Logo Raju's Resource Hub

Mukkoti Ekadasi / ముక్కోటి ఏకాదశి

Google ad

మంచి పని తలపెట్టగానే, దగ్గర్లో దశమి ఏకాదశులు ఉన్నాయేమో గమనించడం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా ఇరవై నాలుగు ఏకాదశి తిథులుంటే, అన్నీ పుణ్య తిథులే కావడం విశేషం! ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత.

హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని ‘హరి వాసరం’గా వ్యవహరిస్తారు. ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’ అనే మరో పేరు పురాణ గాథ అనుసరించి ఏర్పడింది. ఆషాఢ బహుళ ఏకాదశి- కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి (లలిత ఏకాదశి అంటారు). రెండోది, అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి.

ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం మోక్ష ద్వారమని ప్రతీతి. అది ఆ ఒక్క రోజే తెరుచుకుంటుంది. దాన్ని ‘వైకుంఠ ద్వారం’ అంటారు. తిరుమలలో వైకుంఠద్వార ప్రవేశానికి భక్తులు ఉవ్విళ్లూరుతారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక, దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది.

వైకుంఠ ద్వారం నుంచి దర్శనానికి- భక్తులే కాదు, మూడు కోట్లమంది దేవతలూ తహతహలాడతారని చెబుతారు. అందువల్ల దీనికి ‘ముక్కోటి’ అనే పేరు సార్థకమైంది. ముక్కోటి ఏకాదశినాటి విధివిధానాలను, ఏకాదశి వ్రత నియమాలను పాటించినవారికి స్వర్గసుఖప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కారణంగా దీనికి ‘సౌఖ్యద ఏకాదశి’గా పేరుంది. మోక్షప్రాప్తినిస్తుందనే అర్థంలో మోక్ష‘ద’ ఏకాదశిగానూ సార్థక నామాలు ఏర్పడ్డాయి.

Google ad

వైఖానసుడు అనే రాజుకు తన తండ్రి నరకంలో యాతన పడుతున్న దృశ్యం కలలో కనిపించిందట. ముక్కోటి ఏకాదశినాడు ఆ రాజు దీక్ష స్వీకరించి, వ్రతం, ఉపవాసాది నియమాలు పాటించడం వల్ల ఆయన తండ్రికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణ గాథ. ఆ కారణంగా దీనికి ‘మోక్ష్తెకాదశి’ అనే పేరు స్థిరపడిందంటారు.

బ్రహ్మ నుదుటి నుంచి అకస్మాత్తుగా ఓ చెమటబొట్టు రాలి పడిందట. దాని నుంచి రాక్షసుడు జన్మించి, తనకో చోటు కల్పించాలని బ్రహ్మను కోరాడట. ఏకాదశినాటి అన్నం మెతుకుల్లో అతడికి బ్రహ్మ చోటు కల్పించాడంటారు. ఆనాటి నుంచి ఏకాదశి తిధిలో ఉపవాస నియమం ఏర్పడిందని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

మానవుల కాలమానం లెక్కల్లోని మన ఆరునెలల కాలం, దేవతలకు ఒక పగలుతో సమానం. తక్కిన ఆరు నెలలూ దేవతలకు ఒక రాత్రి. ఆషాఢ మాసంలో, అంటే దక్షిణాయనంతో మొదలయ్యే చీకట్ల నుంచి దేవతలు విముక్తులై ఈ ఏకాదశితో వెలుతురులోకి ప్రవేశిస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలానికి దీన్ని శుభారంభ తిథిగా భావిస్తారు.

ఏకాదశులన్నీ ప్రత్యేకమైనవే అయినా- విధివిధానాలు, పురాణ గాథలను అనుసరించి కొన్ని ఏకాదశులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చాతుర్మాస్య దీక్షలకు ఆరంభదినం కాబట్టి, ఆషాఢమాస ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. యోగనిద్ర ముగించి శ్రీమహావిష్ణువు మేలుకుంటాడన్న గాథ ప్రకారం ‘కార్తికమాస ఉత్థాన ఏకాదశి’గా భావిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ధనుర్మాస ముక్కోటి ఏకాదశిని- ‘నిర్ణయ సింధువు’ వంటి గ్రంథాలు మరీ విశేషమైనవిగా వర్ణిస్తున్నాయి.
ఇంతటి ఘనత వహించిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియమంతో సాకారం చేసుకోవాలి. దాన్ని శ్రీవారి దివ్య పాదారవింద ‘చింతనామృత పాన విశేష శుద్ధ చిత్తం’తో సద్వినియోగం చేసుకోవడం మన వంతు!

on 23-12-2023 at yanam venkanna babu temple

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading