Logo Raju's Resource Hub

Mumps……. గవదబిళ్లలు

Google ad

ఉన్నట్టుండి జ్వరం పిల్లలకు దవడ వాచిపోయి, గవదబిళ్లలు మొదలైతే …….చూడటానికి చాలా భయంగా ఉంటుంది. నొప్పి వేధిస్తుంది. పెద్దల్లో వస్తే బాధలు కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి. అయినా… ఇది మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేం ఉండవు. అసలిదీ రాకుండా సమర్ధమైన టీకా ఉంది.

చిన్న ప్లిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవదబిళ్లలు ఒకటి. దీన్నే ‘మంప్స్‌’ అంటారు. ఆటలమ్మ, పొంగు మాదిరిగానే ఇది కూడా వైరస్‌ కారణంగా వచ్చే సమస్య. ఇది 5-9 ఏళ్ల మధ్య వయస్సు ప్లిల్లలలో ఎక్కువ. అయితే ఇది పెద్దల్లో కూడా రావచ్చు, పైగా పెద్దలకు వస్తే భాధలు కాస్త తీవ్రంగా ఉంటాయి. ఈ గవదబిళ్లల సమస్య ఏడాదంతా ఎక్కడోచోట కనపడుతూనే ఉంటుంది. కాని ఎండాకాలం నుంచి వర్షఋతువు మొదలయ్యే మధ్యలో అధికం. అలాగే 2-3 మూడేళ్లకు ఒకసారి ఇది విస్తృతంగా చాలా మందిని బాధపెడుతుంది.

ఎలా వస్తుంది? గవదబిళ్లలు ఉన్నవారు దగ్గినా, తుమ్మినా, లాలాజలం తుంపర్ల ద్వారా ఈ వైరస్‌ ఇతరుకు వ్యాపిస్తుంది. అందుకే జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో పిల్లలు కలివిడిగా తిరుగుతుండే స్కూళ్లు, హాస్టళ్లలో ఎక్కువగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే ఈ వైరస్‌ ఒంట్లో చేరిన తర్వాత బాధలు, లక్షణాలు మొదలవ్వడానికి 14 నుంచి 21 రోజులు పట్టవచ్చు. పూర్తిస్ధాయి గవదబిళ్లలు ఉన్న వారి నుంచే కాదు, తొలిదశ లక్షణాలున్న వారి నుంచి ఈ వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తుంది.

గ్రంథులలో స్ధావరం: గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ ప్రధానంగా గ్రంథుల్లో స్ధావరం ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత నాడుల మీద ప్రభావం చూపుతుంది. ముందుగా మామూలు ఫ్లూ మాదిరే ఇందులోను జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు నలతగా ఉన్నట్లు కనిపిస్తారు. ఈ సమయంలో చెంప దగ్గర …చెవిముందు భాగంలో ఉండే లాలాజల గ్రంధులు (పెరోటిడ్‌, సెలైవరీ గ్లాండ్స్‌) రెండువైపులా వాచి బాధపెడతాయి. ఈ గ్రంధుల వాచే సమయంలో కొందరికి చెవిపోటు కూడా రావచ్చు. దాదాపు 5-7 రోజుల్లో ఈ వాపు తగ్గుతుంది. వాపుతో పాటు జ్వరం తగ్గుముఖం పడుతుంది.

Google ad

సమస్య ముప్పు: గవదబిళ్లలు కేవలం లాలాజల గ్రంధులకే పరిమితం కాదు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఇతర భాగాలను ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా మగవారిలో వృషణాలు, ఆడవారిలో అండాశయాలు, అలాగే కాలేయం, క్లోమ గ్రంధుల్లోను వాపు రావచ్చు. చాలా అరుదుగా కొద్దిమందిలో చెవుడు కూడా రావచ్చు. సాధారణంగా 12-14 మధ్య వయస్సు మగప్లిల్లలలో వృషణాల వాపు కనపడుతుంది. ముఖ్యంగా గవద వాపు తగ్గుతున్న సమయంలో ( 7-10 రోజు మధ్య) ఒక్కసారి జ్వరం వచ్చి వృషణాలు బాగా నొప్పి చేసి విపరీతంగా బాధపడతారు.ఇక ఆడపిల్లల అండాశయాల వాపు మూలంగా పొత్తి కడుపులో నొప్పి జ్వరంతో బాధపడటం కనిపిస్తుంది. కొందరిలో కడుపు మధ్యలో నొప్పి, జ్వరంతో క్లోమగ్రంథి వాచిపోయి ‘పాంక్రియాటిస్‌’ కు దారితీయచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవసినది ఏమంటే ఇవన్నీ తాత్కాలికంగా బాధపెట్టేవే కాని వీటితో సాధారణంగా దీర్ఘకాలం ప్రభావితం చేసే తీవ్ర దుష్ప్రభావాలేమీ ఉండవు.

