
క్యాబేజీని పోలిన ఆకులతో ఆకుపచ్చ, ముదురాకుపచ్చ, బర్గండీ వంటి పలు రంగుల్లో కనిపిస్తుంది లెట్యూస్. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందిన ఆకుకూర వేగంగా పెరిగే లక్షణం కలిగిన ఇది సుమారు 12-40 అంగుళాల ఎత్తు ఎదుగుతుంది. దీనికి తెలుపు, పసుపు వర్ణంలో చిన్న చిన్న పూలు వస్తాయి. ఈ ఆకుకూరలో పోషక, ఔషధ విలువలు ఎక్కువ. మొదట్లో లెట్యూస్ని కేవలం నూనె గింజల్ని ఉత్పత్తి చేయడానికి పెంచేవారట. తర్వాత కాలంలో గ్రీకులు, రోమన్లు వంటకాల్లో వినియోగించడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. మనదేశ వాతావరణంలో కాస్త వేడి ఎక్కువే. దాన్ని తట్టుకునే రకాలైన బటర్హెడ్, రోమైన్… వంటి రకాల్ని ఎంచుకుంటే మేలు. దీన్ని చల్లటి ప్రదేశంలోనే కాదు… షేడెడ్ గార్డెన్లూ, బాల్కనీల్లోనూ పెంచుకోవచ్చు. అయితే, కాసేపైనా నేరుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

కత్తిరిస్తే చిగురిస్తాయి…
కుండీల్లో పెంచాలనుకునేవారు… సారవంతమైన పొడి మట్టిని ఎంచుకోవాలి. విత్తనాలను అంగుళం దూరంలో చల్లుకోవాలి. తేమ తగ్గకుండా రోజూ ఉదయాన్నే నీళ్లు పోయాలి. ఇవి మొలకెత్తడానికి ఏడు నుంచి పదిరోజులు పడుతుంది. వీటిని కావలసినంత వరకూ కత్తిరించుకుని వాడుకోవచ్చు. మళ్లీ చిగురిస్తాయి. అయితే, ఈ ఆకుకూరకు పేనుబంక, కత్తెర పురుగు పడతాయి. వీటిని అరికట్టాలంటే… ఆ ఆకుల్ని తీసి పారేయాలి. లేదా వంటసోడా కలిపిన నీళ్లో, వేపనూనెనో పిచికారీ చేస్తే సరి. ఆరోగ్యంగా ఎదుగుతాయి.
Raju's Resource Hub
