Logo Raju's Resource Hub

Srikalahasti ….శ్రీకాళహస్తి

Google ad

చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తిలో సువర్ణముఖీ నదికి తూర్పు తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. కాళహస్తిలోని శివలింగం స్వయంభువు. శివలింగమునకు ఎదురుగా ఉన్న దీపం లింగంనుండి వచ్చు గాలికి రెపరెపలాడుతుంది. అందువలన ఈ శివలింగాన్ని వాయిలింగం అని కూడా అంటారు. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది. గ్రహణ కాలాల్లోనూ తెరచివుంచే గుడిగా ఈ శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది! ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. శ్రీకృష్ణదేవరాయల ఆస్ధానకవులలో ఒకరైన ధూర్జటి కవి తన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఈ క్షేత్రాన్ని గురించి వివరిస్తాడు.శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రం కన్నప్ప, పాము, సాలెపురుడు, ఏనుగు భక్తితో ముడిపడి ఉంటుంది. ఈ మూడు జీవులు శివుణ్ణి ఆరాధించి శివైక్యం చెందుతాయి. దేవాలయమునకు సమీపమునే చిన్న కొండపై భక్తకన్నప్పకు చిన్న ఆలయం కట్టబడింది. భక్తకన్నప్ప శివభక్తుడు. కన్నప్ప భక్తిని పరీక్షించటానికి ఒకరోజు శివుడు తన కన్నునుండి రక్తం కారుస్తాడు. అప్పుడు కన్నప్ప తన కన్ను తీసి శివలింగానికి అమరుస్తాడు. అప్పుడు శివుని రెండవ కంటినుండి కూడా రక్తం వస్తుంది. కన్నప్ప తన రెండవ కంటిని కూడా తీసి శివలింగానికి అమరుస్తాడు. కన్నప్ప భక్తికి సంతసించిన శివుడు ప్రత్యక్షమై కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.

ఆలయ ప్రత్యేకత :
ఈ దేవాలయం చాలా పెద్దది. పైకప్పుకు రంగుతో చిత్రించిన అనేక చిత్రాలను దర్శించవచ్చు. ఆదిశంకరాచార్యులవారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీగా కూడా పిలుస్తారు. రాహుకేతు సర్పదోషా నివారణకు దేవాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి.

దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి తమ దోషనివారణార్ధం పూజు జరిపించుకుంటారు. అమ్మవారి సన్నిధికి సమీపం నుండి కొన్ని గోపురాలను దర్శించవచ్చు.ఈ దేవాలయంలో ఇంకో విశిష్టతకూడా ఉంది. పాతాళగణపతి ఉత్తరంగా, అమ్మవారు తూర్పు ముఖంగా శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగా, దక్షిణామూర్తి దక్షిణముఖంగా ఉంటారు. ఆలయానికి నాలుగుదిక్కులా కళ్ళుచెదరే నాలుగు గోపురాలు ఉంటాయి భారతీయ కళకు నిలువెత్తు నిదర్శనాలు. 120 ఎత్తున్న రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించాడు. ఇక్కడ ఇంకా అనేక శివలింగాలను మహర్షులు దేవతలు ప్రతిష్టించారు. అగస్త్యుడు నీకంఠేశ్వరలింగం, బృగుమహర్షి అర్ధనారీశ్వరలింగాన్ని, వ్యాసభగవానుడు, మార్కండేయుడు మృత్యుంజయేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, పరశరాముడు కూడా ఇక్కడ శివలింగాను ప్రతిష్టించారు. సప్తర్షులు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు, ధర్మరాజు కూడా ఇక్కడ శివలింగాలను ప్రతిష్టించారు.

ప్రత్యేక మంటపాలు : ఈ ఆలయంలో చక్కటి శిల్పకళతో ఉన్న మంటపాలు చూపరులను ఆకర్షిస్తాయి. నగరేశ్వర మంటపం, గుర్రపుసాని మంటపం, రాయల మంటపం (నూరుకాళ్ళ మంటపం), కోటమంటపాలను చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయలచే కట్టించబడిన నూరుకాళ్ళమంటపంలో చక్కని శిల్పకళను చూడవచ్చు. శ్రీకృష్ణ దేవరాయల సోదరుడు అచ్యుతరాయల పట్టాభిషేకం క్రీ.శ.1529లో నూరుకాళ్ళ మంటపంలో జరిగింది.

Google ad

ఈ ఆలయ పరిసరాలో 36 తీర్ధాలు ఉన్నాయంటారు. అందులో కొన్ని ముఖ్యమైనవి సహస్రలింగాల తీర్ధం, హరిహర తీర్ధం, భరద్వాజతీర్ధం, మార్కండేయతీర్ధం, మూకతీర్ధం, సూర్యచంద్ర పుష్కరిణి. ఇక్కడ రాహుకేతు క్షేత్రం మరియు దక్షిణామూర్తులను దర్శించవచ్చు.

ఉత్సవాలు
మహాశివరాత్రికి ఇక్కడ ఏడురోజులపాడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. అనేక ప్రాంతాలనుండి భక్తులు విశేషంగా ఈ ఉత్సవాలకు వస్తారు. ఆలయ దర్శన వేళలు: ఉదయం 4.30 గంటలకు మంగళ వాయిద్యాలతో స్వామిని మేల్కొలుపుతారు. అప్పటినుంచి రాత్రి 9.30 గంటలకు ఏకాంత సేవ ముగిసే వరకూ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎలాంటి విరామం లేకుండా సర్వదర్శనం ఉంటుంది! గ్రహణ కాలాల్లోనూ స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఈ దేవాలయం తెరిచే ఉంటుంది!

వసతి సౌకర్యం
భక్తుల కోసం ఆలయం తరఫున పలు అతిథి గృహాల్లో అందుబాటులో ఉన్నాయి. నామమాత్రపు అద్దెలతో భక్తులు ఇక్కడ వసతి పొందవచ్చు. అలాగే పట్టణంలోనూ పలు ప్రభుత్వ/ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు.. అద్దెగదులు లభిస్తాయి. ఆ వివరాలతోపాటు.. ఆలయంలో జరిగే వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు… ముందస్తు బుకింగ్‌ల కోసం… 08578- 222240 నెంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

శ్రీకాళహస్తికి ప్రయాణసౌకర్యాలు
ఈ క్షేత్రానికి అన్ని ముఖ్యప్రాంతాలనుండి రైలు మరియు రోడ్డు మార్గాలు ఉన్నాయి. తిరుమల క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలొ ఉంటుంది. తిరుమలకు వెళ్ళినవారు తప్పనిసరిగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటారు. విజయవాడ వైపు నుండి వెళ్లేవారు `విజయవాడ`తిరుపతి రైలు మార్గంలో శ్రీకాళహస్తిలో దిగవచ్చు. తిరుపతి బస్‌స్టేషన్‌నుండి ప్రతి 10ని॥కు ఆర్‌ టి సి బస్సులు కలవు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading