ముగ్గు పెట్టడం ఓ కళ. అందరికీ రాకపోయినా సులువుగా వేసుకునే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేసుకోగలిగే కొన్ని రకాల్నీ తెలుసుకుందాం.
ఒకేసారి పెద్ద ముగ్గు పెట్టేయడం రాకపోవచ్చు. అలవాటు లేనివారు సరి చుక్కల ముగ్గుల్ని ఎంచుకుంటే సులువుగా కలిపేయొచ్చు. ఒకవైపు పెట్టాక మిగిలిన నాలుగు పక్కలూ కూడా అలానే పెట్టేయడం వల్ల గందరగోళం ఎదురుకాదు. అమ్మో చుక్కల ముగ్గే అంటారా? డిజైన్లూ గీయొచ్చు. కాస్త పెద్దగా ఉండే పువ్వులు, కుండ, చెరకు గడ వంటివి వేయడం సులువే. వీటిల్లో రంగునీ వేగంగా నింపొచ్చు.

ముగ్గుల్లో రంగులు నింపితే… పండుగ కళ వచ్చేసినట్లే. అలాగని వాటిని కొనక్కర్లేదు. పసుపు, కుంకుమ, నీలిమందు, పాలకూర రసం చాలు. వీటిని చిటికెడు చొప్పున బియ్యం, రవ్వ, పిండి… ఇలా దేంట్లోనైనా కలిపి ఆరబెట్టండి. కాస్త బొగ్గు పొడిని ఆయా రంగుల్లో వివిధ పరిమాణాల్లో కలిపితే.. మరిన్ని ఛాయలూ వస్తాయి. ఫుడ్ కలర్ని వాడుకోవచ్చు. ఇవి పక్షులకూ, కీటకాలకూ కూడా చక్కని ఆహారం.
ప్రకృతిలో దొరికే వివిధ రకాల పూలు, ఆకులతోనూ అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దోచ్చు. ముందుగా వివిధ రంగుల్లో ఉన్నవాటిని సేకరించుకుని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేలపై గుండ్రంగా నచ్చిన డిజైన్ని గీసుకుని అందులో వీటిని నింపేయొచ్చు. ఇంటి ముంగిట ఉర్లీ ఏర్పాటు చేసి పూల రేకలతోనూ తీర్చిదిద్దోచ్చు.
ఇవన్నీ కాదంటే పూర్వకాలం నాటి ముగ్గు గిరకలు ఇప్పుడు ఆన్లైన్తోపాటు, ఆఫ్లైన్లోనూ దొరుకుతున్నాయి. లేదంటే కోలమ్ స్టెన్సిల్స్నీ వాడుకోవచ్చు. రెడీమేడ్గా తయారు చేసిన రంగోలీలూ వచ్చేశాయి.

Raju's Resource Hub
