అరుణాచలం గొప్ప శైవపుణ్య క్షేత్రం. స్మరించినంత మాత్రమే ముక్తిని ప్రసాదించే దివ్వక్షేత్రమంటారు. తమిళంలో తిరువణ్ణామలై అని పేరు. అరుణాచలం వేదాలలో మరియు పురాణాలలో కూడా ప్రస్తావించిన క్షేత్రం. సాక్షాత్తు శివాజ్ఞచే విశ్వకర్మ అరుణాచలంను నిర్మించాడంటారు. ఇక్కడ పూజా విధానం మరియు అరుణాచల స్తోత్రం శివుడే గౌతమ ముని ద్వారా నిర్ధేశించాడని అరుణాచల మహాత్యంలో వివరించబడినది. ఈ కొండకు తూర్పున గల అరుణాచల క్షేత్రం కంటే ఈ కొండకే ప్రాముఖ్యం ఎక్కువ. జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్యక్షేత్రం అరుణాచలం.
అరుణాచలం జ్యోతిర్లింగమని చెప్పబడుచున్నది. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల మాదిరిగా ఇక్కడి శివుడు అగ్నిరూపంలో దర్శనమివ్వడు. కేవలం రాతి లింగంగానే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడి ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటారు ఇక్కడే అనేక పవిత్ర తీర్ధాలు ఉన్నవి. బ్రహ్మతీర్ధం, వ్యాసతీర్ధం, శివగంగతీర్ధం మొదలగునవి. ఒక్కొక్క తీర్ధంలో స్నానమాచరిసే ఒక్కోక్క రకమైన ఫలితం దక్కుతుందంటారు. పంచభూత లింగాలో ఒకటైన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు.
చోళరాజు 910 శతాబ్ధాల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ క్షేత్రానికి నాలుగు వైపుల నాలుగు రాజగోపురాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుంటాయి. అన్నిటి కంటే ఎత్తైనది తూర్పు గోపురం. ఈ గోపురం ఎత్తు 217 అడుగులు. ఈ ఆలయం 25 ఎకరాలలో విస్తరించి ఉన్నది. శ్రీకృష్ణదేవరాయలచే నిర్మింపబడిన వేయి స్తంభాల మండపం, కోనేరు సందర్శకులను ఆకట్టుకుంటాయి. అరుణగిరిపై స్కంధాశ్రమం, విరుపాక్ష గుహ ఉన్నాయి. అక్కడే రమణ మహర్షి ఎన్నో రోజుల పాటు ధ్యానముద్రలో ఉండేవారట.
స్థలపురాణం
పూర్వం బ్రహ్మ, మహా విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు కలహించుకొన్నారట. సృష్టికర్త అయిన బ్రహ్మ.. స్థితికారుడైన విష్ణువు శివమాయకు వశం కావడం ఈ కలహానికి కారణమైంది. శివ మాయా మోహితులైన వీరిని మాయా మేఘం కమ్మేసింది. దీంతో ఇరువురి మధ్య అహంకారం ప్రజ్వరిల్లి కలహానికి దారితీసిందట.
‘నేను సృష్టికర్తను. నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది’ అని బ్రహ్మ.. ‘నేను స్థితికారుడను. అన్నీ సవ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప’ అని విష్ణువు అనడం ఇద్దరి మధ్య ఎడతెగని చర్చకు, వాదోపవాదానికి దారితీసిందట. ఏ మాయవల్ల వారు కలహానికి దిగారో అది తెలియాలని ఇరువురి మధ్య పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిశాడట. అనంతరం బ్రహ్మ, విష్ణువులిద్దరినీ ఈ జ్యోతిస్తంభం ఆది, అంతములు తెలుసుకొని రమ్మన్నాడట.
వరాహమూర్తియై శ్రీమహావిష్ణువు జ్యోతిర్లింగం ఆదిని తెలుసుకోవడానికి భూమిని తవ్వుకొంటూ పాతాళలోకం దాటి వెళ్లిపోగా, పైన ఉన్న కొనభాగాన్ని తెలుసుకోవడానికి హంసనెక్కి చతుర్ముఖ బ్రహ్మ.. వూర్థ్వముఖానికి వెళ్లారట. అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేశారట. బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయారట. ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలిపువ్వును పట్టుకుని అడిగారట.. ‘నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు?’ అని. అప్పుడు మొగలిపువ్వు ‘నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా’ అని సమాధానమిచ్చిందట. ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కేతకీపుష్పాన్ని బ్రహ్మ అడగగా, అందుకు అది సమాధానమిస్తూ ‘నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయింది’ అని చెప్పిందట.
ఆద్యంత రహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలిపువ్వుతో బ్రహ్మ ఈ విధంగా అన్నాడట. శివలింగం పై భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కేతకీపుష్పం అంగీకరించిందట. అప్పుడే అక్కడకు వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడట. దీంతో ఆ రెండింటినీ తీసుకుని పరమశివుడి వద్దకు చేరాడట బ్రహ్మ. అప్పటికే మాయమేఘం వీడిపోయిన శ్రీమహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజం ఒప్పుకొన్నాడట. అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలిపువ్వు, కామధేనువులే సాక్షి అని చెప్పాడట బ్రహ్మ. మొగలిపువ్వు అవును అని సమాధానమివ్వగా, కామధేనువు తలతో ఔనని, తోకతో కాదు అని సమాధానమిచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు ‘నువ్వు భూలోకంలో పూజాదికాలు లేకుండా ఉండుగాక’ అని బ్రహ్మను శపించాడట. అసత్యాన్ని పలికిన మొగలిపువ్వును పూజకు పనికి రావనీ, సగం నిజం, సగం అబద్ధం చెప్పిన ఆవు ముఖానికి పూజలేకుండా కేవలం పృష్టానికి మాత్రమే పూజలందుకుంటావనీ శపించాడట. ఆనాడు అలా వెలసిన అగ్నిస్తంభాన్ని బ్రహ్మ ప్రార్థన చేశాడట. ‘మా అహంకారం పోయింది.
అసలు పరబ్రహ్మ స్వరూపమేదో, ఆద్యంతములు లేనిదేదో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసిన మీరు భూ లోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగమన్న పేరుతో భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థన చేశారు. ఆ కారణంతోనే పరమశివుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలశాడన్నది పురాణగాథ.
గిరి ప్రదక్షణ అరుణాచలం జ్యోతిర్లింగ స్వరూపం కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గిరి ప్రదక్షణకు చాలా వరకు తారురోడ్డు ఉంది. ప్రక్కనే ఫుట్‌పాత్ కూడా ఉంది. ఉదయం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేకువ జామున గానీ, రాత్రి గానీ గిరి ప్రదక్షణ చేస్తారు. గిరి ప్రదక్షణాన్ని శ్రీ రమణమహర్షి ఆశ్రమంనుండి ప్రారంభించి దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తారు. మధ్యలో పాళెతీర్ధం, గళశగుడి, అగస్త్యతీర్ధం, ద్రౌపదీ గుడి, స్కంధాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణ తీర్ధం, నైరుతీ లింగం, హనుమాన్ గుడి, ఉణ్ణావలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్ధం, రామలింగేశ్వరాయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరీ ఆలయం, గౌతమ ముని ఆశ్రమం, పూర్యలింగం, వరుణలింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకా మాత ఆలయం, వాయిలింగం, అక్షరమండపం, ఈశాన్యలింగం, ప్రవాళపర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమంను దర్శించచవచ్చు. గిరి ప్రదక్షణ మొత్తం దూరం 14 కి.మీ.

అరుణాచల మహాత్మ్యం – గౌతముని పూర్వగాథ & గిరి ప్రదక్షిణ మహాత్యం.
గౌతమ మహర్షి తల్లి పార్వతితో ఇట్లు చెప్పెను . పరమశివుని ఆజ్ఞ ఒకసారి కైలాసములో నాకు ప్రాప్తించినది. అదేమనగా తీర్థయాత్రలు చేయమని . శివాజ్ఞ నెరవేర్చుటకై నేను అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించితిని. అనేక శివక్షేత్రములు దర్శించితిని. కొన్ని స్వయంభు లింగములను కూడా దర్శించితిని. శివ స్మరణతో భూమండలమంతా తిరిగి తిరిగి ఈ అరుణాద్రి లింగమును చేరుకుంటిని. ఇక్కడ సేవించు మహాపురుషులను చూచి నా తపము ఫలించెనని పర్వత రూపమున నిలిచిన ఈ లింగము మరెక్కడ లేదని గ్రహించితిని. శివుని స్తుతించితిని. నా ప్రార్థనను విని పరమశివుడు ప్రసన్నుడై దర్శనమిచ్చి అనునిత్యము నన్ను ఈ అరుణాద్రి సన్నిధియందే ఉండి అర్చించి తపమాచరించి శివ మహాత్మ్యమును సర్వజీవులకును తెలియచేయుమని పరమేశ్వరుడు ఆనతినిచ్చెను. కావున ఈ అరుణాచలములో కనిపించే గిరి మామూలు కొండకాదు.సాక్షాత్తు పరమశివుడు పర్వత రూపముగా నిలిచిన లింగము అని ఎరుంగవలెను. ఆనాటి నుండి గౌతమ మహర్షి శివుని ఆజ్ఞను మరువక అరుణాద్రిని విడువక అక్కడే నివశించుచుండెను. అంత గౌరీదేవి గౌతముని పూర్వగాధ విని అరుణాచలగిరి ప్రదక్షిణ మహాత్మ్యమును తెలుపమని కోరెను. గౌతముడిట్లు చెప్పెను. పరమేశ్వరుడు నాకిట్లు ఆనతిచ్చెను.
1 నా గిరి ప్రదక్షిణ మాత్రమున సర్వ పుణ్యతీర్ధములలో స్నానము చేసిన ఫలితము కల్గును.
2 అరుణగిరి ప్రదక్షిణముచే అన్ని శాస్త్రముల పారంగతత్వము లభించును.
3. సమస్త యజ్ఞకర్మముల ఫలితము దక్కును .
4 మానసిక వాక్కు శారీరక సంబంధించిన పాపములు నశించును .
5 అరుణగిరి చుట్టు ఎందరో సిద్ధులు, దేవతలు మరియు మహర్షుల ఆశ్రమములున్నవి.
6 ఈ గిరి అగ్నిమయమని దానిలోపల గుహ ఉన్నదని తెలిసికొనుము.
7 ప్రదక్షిణ చేయునపుడు ధ్యానించుకొనుచు మెల్లగా ప్రదక్షిణ చేయవలెను .
8. ఎవరి చేయిని పట్టుకొనక నిండు గర్భవతివలె అడుగులో అడుగువేస్తూ ప్రదక్షిణ చేయవలెను.
9 . అడుగుల చప్పుడు కూడా వినపడరాదు .
10 దారిలో నడుచుచున్నప్పుడు మనువులు, దేవతలు, సిద్ధులు మొదలగువారు నడుచురుని గుర్తించి వారి దారికి అడ్డురాక నడువవలెను.
11 శివ నామ సంకీర్తనము చేయవలెను.
12 దారిలో బీదలకు దానము చేయవలెను.
13 నడుచువారి బాధ్యతను నేనే (శివుడు) చూచుకొందును.
14 అరుణగిరి ప్రదక్షిణ చేయువారి పాదములను మోయుటకు అనేక దేవతల వాహనములు పోటీపడును.
15 ప్రదక్షిణ చేసిన వారికి శివప్రాప్తి కల్గును.
16 ప్రదక్షిణ చేసినవారికి తక్షణమే వారి శరీరము వజ్ర శరీరమైపోవును.
17 ప్రదక్షిణ చేయువారికి వారు ఎంత భక్తి ప్రపత్తులతో చేయుచున్నారో అని దేవతలు అదృశ్యరూపులై గమనించుచుందురు.
18 సోమవారం ప్రదక్షిణ అజరామరత్వమిచ్చును.
19 మంగళవారం ప్రదక్షిణ సార్వభౌమత్వము నిచ్చును.
20 బుధవారము పాండిత్యమొసంగును.
21 గురువారం గురుత్వమును సంపాదించును.
22 శుక్రవారము విష్ణు పదమును పొందించును.
23 శనివారం గ్రహపీడ వదిలి జయము ప్రాప్తించును.
24 ప్రదక్షిణ చేయువారు పాదములకు దెబ్బ తగిలి రక్తము కారినచో దేవేంద్రుడు ధరించు మందార పువ్వు పొడిచే ఆ రక్తము తుడువబడును.
25 రాళ్ళు తగిలి నొప్పి కల్గిన మహాలక్ష్మి శరీరముపై పూయబడు కుంకుమ లేపనముతో తొలగింపబడును.
26 ప్రదక్షిణము చేయువారు స్వర్గములో మణిపర్వత శృంగములపై విహరించి కల్పవృక్షచ్ఛాయలో విశ్రమింతురు.
పై విధముగా గౌతముడు ఆ పరమేశ్వరుడు తనకిచ్చిన ఆనతిచే పార్వతీదేవికి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ మహాత్మ్యమును వివరించెను.
అరుణాచలశివ..! అరుణాచలశివ…!! అరుణాచలశివ…!!!
కార్తీక పౌర్ణమినాడు ఇక్కడ భారీ వేడుక జరుగుతుంది. మూడు టన్నుల ఆవునెయ్యితో కొండమీద పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. దక్షిణభారతంలో వెసిన పంచలింగాలలో అరుణాచలం అగ్నిక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది.
పంచభూత లింగాలు
అరుణాచం – అన్నామలైశ్యరుడు – అగ్నిలింగం
జంబుకేశ్వరం – జంబుకేశ్వరుడు – జలలింగం
ఏకాంబరేశ్వరుడు – కంచి – పృద్వీలింగం
శ్రీకాళహస్తి – శ్రీకాళహస్తీశ్వరుడు – వాయిలింగం
అరుణాచల దేవాలయ విశిష్టతలు ఈ దేవాలయానికి నాలుగు ప్రక్కలా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు నాలుగు రాజగోపురాలున్నాయి. పాతాళ లింగం, పెద్దనంది, వేయి స్థంబాల మండపం కలవు.
కిలిగోపురం (చిలక గోపురం) అరుణగిరినాధర్‌కు సంబంధించినది ఇది. గోపురంపై చిలకను చూడవచ్చు. అరుణగిరి నాధుడు చిలకరూపంలో ఇక్కడ ఉండిపోయాడంటారు. దీనిని భళ్ళాల మహారాజు కట్టించాడంటారు.
తమిళనాడులోని దేవాలయాలన్నీ మధ్యాహ్నం గం.12-30 మూసివేస్తారు. తిరిగి సాయంత్రం గం.4-00గంటలకు తెరచి 8-30 లేక 9-00 గం.కు మూసివేస్తారు.
గిరి ప్రదక్షణ చేయు భక్తులకు సూచనలు 14 కి.మీ. గిరి ప్రదక్షణ చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షణ చేయు సమయంలో బరువైన సామాన్లు, సంచులు లేకుండా వెళితే ప్రయాణం సునాయాసంగా ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షణ కష్టంగా ఉంటుంది. ఎండ మరియు ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి.
గిరి ప్రదక్షణ ఉదయం 9 గంటలలోపు గాని రాత్రి పూటగాని, తెల్లవారు జామున గాని చేయటం మంచిది. పౌర్ణమి రోజున ఎక్కువ మంది గిరి ప్రదక్షణ చేస్తారు. కనుక కొత్తవారు ఆరోజున గిరి ప్రదక్షణ చేయటం మంచిది. గిరి ప్రదక్షణ చేసేటప్పుడు చిల్లర తీసుకుపోవటం మర్చిపోవద్దు.
రమణమహర్షి ఆశ్రమం అరుణాచలేశ్వర దేవాలయానికి 2 కి.మీ దూరంలో రమణమహర్షి ఆశ్రమంను చూడవచ్చు. విదేశీయులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.ఆశ్రమానికి సాయంత్రం వేళలో వెళితే ప్రార్థనలో పాల్గొని రమణల వారి సమాధి చూడవచ్చు. ఆశ్రమంలో కోతులు, నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి.
ప్రయాణసదుపాయాలు చెన్నై నుండి అరుణాచల క్షేత్రం (తిరువణ్ణామలై) 189 కి.మీ దూరంలో ఉంది. చెన్నై సెంట్రల్ నుండి రైలు లేక బస్సులలో వెళ్లవచ్చు.
అరుణాచలంలో వసతి సౌకర్యాలు….
శివసన్నిధి
తెలుగు వారిచే నిర్వహించబడుచున్న…శివసన్నిధి అరుణాచలం గుడికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఆటోలకు రూ.50- తీసుకుంటారు. రూమ్ లకు అద్దె తీసుకోరు. కానీ తప్పనిసరిగా కొంత డోనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డోనేషన్ బట్టి గదులు కేటాయిస్తారు. గది కేటాయించబడితే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా పెడతారు. డోనేషన్ మన ఇష్టం వచ్చినంత ఇవ్వవచ్చు. శివసన్నిధికి ఫోన్ చేసి గదులు రిజర్య్ చేసుకోవచ్చు. లేక డైరెక్ట్ గా వెళ్ళవచ్చు.
ఫోన్ నెం: 04175-235089. సెల్ : 9789378779.
శేషాద్రి ఆశ్రమం
అరుణాచలం గుడికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ నార్మల్ డీలక్స్, ఏ.సి.(రూ.800) గదులు కలవు. ఫోన్ చేసి గదులు బుక్ చేసుకోవచ్చు.
ఫోన్ నెంబర్లు 04175-236999, 238599.
రమణాశ్రమం
ఈ ఆశ్రమం కూడా అరుణాచలం గుడికి రెండుకిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆశ్రమంలో గదులు అప్పటికప్పుడు దొరకవు. కనీసం 15 నుండి 20 రోజుల ముందుగా బుక్ చేసుకోవలసి ఉంటుంది. ashramam@sriramanamaharshi.org ఈ మెయిల్ కు ముందుగా గదుల రిజర్వేషన్ కొరకు వివరాలు పంపవలసి ఉంటుంది. గదులు దొరికితే గది అద్దె, భోజనం ఉచితం.
ఈ ఆశ్రమంలోనే రమణ మహర్షి సమాధి ప్రాంగణం ఉంది. ఆశ్రమం చాలా ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. గుడి చుట్టుప్రక్కల హోటల్స్ ఉన్నాయి కానీ చాలా ఖరీదు.
Tiruvannamalai in 1960

Raju's Resource Hub