
నేరేడు చెట్టుకు గిన్నె చెట్టు అనే మరో పేరూ ఉంది. ఇంగ్లీషు భాషలో మలబార్ ప్లమ్, జావా ప్లమ్, బ్లాక్ ప్లమ్.. అంటూ అంటారు. ఈ చెట్లను ఎక్కువగా పండ్ల కోసమే పెంచుకుంటారు.
నేరేడు చెట్టు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని. ఇంకా మిర్టేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. భారత్ తోపాటు శ్రీలంక, పాకిస్థాన్ ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఫిలిప్పీన్స్ మయన్మార్ ఆస్ట్రేలియా, ఫిజి, చైనాలోనూ కొద్దిగా ఈ చెట్లు కనబడుతాయి.
ఆషాఢం మాసంనుండి నేరేడు పండ్లు మార్కెట్ లో లభిస్తాయి.
నేరేడు చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. దాదాపు 90 అడుగుల వరకూ పెరుగుతాయి. ఆకులు దళసరిగా ఉంటాయి. నేరేడు చెట్లు నీరులేని కరవు పరిస్థితుల్లోనూ తట్టుకుని బతకగలదు. ఈ చెట్ల జీవితకాలం వంద సంవత్సరాలు.
నేరేడు కాయ ఏర్పడినపుడు పచ్చగా ఉంటుంది. తర్వాత ఎర్రగా మారుతుంది. పక్వానికి వచ్చేసరికి నిగనిగలాడుతూ నల్లగా తయారవుతుంది.
నేరేడు జాతిలో ఉన్న రకాల్ని బట్టి కాయల పరిమాణంలోనూ తేడాలుంటాయి. కొన్ని గుండ్రంగా పెద్దగా ఉండే రకానివి. ఇంకొన్ని కోలగా పెద్దగా ఉంటాయి. కొన్ని గుండ్రంగా చిన్నగా ఉంటాయి. వీటిని చిట్టి నేరేడు అంటుంటారు
ఈ పండ్లు పోషకాల గనులు. ఔషధ గుణాలు కలవి. వీటిలో విటమిన్ సీ, ఇనుము పుష్కలం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కడుపునొప్పి, గుండె జబ్బులు, ఆస్తమా, మధుమేహం, క్యాన్సర్లతోపాటు ఎన్నో వ్యాధులు నియంత్రణలో ఉండటానికి సహాయపడతాయి
ఈ చెట్ల ఆకులూ, బెరడూ ఔషధ విలువలున్నవే. ఈ చెట్ల కలపను వ్యవసాయ పరికరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎడ్ల బండికి చక్రాలూ తయారు చేస్తారు. ఇళ్లకు కిటికీలు, తలుపుల్లాంటివీ తయారు చేస్తారు
Raju's Resource Hub