క్రికెట్లో ఒక్క ఓవరైనా సరిగ్గా ఆడటం చేతకాని వ్యక్తి… సెంచరీ బాదగలదా? అది సాధ్యమయ్యే పనేనా? మరి స్టాక్ మార్కెట్లో ఓనమాలే తెలియని వ్యక్తి.. పేర్ల వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ని అవుతాననో, మనల్ని కోటీశ్వరులను చేస్తాననో చెబితే ఎలా సమ్ముతాం? ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే ఒక్కో అడుగూ వేస్తూ ముందుకెళ్లాలి. ముందుగా ఒక ఓవర్లో ఆ ఆరు బంతులు ఎలా ఆడాలో నేర్చుకోవాలి.. ఒక్కో పరుగు ఎలా రాబట్టాలో శిక్షణ తీసుకోవాలి తర్వాతే పోర్టూ సిక్సులూ శతకాలూ!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగైనా అంతే… దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఏ వ్యాపారమూ అంతా పైకి రప్పించినట్లే బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. లోపల బోలెడు సాంకేతిక అంశాలు ఉంటాయి. వాటన్నింటి పట్లా అవగాహన పెంచుకోవాలి. కనీసం ఒకటి రెండు నెలల్లోనైనా బాబాలు వచ్చాయా! లాభాలు సాధించడంలో నా సమర్థత ఎంత? పోనీ నష్టాలనైనా అదుపులో పెట్టుకోగలుగుతు న్నానా? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అదేమీ లేకుండా ఎవరో చెప్పారని కోటీశ్వరుణ్ని అయిపోతానని కలలు కంటూ చేతిలో ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టుబడి పెట్టేయడం తెలివైన వారి లక్షణం కాదు. కొందరైతే అంతటితో ఆగకుండా దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి మరీ స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. తమతో పాటు తమను నమ్ముకున్న వారి జీవితాలనూ నట్టేట్లో ముంచుతున్నారు. కష్టపడనిదే ఒక్క రూపాయీ రాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. దాన్ని విస్మరించి అవగాహనలేమితో కష్టార్జిత మంతా షేర్లపాలు చేసి ఆ తర్వాత అప్పుల పాలవుతున్న వారి రథలు ఈ మధ్య తరచూ వింటూనే ఉన్నాం
అలాగని స్టాక్ మార్కెట్ జోలికి అసలే వెళ్లకూడదా అంటే… వెళ్లొచ్చు. కానీ, ఆ వ్యవహారాలపై పట్టు సాధించే వరకు మీ సామర్థ్యం, నిర్ణయాల మీద మీకు నమ్మకం కుది రేవరకు. తక్కువ పెట్టుబడితోనే అనుభవం పెంచుకోవాలి. నష్టపోయినా తిరిగి భర్తీ చేసుకోగల ప్రణాళిక ఉండాలి. వన్డే క్రికెట్లో ఒక్కో జట్టు 300 బంతులు ఆడొచ్చు. ఒకవేళ పాతిక ముప్పై బంతులకే పది మందీ అవుట్ అయితే… 270 బంతులను ఆ జట్టు వృథా చేసుకున్నట్లేగా. డబ్బైనా అంతే… తొందరపాటుతో చేతిలో ఉన్న డబ్బంతా ఒకటి రెండు నెలల్లోనే కరిగించేస్తే…. ఆ తర్వాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే.
ఒక్కోసారి ఒక్క ఓవరే మ్యాచ్ని మలుపు తిప్పుతుంది. జీవితంలోనూ అలాంటి మలుపు కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని అస్త్రంగా చేసుకొని ఓపికగా ఎదురుచూడాలి. అప్పటివరకు పెట్టుబడి వనరులను జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే స్టాక్ మార్కెట్ అనే జూదాన్ని మనం ఎంత గొప్పగా ఆడామనే దానికన్నా మనకు అది కలిసి రానప్పుడు ఎంత త్వరగా బయటపడ్డామన్నదే ముఖ్యం.
Raju's Resource Hub
