Logo Raju's Resource Hub

గడ్డిగులాబి

Google ad

పోర్చులక, నాచుమొక్క, గడ్డిగులాబి….. ఈ మొక్కలు ఎలాంటి ల్యాండ్ స్కేప్ లోనైనా అత్యంత సహజంగా పెరిగి అందరినీ ఆకట్టుకొంటుంది. దీన్నే సన్ రోజ్ మాస్ రోజ్ అనికూడా అంటారు. ఈ మొక్కలు పూర్తిగా సూర్యకాంతిలో పెరుగుతాయి. గడ్డిగులాబీ శాస్త్రీయనామం పోర్చులక. వీటిలో గ్రాండీఫ్లోరా. ఒలరేషియా రకాలుంటాయి. గ్రాండీఫ్లోరా ఆకులు సన్నగా సూదుల్లాగా ఉంటాయి. ఒలరేషియా ఆకులు కొంచెం కోలగా ఉంటాయి. ఒలరేషియా ఆకులను సలాడ్లలో కూడా వాడతారు. వీటి గింజలను కూడా సలాడ్లలో సూపులలో వాడతారు. మనం ఆకుకూరగా వాడే గంగపాయల కూరకు ఇది సమీప బంధువు.
నీటిని నిల్వ ఉంచుకుంటుంది
ఈ మొక్కలు అన్ని నేలల్లోనూ పెరిగినా ఇసుక కలిసిన, నీరు, నిలవని మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. నిస్సారమైన నేలల్లో కూడా ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకోవడంలో కూడా దీనికిదే సాటి. ఒకసారి చిన్నమొక్కనో, గింజనో నాటితే దానంతట అదే చుట్టూ వ్యాపిస్తుంది. మందంగా ఉండే దీని ఆకులు నీటిని నిల్వ ఉంచుకుంటాయి. కనుక తరచూ నీళ్లు పోయనవసరం లేదు. నీళ్లు పోసినప్పుడు కూడా పైపైన పోస్తే చాలు. ఎందుకంటే దీని వేళ్లు ఎక్కువ లోతుకు వెళ్లవు. రాళ్లమధ్య కొంచెం మట్టిలో నాటినా చక్కగా పెరిగి అందమైన పూలతో కనువిందు చేస్తాయి. గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపూవు రంగు, మీగడ రంగు, తెలుపు ఇలా ఈ పూలు ఎన్నో రంగులలో విరబూస్తాయి. వాటన్నింటిని కలిపి నాటితే ఇంద్రధనస్సు మీ ముంగిట్లో పరచుకున్నట్లే కనువిందు చేస్తుంది.
ఎడాదంతా పూలు
ఈ మొక్క మూడునుంచి నాలుగు అంగుళాల ఎత్తులో పెరిగి దాదాపు రెండు అడుగుల వరకూ వ్యాపిస్తుంది. నిజానికి ఏకవార్షికం. అయితే ఎప్పటికప్పుడే విత్తనాలు పడి పెరుగుతూ బహువార్షికాన్ని తలపిస్తుంది. దీని ఆకులు ముదురు రంగుల్లోనూ కొమ్మలు కొద్దిగా ఎరుపురంగు కలిసిన పసుపు రంగులోను ఉంటాయి. పగలు విచ్చుకుని రాత్రికి ముడుచుకునే వీటిపూలు ఆకారంలో కాక్టస్ పూలను పోలి ఉంటాయి. ఈ పూలు ఒంటి రెక్కలతో ఉన్నా ముద్దగా ఉన్నా ఒకే రంగులోనైనా, మిశ్రమ రంగులలోనైనా వీటికివే సాటి. ఈ మొక్కలను లాన్ పక్కన, బోర్డరుగాను, గ్రౌండ్ కవర్ గాను, బెడ్లలో, రాకరీల్లో, కుండీలలో, వేలాడే కుండీలలో, మిశ్రమ అమరికల్లో పెంచినా కూడ ఇట్టే ఒదిగిపోతుంది. సులువుగా పెంచుకోవచ్చు
కటింగ్ ద్వారాగానీ, గింజల ద్వారాగానీ, దీన్ని సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. దీన్ని నాటినప్పుడు కొద్దిగా డి ఏ పి, తర్వాత పూలు పూస్తున్నప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువుని కొద్దికొద్దిగా వేస్తే చాలు. లేదా వర్మీకం పోస్టు, కోడిగుడ్డు పెంకులను మట్టిలో కలిపినా సరిపోతుంది. ఈ మొక్కకు చీడపీడలు పెద్దగా ఆశించవు. వేరుకుళ్లు మాత్రం ఆశించవచ్చు. అందుకే నీళ్లు నిలవకుండా చూసుకోవడం చాలా అవసరం. మరీ గుబురుగా అల్లుకుపోతుంది. కనుక మధ్య మధ్య కొన్ని కొమ్మలు తీసేస్తే గానీ గాలి సరిగా తగలదు. అప్పుడే తెగుళ్లు రాకుండా ఉంటాయి. ఈ గడ్డి గులాబీలు అతిసాధారణమైనవైనా వీటిని చూస్తుంటే ఆ విషయమే గుర్తుకు రాదు. ఎవరి చూపులనైనా ఇట్టే కట్టిపడేస్తాయనవి. వీటి అందం మిరుమిట్లు గొలిపేలా కాకుండా పసిపిల్లల్ని చూసినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక గడ్డి గులాబీలున్నప్పుడు తోటను సీతాకోకచిలుకలు ఇట్టే శాశ్వతస్థావరం చేసుకుంటాయి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading