ప్రశాంత్ కొన్నేళ్లుగా క్రెడిట్ కార్డు వాడుతున్నారు. కొన్ని ఇతర అప్పులూ ఉన్నాయి. వాయిదాలూ, కార్డు బిల్లును ఆలస్యం చేయకుండా చెల్లిస్తుంటారు. కానీ, క్రెడిట్ స్కోరు మాత్రం 700 లోపే ఉంటోంది. దీనికి కారణం ఏమిటో తెలియడం అతనికి అర్ధం కావడం లేదు. సుధీర్ ఇంటి రుణాన్ని తీసుకున్నారు. వాయిదాలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా కచ్చితంగా చెల్లిస్తున్నారు. కార్డునూ పరిమితంగా వాడుతూ ఉంటారు. అతని స్కోరు ఎప్పుడూ 800 తగ్గకుండా ఉంటోంది..
ఇక్కడ ఇద్దరూ బిల్లులను సకాలంలో చెల్లించినా.. ప్రశాంత్ స్కోరు మాత్రం పెరగడం లేదు. ఇలాంటివి చాలామందికి జరుగుతూనే ఉంటాయి. రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కొన్నిసార్లు బిల్లులు చెల్లించినా స్కోరు స్తబ్దుగానే ఉంటుంది. దీనికి ఇతర కారణాలు అనేకం ఉంటాయి. అధిక క్రెడిట్ వినియోగం: మీ క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో క్రెడిట్ వినియోగ నిష్పత్తి కీలక పాత్ర పోషిస్తుంది. చాలామంది క్రెడిట్ కార్డులను పరిమితి మేరకు ఉపయోగిస్తుంటారు. ఇలాంటప్పుడు వారు సమయానికి బిల్లు చెల్లించినా సరే స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి, క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడకుండా ఉండటమే ఎప్పుడూ మంచిది.
అన్ని రకాల రుణాలు: కేవలం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులను వాడటంలాంటివి మాత్రమే చేస్తున్నారా? ఇలాంటప్పుడు స్కోరు తగ్గే అవకాశాలున్నాయి. హామీతో కూడిన అప్పులూ ఉన్నప్పుడే రుణదాతలు మిమ్మల్ని మంచి రుణగ్రహీతగా చూస్తారు. వివిధ రకాల అప్పులు ఉండి, వాటికి సకాలంలో వాయిదాలు చెల్లించినప్పుడు స్కోరు పెరుగుతుంది. పైన ఉదాహరణలో సుధీర్ స్కోరు పెరిగేందుకూ, ప్రశాంత్ స్కోరు తగ్గడానికి కారణాలు ఇవే.
రుణ దరఖాస్తులు: కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా రుణాలకు దరఖాస్తు చేస్తుంటారు. ఇది స్కోరును తగ్గిస్తుంది. రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడల్లా, బ్యాంకు ఆ వివరాలను క్రెడిట్ బ్యూరోలకు చేరవేస్తుంది. కొన్నిసార్లు బ్యాంకుల వినియోగదారుల సేవా కేంద్రం పేరుతో రుణాలు తీసుకోవాలని ఫోన్లు వస్తుంటాయి. మీరు సరే అని పాన్, ఇతర వివరాలు చెప్పారనుకోండి.. ముందుగా మీ క్రెడిట్ స్కోరును తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే, మీరు రుణానికి దరఖాస్తు చేసినట్లుగానే ఇక్కడ నమోదవుతుంది.
నివేదికలో లోపాలు: కొన్నిసార్లు క్రెడిట్ నివేదికలో లోపాలుండొచ్చు. ఇలాంటప్పుడు రుణగ్రహీత ఎంత కచ్చితంగా ఉన్నా స్కోరు పెరగదు. పూర్తిగా చెల్లించిన రుణాల వివరాలు కనిపించకపోవచ్చు. కొన్ని చెల్లింపులు నమోదు కాకపోవచ్చు. అందుకే, క్రెడిట్ నివేదికను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏమైనా వ్యత్యాసాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు, క్రెడిట్ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి.
హామీ ఉండటం: కొంతమంది రుణాలు తీసుకోరు. కానీ, ఇతరుల రుణానికి హామీ సంతకం చేస్తుంటారు. వారు రుణ వాయిదాలను సకాలంలో తీర్చకపోతే, అది మీ స్కోరు పెరగకుండా చూస్తుంది.
ఏం చేయాలి?
కొన్నాళ్లుగా మీ క్రెడిట్ స్కోరు పెరగకుండా ఉంటే.. మీరు చేయాల్సిన పనులేమిటంటే.. • రుణ వినియోగ నిష్పత్తిని తగ్గించండి. కొన్నాళ్లుగా వీలైనంత తక్కువగా క్రెడిట్ కార్డును వాడండి. • కొత్త అప్పులు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. • చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్న క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవద్దు. • నీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్ స్కోరును తనఖీ చేసుకోవడం మర్చిపోవద్దు.
Raju's Resource Hub
