం ప్రధానంగా నర్తిస్తారు. ఇందులో రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుంచి మరియు పురాణాలనుంచి పాత్రలను ప్రదర్శిస్తారు. ఈ కళ వివిధ రకాలైన రంగులతో దేదీప్యమానంగా ఉంటుంది. కళాకారులు ధగ ధగ మెరిసే ఆభరణాలు, కిరీటాలు, దుస్తులతో ఆకట్టుకుంటారు. వివిధ రకాలైన పాత్రలకు అనుగుణంగాఅలంకరణ చేసుకుంటారు.
మానవులు, దేవతలు, రాక్షసులు మొదలగు రూపాలను ప్రదర్శించడానికి తగిన దుస్తులను, అలంకరణ సామాగ్రిని వాడతారు. ఈ కళకున్న ప్రత్యేకత కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావ భావ ప్రకటనల తోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటిస్తారు. ముఖంలో కనిపించే చిన్న మరియు పెద్ద కదలికలు, కనుబొమలు, కను గుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా నేర్పుగా కదుపుతూ వివిధ భావాలను ప్రకటిస్తారు. ఏయే భావాలకు ఏయే విధంగా వీటిని కదిలించాలన్నది కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. పురుషులు స్త్రీ వేషధారణ కూడా ధరిస్తారు. కానీ ఇప్పుడు స్త్రీలు కూడా ఈ కళలో ప్రవేశించారు.
ఈ రంగంలో ప్రముఖులు గురుగోపీచంద్, చంపకులం పరమపిళ్లై, వళ్లోత్తోల్ నారాయణన్, మీనన్ మొదలగు వారు.
Raju's Resource Hub