
సాధారణంగా అరటి మొక్కను అరటి చెట్టు అంటారు. కానీ ఇది చెట్టు కాదు. ఒక రకంగా మొక్కే. ఈ మొక్కకు ప్రత్యేకంగా కాండం అంటూ ఉండదు! ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి. అరటి శాస్త్రీయ నామం… మూసా అక్యునిమిటా(అడవి అరటి). అరటి పండ్లను సంస్కృతంలో రంభాఫలం, కదలీఫలం అనీ హిందీలో ఖేలా, ఇంగ్లిష్ లో బనానా అంటారు.
అరటి మొక్కలు సాధారణంగా.. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.. వీటికి సీజన్ అంటూ లేకుండా.. సంవత్సరం పొడవునా పంట వస్తుంది. అరటి మొక్కకు చాలా బరువున్న అరటిగెలలు కాస్తాయి. కానీ తుపానులు, బలమైన గాలులకు తట్టుకోలేవు. పడిపోతాయి. అరటి మొక్కలో అన్ని భాగాలు పనికివస్తాయి. పచ్చి అరటి కాయలు, పువ్వులు, మొవ్వ (లేతకాండం)ను కూడా కూరలుగా వండుకుంటారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరటిలో చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా కూర అరటి, పండు అరటి (తినే) రకాలు పండుతాయి. పసుపు రంగు అరటిపండే ఎక్కువగా కనబడుతుంది. కానీ వీటిలో ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులో ఉన్న అరటి పండ్లూ ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, యూరప్ లోఎక్కువగా పెరుగుతుంటాయి. పక్వానికి రాగానే అరటి మొక్కల నుంచి గెలలను కోసి మాగబెడుతుంటారు.
ఒకవేళ గెలలను కోయకుండా అలాగే ఉంచినా.. పండటానికి చాలా ఆలస్యమవుతుంది. తొక్క రంగూ బాగుండదు. పండు అంత రుచి ఉండదు. సాధారణంగా కొద్దిగా పక్యానికి వచ్చేదాకా ఉంచి సహజ పద్ధతులలో మాగపెట్టే అరటి కాయలు చాలా రుచిగా ఉంటాయి. కానీ ప్రస్తుతం అరటిగెలలను ద్రావణంలో ముంచి మాగపెడుతున్నారు. అడవి అరటిలో విత్తనాలుంటాయి. ప్రస్తుతం మర్కెట్ లో లభించే అరటిపండులో విత్తనాలుండవు. మొదళ్ల నుంచి కొత్త పిలకలు వచ్చి మరలా అవి అరటి మొక్కలుగా తయారవుతాయి.
అరటి పండు తింటే వెంటనే శక్తి వస్తుంది. 75 శాతం నీరు ఉంటుంది. అరటి పండులో కెలోరీలు తక్కువే. సాధారణంగా ఓ పండులో దాదాపు 95 కెలోరీలు ఉంటాయి. ఈ పండ్లలో సోడియం, పొటాషియం, విటమిన్, సి, ఫైబర్, విటమిన్ బీ6 ఉంటాయి.
పూజలు, పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇలా ఏ శుభకార్యం జరిగినా అరటిపండ్లు ఉండాల్సిందే . మధుమేహ వ్యాధితో బాధపడేవారు అరటి పండ్లను తినకూడదని పరిశోధనలు తెలుపుతున్నాయి. అరటి మొక్కలు పెరగాలంటే సారవంతమైన నేల కావాలి. నీరూ ఉండాలి. ఒకసారి గెలవేశాక… ఆ చెట్టు ఇంక పనికిరాదు. అదే చెట్టు మొదలులో వచ్చిన పిలకలు పెరిగి పెద్దవవుతాయి. ఒకప్పుడు భోజనం చేయాలన్నా పార్సిల్ కట్టాలన్నా అరటి ఆకులను వాడేవారు.. ఇప్పుడు మాత్రం కేవలం పండగలలో, పర్వదినాలలో మాత్రమే అరటి ఆకులలో తింటున్నారు. కానీ అరటి ఆకులలో వేడి వేడి పదార్ధాలు వడ్డించుకుని తింటే అరోగ్యం చేకూరుతుందంటారు మన పెద్దలు. ప్రస్తుతం అరటి కాండాన్ని ఉపయోగించి పర్యావరణానికి హాని చేయని ప్లేట్లు, సంచులు తయారు చేస్తున్నారు.
Raju's Resource Hub