మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రిల పేర్లు ప్రముఖంగా వినిపించినా పార్టీలో ఎక్కువ మద్దతు శాస్త్రి గారికే దక్కింది. మొరార్జీ దర్పం, సహనలేమి ఇందుకు కారణమని కొందరు అనుకున్నా, శాస్త్రిగారి లౌక్యం, మృదుస్వభావం, నీతి సరైన కారణాలని నమ్మిన వారూ లేకపోలేదు.
శాస్త్రిగారి అందరినీ కలుపుకుపోయే గుణం పార్టీ ఐక్యతకు మంచిదని దాదాపు అందరూ అంగీకరించిన విషయం. మరో బలమైన అభ్యర్థి జగ్జీవన్ రామ్ ను మంత్రివర్గంలో చేర్చుకుని సంతృప్తి పరచటం జరిగింది. ఇది కామరాజ్ గారి రాజకీయ చతురతతోనే సాధ్యమైందని ప్రతీతి.
అంతేకాక అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సిండికేట్ అనబడే (కామరాజ్, అతుల్య ఘోష్, పాటిల్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి వంటి) బడా రాజకీయవేత్తల వర్గం శాస్త్రిగారు తమ ఒత్తిడికి తలొగ్గగల అవకాశాలున్నందున ఆయనకు మద్దతు తెలిపింది. తాత్కాలిక ప్రధాని అయిన గుల్జారీలాల్ నందా శాస్త్రిగారి పేరు ప్రతిపాదించినపుడు మొరార్జీ కాస్త ముభావంగానే పోటీ నుండి తప్పుకున్నారు. వెరసి నెహ్రూ పరమపదించిన వారం రోజుల్లోనే శాస్త్రిగారి ఎన్నిక జరిగిపోయింది. 1964 జూన్ 2న మన ప్రజాస్వామ్య వ్యవస్థ పటుత్వాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది.
నెహ్రూ మంత్రివర్గానికి ఒకే ఒక మార్పు చేశారు శాస్త్రిగారు – ఇందిరా గాంధీని సమాచార ప్రసార శాఖామాత్యులుగా ప్రత్యక్ష మంత్రివర్గంలోకి తీసుకురావటం. ఆయన తన పదవీకాలమంతా పార్టీ వ్యవహారాలు, రాష్ట్ర రాజకీయాల్లో కలుగజేసుకోలేదు. విప్లవాత్మక మార్పులకు, విధానాలకు దూరంగానే ఉన్నారు. ఉదాహరణలు: అధికారిక భాష ప్రకటన, పంజాబ్ రాష్ట్ర వ్యాజ్యం, గోవాను మహారాష్ట్రలో విలీనం చేసే అంశం.
అప్పటికే ఆహారధాన్య కొరత, యుద్ధం, ఆర్ధిక స్తబ్దత దేశాన్ని కుదిపివేసాయి. ఆయన హయాంలోనే హరిత విప్లవం, శ్వేత విప్లవం వంటి సానుకూల పథకాలు స్వల్పకాలిక లాభాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు, అనుషంగ ప్రభావాలు తెచ్చిపెట్టాయి.
మొదట్లో పార్టీలోని సిండికేట్ మితభాషి అయిన శాస్త్రిగారి డాంబికములేని తత్వం తమకు అనుకూలంగా ఉన్నట్టు తలచినా, క్రమంగా ఆయన వక్తవ్యం ధృఢంగా మారటం చూసింది.
వియెత్నాంపై అమెరికా వేసిన బాంబులను ప్రపంచంలో మొట్టమొదట ఖండించింది శాస్త్రిగారే. ఎల్.కె.ఝా ప్రధాన కార్యదర్శిగా మొట్టమొదటి ప్రధానమంత్రి సచివాలయ వ్యవస్థను మొదలు పెట్టింది ఆయనే. అదే క్రమంగా పీఎంఓ (ప్రధాన మంత్రి కార్యాలయం)గా రూపాంతరం చెంది, నేటికీ మన దేశ ప్రధానమంత్రులకు విలువైన సలహాసంఘంగా పనిచేస్తోంది.
శాస్త్రిగారి పాలనలో పాకిస్తానుతో జరిగిన యుద్ధం అందరికీ విదితమే. ఆ విజయంతో ఆయన జాతికి ప్రేరణ అయ్యారు. ఆయన చేసిన “జై జవాన్, జై కిసాన్” నినాదం దేశ నలుమూలలా మారుమోగింది.
ప్రధానిగా కేవలం పంతొమ్మిది నెలలే ఉన్నా హరిత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్ (శ్వేత విప్లవం), పాకిస్తాన్‌పై యుద్ధ విజయాలతో ఎంతో సంఘటనాత్మకంగా సాగింది శాస్త్రిగారి పాలన. పాకిస్తాన్‌తో యుద్ధం పర్యవసానంగా ఏర్పాటైన తాశ్కెంట్ సదస్సులో (ఒకింత సందేహాస్పదంగా[1][2]) గుండెపోటుతో శాస్త్రిగారు స్వర్గస్తులైనారు.
శాస్త్రిగారి గురించి మరికొన్ని విషయాలు:
- సైన్యానికి నిధుల కొరత ఏర్పడగా శాస్త్రిగారు హైదరాబాదు నవాబుచే 5000 కిలోల బంగారం సైన్యానికి చందాగా ఇప్పించారు.
- ఆయన జైల్లో ఉన్నప్పుడు స్వచ్చందంగా తన పెన్షన్ 50 రూపాయల నుండి 10 రూపాయలకు తగ్గించుకున్నారు.
- తన తనయుడికి వచ్చిన పదోన్నతి అయుక్తమని దానిని రద్దు చేయించారు.
- ఆయన ఉత్తర్‌ప్రదేశ్ రవాణామంత్రిగా ఉండగా దేశంలో మొట్టమొదటిసారి మహిళా కండక్టర్లను నియమించారు.
Raju's Resource Hub