Logo Raju's Resource Hub

హర్షద్ మెహతా

Google ad

1954లో గుజరాత్‌లో పుట్టి, జేబులో నలభై రుపాయలతో, కళ్ళలో కోటి కలల్తో బొంబాయికి వచ్చాడు. బీకాం చదివాక ఎనిమిదేళ్ళు ఏవేవో ఉద్యోగాలు చేస్తూ 1980లో ఒక స్టాక్ బ్రోకర్ వద్ద చిన్న ఉద్యోగంలో చేరాడు. అలా స్టాక్ మార్కెట్లపై ఇష్టం, జ్ఞానం పెంచుకుని 1984లో గ్రోమోర్ పేరుతో బ్రోకెరేజ్ సంస్థను స్థాపించాడు.

1990కి పదిహేను వేల చదరపు అడుగుల ఇల్లు, విదేశీ కార్లతో బొంబాయి సంపన్న వర్గాల్లో సూపర్‌స్టార్ అయ్యాడు. పలు ప్రముఖులు అతని సంస్థలో పెట్టుబడులు పెట్టారు. 1992లో సుచేతా దలాల్ వెలికితీసిన నిజాలతో పేకమేడలా అతని సామ్రాజ్యం కూలిపోయింది.

ఇంతకూ అతను చేసిన స్కామ్ ఏంటి?

ముందు కాస్త నేపథ్యం.

Google ad

1991లో వ్యవస్థలో పెనుమార్పులకు తెరతీశారు అప్పటి ప్రధాని నరసింహారావు గారు. అయితే దానివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేట్ రంగం నుంచి ఎదురైన పోటీ బాగా ఒత్తిడి తెచ్చింది. దానికి తోడు ప్రైవేట్ సంస్థల వేగవంతమైన వ్యాపార విస్తరణ బ్యాంకులకు అప్పటి వరకు చూడని కొత్త సవాళ్ళనిచ్చాయి. ఫలితంగా బ్యాంకులు వారి లాభాలను ఎక్కువ చేసుకునేందుకు కొత్త మార్గాలు కనిపెట్టాయి.

బ్యాంకులన్నీ స్టాచుటరీ లిక్విడిటీ నిష్పత్తి (SLR) పాటించవలసి ఉంటుంది (కనీస నగదు/నగదు సంబంధ హామీ అనుకోవచ్చు). ఇది 1990ల్లో ఎక్కువగా 38.5% ఉండింది. అందువల్ల బ్యాంకులు మూలధన కొరతతో అప్పటి బుల్ స్టాక్ మార్కెట్ల నుండి ప్రయోజనం పొందలేకపోయాయి. దానికి వారు కనిపెట్టిన మార్గం రెడీ ఫార్వర్డ్ డీల్స్ (RFD) – ఇవి ప్రభుత్వ బాండ్లను తనఖా పెట్టుకుని బ్యాంకులు వేరే బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలు.

ఈ డీల్స్ కొరకు పబ్లిక్ డెట్ ఆఫీస్ (PDO) అనే సంస్థను RBI మొదలుపెట్టినా, అప్పట్లో ప్రభుత్వ సంస్థల్లో సర్వవ్యాప్తి అయిన రెడ్‌టేప్ దెబ్బకు PDOను వాడకుండా బ్యాంక్ రసీదులను (BR) బదిలీ చెయ్యటం మొదలుపెట్టాయి. ఈ రసీదులను అమ్మి, కొనే ధరల్లో తేడాను ఆ రుణాలకు వడ్డీ కింద జమ చేసుకునేవారు.

BRల బదిలీ ప్రక్రియలో బ్రోకర్లు ప్రవేశించారు. బ్యాంకులూ గోప్యత, ద్రవ్యత్వం వంటి ప్రయోజనాల వల్ల ఈ బ్రోకర్ల సేవలను వాడుకోవటం మొదలుపెట్టాయి. ఇక్కడే హర్షద్ మెహ్తా బ్రోకర్‌గా తన తెలివిని పనిలో పెట్టాడు. ఒక బ్యాంకు BRల కొనుగోలుకు ఇచ్చే చెక్కులను తన పేరున ఇచ్చేలా చేశాడు. ఆ నగదును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడికి వాడేవాడు. మరో బ్యాంకు నుండి నగదు తెచ్చి మునుపు లావాదేవీని పూర్తి చేసేవాడు. ఇలా ఒక చెయిన్‌లా బ్యాంకుల నుండి నగదును మార్పిడి చేస్తూపోయాడు.

అలా వచ్చిన నగదుతో తన వద్దకు వచ్చిన సంస్థల షేర్లను పంప్-అండ్-డంప్ (తక్కువ ధరకు చాలా ఎక్కువ షేర్లు కొని, ఫలితంగా ఆ షేరు ధర పెంచేసి, ఎక్కువకు అన్నీ అమ్మేయటం) చేసేవాడు. ఉదాహరణకు: సిమెంటు సంస్థ ACC షేరు ధర రెండు నెలల్లో 200 నుండి 9000లకు చేరింది.

బ్యాంకులకు ఈ తతంగమంతా తెలిసినా, లాభాల్లో కొంత వారికి ఇస్తున్నందున హర్షద్ మెహ్తాను పట్టించుకునేవారు కాదు. ఏమయినా చివరకు వారి వాటాదార్లకు లాభాలు చూపటమే ముఖ్యోద్దేశ్యం ఏ సంస్థకైనా! అయితే ఇంతదాకా హర్షద్ మెహ్తా చేసింది చట్టవిరుద్ధమేమీ కాదు. వ్యవస్థలోని ఒక లొసుగును ఎక్స్‌ప్లాయిట్ చేశాడంతే.

కానీ తన విలాసవంతమైన జీవనానికి బ్యాంక్ ఆఫ్ కరాడ్, మెట్రొపాలిటన్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లతో కలిసి నకిలీ BRలను చలామణీ చెయ్యటం మొదలుపెట్టాడు. ఇది అతను చేసిన తప్పు. అయితే అతని విదేశీ కార్లు ఒకరోజు పాత్రికేయురాలైన సుచేతా దలాల్ కంట పడ్డాయి. కుతూహలం మొదలై, నెమ్మదిగా తీగ లాగి డొంకంతా కదిలించిందావిడ.

నేటికీ స్టాక్ మార్కెట్ నిపుణుల్లో కొందరు ఆయనను ప్రేరణగా చూస్తారు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading