Logo Raju's Resource Hub

డిసెంబరాలు

Google ad

డిసెంబరాలు

డిసెంబరాలు ఊదా, లావెండర్ రంగులలో ఊదా తెలుపు చారలతో ఉండే నాజూకైన పూలతో సంక్రాంతి సమయంలో విరగబూసే డిసెంబరాలు తెలియని తెలుగు ఆడపడుచులుండరేమో. వీటిని గొబ్బిపూలు, పెద్దగోరింట అని కూడా అంటారు. ఫిలిఫైన్స్ వయోలెట్, బ్లూబెల్, బర్లేరియా అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా. డిసెంబరాల జన్మస్థానం మనదేశమే. పల్లెటూళ్లలో ఇళ్లముందు రోడ్లపక్కగా ఎక్కువగా కనిపించే మొక్కలు ఇవి. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అంకరించుకోవడానికి, దేవుడికి అర్పించడానికీ వాడతారు. విపరీతంగా పూసే ఈ పూలు లేత రంగులో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా ఎన్ని పెట్టుకున్నా బరువనిపించవు. ఇక చాలనిపించవు. డిసెంబరాలు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్న పొద. ఆకులపైవైపు కంటే కిందివైపు లేత రంగులో ఉంటాయి. గరాటు ఆకారంలో గుత్తులుగా పూసే పూలుసాధారణంగా ఊదా, గులాబీ రంగుల్లో ఉంటాయి. అలాగే తెలుపు రంగులోపూసే అల్ఫారకం కూడా సాధారణమే. ఇది ఎండతోపాటు కొద్దపాటి నీడలో కూడా పెరుగుతుంది. చీడపీడలు తక్కువే……. డిసెంబరాలు తేమగా ఉన్నచోట చక్కగా పెరుగుతాయి. అయితే నీళ్లు నిలవకూడదు. పూలు పూసిన వెంటనే కత్తిరిస్తూ ఉంటే మంచిది. ఎండలలో తప్ప సంవత్సరం అంతా పూసే ఈ మొక్క డిసెంబరు మాసంలో విపరీతంగా పూయడం వల్ల దీనికి డిసెంబరాలు అనే పేరు వాడుకలో ఉంది. దీన్ని అప్పుడప్పుడూ కత్తిరిస్తూ ఉంటే క్రమపద్ధతిలో గుబురుగా పెరుగుతుంది. అలాగే కత్తిరించి వేర్వేరు ఆకారాల్లో పెంచుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. బోర్డరుగా పెంచుకున్నా చక్కగా ఉంటుంది. రెండు మొక్కలు కుండీల్లో నాటుకుంటే పూజకు పూలగురించి ఆలోచించనవసరం లేదు. డిసెంబరాలుకు చీడపీడలు తక్కువే. రసంపీల్చే పురుగులు ఆశించకుండా అప్పుడప్పుడూ ఆకు కషాయం చల్లుతూ ఉంటే సరిపోతుంది. అక్టోబర్ నుంచి రెండు వారాలకోసారి పాలీఫెడ్ వంటి సమగ్ర ఎరువును నీళ్లలో కలిపి పోస్తుంటే బాగాపూస్తుంది. వర్మీకం పోస్టు ఎముకలపొడి, వర్మీవాష్ వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించినా ఫరవాలేదు. డిసెంబరాలను గింజలు, కొమ్మ కత్తిరింపులు, పిలకలు, ఇలా వేటి ద్వారానైనా సరే సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. తేనెటీగలను, సీతాకోకచిలుకలను, హమ్మింగ్ పక్షులను విపరీతంగా ఆకర్షించే డిసెంబరాలకు ఔషధగుణం కూడా ఎక్కువే. ఆకుల రసాన్ని కాలిన గాయాలకు వాపు తగ్గడానికి రాస్తారు. దీని గింజలను పాముకాటుకు విరుగుడుగా వాడతారు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading