‘భోగ్’ అనే సంస్కృత పదం నుంచి ‘భోగి’ వచ్చింది. భోగ్ అంటే సుఖం అని అర్థం. వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు. అయితే, తనకు మూడు అడుగులు ఇచ్చినందుకు… మూడు వరాలు బలిచక్రవర్తికి ఇస్తాడట శ్రీమహావిష్ణువు. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో భూలోకాన్ని నువ్వు పరిపాలించు అని చెప్తాడట. అందుకే, బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగిమంటను వేస్తారని ఓ పురాణగాథ. అయితే, ఈ భోగి మంటల వెనక ఆరోగ్య రహస్యమూ ఉంది. భోగిమంటల్లో ఆవు పిడకలు, నెయ్యి, ఔషధ చెట్ల బెరడులు లాంటివి వేసి కాల్చడం వల్ల గాల్లోని సూక్ష్మక్రిములు నశించి, గాలి శుద్ధి అవుతుందట. అంతేకాదు, చలికాలంలో శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువే. కాబట్టి, అలాంటి వాటి బారిన పడకుండా ఇవి ఔషధంగానూ ఉపయోగపడతాయట. అంతేకాదు, ఆవు పిడకల్లో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంత శక్తిమంతమైనది కాబట్టే ఎండిన పిడకలను కొన్ని రకాల మందుల్లోనూ, టూత్ పౌడర్లలోనూ వినియోగిస్తారట.
అంతేకాదు, వీటిని మండించడం వల్ల యాంటీ రేడియేషన్ ప్రయోజనాలూ అందుతాయట. భోగిమంటల వల్ల అనేక మానసిక ప్రయోజనాలూ ఉన్నాయి. ఈరోజు ఇంట్లోని పాత వస్తువులను పారేయడమేకాదు, మనలోని నెగెటివ్ ఆలోచనలను కూడా తొలగించుకోవాలి. అనవసరపు అలవాట్లు, చెడు లక్షణాలను కూడా ఆ మంట్లోనే కాల్చివేయాలి. భవిష్యత్తు గురించిన భయాల్నీ, మనలోని అసూయా, ద్వేషాల్నీ, వెంటాడుతోన్న బాధల్నీ తీసేసి, కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలని అర్థమట. ఇలా శారీరకంగానే కాదు, మానసికంగానూ మనల్ని మనం దృఢంగా మార్చుకోవడమే ఈ భోగిమంటల ఉద్దేశం
Year 2026






Raju's Resource Hub