అరుదుగా ప్రమాదం: చాలా చాలా అరుదుగా గవదబిళ్లలకు కారణమయ్యే వైరస్‌ మెదడుకు వ్యాపించి మెదడు వాపు, (ఎన్‌కెఫలైటిస్‌) మెదడు పైపొరల్లో వాపు (మెనింజైటిస్‌) తెచ్చిపెట్టచ్చు. అయితే ఇవి అరుదు. పైగా సకాలంలో చికిత్సతో చాలా వరకు నయమయిపోతాయి.

పెద్ద అపోహ: గవదబిళ్లల కారణంగా మగపిల్లలకు వృషణాల వాపు వస్తే … పెద్దయ్యాక వారికి పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. గవదబిళ్లలు మూలంగా పిల్లలు పుట్టకపోవడం, పటుత్వం తగ్గటం వంటి ఇబ్బందులేమి ఉండవు.

పరీక్షలో నిర్థారణ: చాలావరకు లక్షణాల ఆధారంగా వైద్యులు దీన్ని నిర్థారిస్తారు. మరీ అవసరమైతే యాంటీబోడీ, ఐజీయమ్‌, ఐజిజి, వంటి పరీక్షలతో పాటు లాలాజల పరీక్షలు చేసి ఈ వైరస్‌ను నిర్ధారించుకోవచ్చు. పిసిఆర్‌ పరీక్ష ద్వారా మూత్రంలో లాలాజలంలో కూడా వైరస్‌ను గుర్తించవచ్చు. మెదడు వాపు వచ్చినపుడు మాత్రం వెన్ను నుంచి నీరు (సియస్‌యఫ్‌) తీసి పరీక్ష చేయాల్సివుంటుంది.

విశ్రాంతి కీలకం : గవదబిళ్లలకు ప్రత్యేకమైన మందులేమి లేవు. పిల్లలకు మెత్తటి ఆహారం, సరైన పోషణ, సపర్యలు, విశ్రాంతి ఇవ్వాలి. దవడకు వేడి నీటి కాపడం హాయినిస్తుంది. నొప్పులు తగ్గేందుకు పారాసిట్‌మాల్‌ మాత్రలు తీసుకోవచ్చు. కడుపులో నొప్పి వంటి ఇతరత్రా దుష్ప్రభావాలుంటే మాత్రం తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణ అవసరం. వీరికి అవసరమైతే స్టిరాయిడ్స్‌ వంటివి ఇస్తారు.
టీకాతో నివారణ: గవదబిళ్లలు రాకుండా చిన్నపిల్లలందరికి యమ్‌.యమ్‌.ఆర్‌ ( మంప్స్‌, మీజిల్స్‌, రూబెల్లా) టీకా ఇవ్వడం అత్యుత్తమం. దీన్ని మొదటి సంవత్సరంలో ఒకసారి బడికి వెళ్లేముందు 5 ఏళ్ల వయస్సులో ఇవ్వాల్సిఉంటుంది.

ఒకసారి గవదబిళ్లలు వస్తే జీవితంలో మళ్లీ ఎప్పుడురాదు. ఈ వ్యాధి వచ్చినవారికి దాని నిరోధకశక్తి జీవితాంతం ఉంటుంది. పెద్దల్లో గవద వాపు వచ్చినప్పుడు లేదా ఎవరికైనా ఒకవైపే వాపు వచ్చినప్పుడు గవదబిళ్లలు కాకుండా లాలాజల గ్రంథుల నాళాలు మూసుకుపోవడం, ఇన్ఫ్‌క్షన్‌ వంటి ఇతరతర కారణాలేమైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading