
ఈనెల్లాంటి ఆకులు, చూడచక్కని రంగులతో పెంచుకున్న ప్రదేశానికి కళ తెచ్చిపెడుతుంది కాశీరత్నం పూల మొక్క. దీన్ని గోడలు, కంచెలు, ఆర్చ్‌లు, పోర్టికోలమీదకు ఎక్కించొచ్చు. వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. సైప్రస్ వైన్, స్టార్ గ్లోరీ అనే పేర్లూ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
.జమైకాలో మాత్రం దీన్ని ఇండియన్ క్రీపర్ అంటారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా క్వామోక్లిట్. ఇది కన్వోల్వులేసి కుటుంబంలోని తీగ జాతి మొక్క. ఇది సుమారు మూడు నుంచి పది అడుగుల వరకూ పెరుగుతుంది. దీనిపూలు బూర(ట్రంపెట్) ఆకృతిలో కనిపిస్తూ నక్షత్రాన్ని పోలి ఉంటాయి. ఎరుపు, గులాబీ, తెలుపు వర్ణాల్లో విరబూస్తాయి.

ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే అలంకరణ మొక్కగా సైప్రస్ వైన్ ప్రసిద్ధి. ఇది ఆరోగ్యంగా పెరగాలంటే పూర్తి ఎండ, కాంతి అవసరం. మట్టిలో తేమ ఉండాలి. ఈ తీగ సులువుగా ఎదగాలంటే తేలిగ్గా, సారవంతంగా ఉండే మట్టిని ఎంచుకోవాలి. లేదంటే ముందుగా ఆ నేలలో కంపోస్ట్ని కలుపుకొని సిద్ధం చేసుకోవాలి. దీనికి ఆధారం ఇస్తే చక్కగా అల్లుకుపోతుంది. దీన్ని పూనింగ్ చేయడం ద్వారా నచ్చిన ఆకృతిలో పెంచుకోవచ్చు. పూలు పూశాక వాటిని తీసేయడం మంచిది. ఈ తీగకు చీడపీడల సమస్య కూడా తక్కువే. అంతేకాదు, ఈ కాశీరత్నం పూలలో ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతోంది ఆయుర్వేదం. ముఖ్యంగా ఇవి ఫంగస్ని అడ్డుకోవడంతో పాటు అతిమూత్రవ్యాధినీ, మలబద్ధకాన్నీ అదుపులో ఉంచుతుందట.
Raju's Resource Hub
