
ధన త్రయోదశితో దీపావళి పండుగ సంబరాలు ప్రారంభంఅవుతాయి. రెండో రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు. దీన్నే చోటీ దీపావళి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడి సతీమణి సత్యభామ నరకాసురిడిని వధించింది ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరక చతుర్దశి జరుపుకుంటారు. నరక చతుర్దశి రోజున ప్రదోష కాలంలో యముడికి అంకితం చేసిన నాలుగు ముఖాల దీపాలను వెలిగిస్తారు. అదే విధంగా కుబేరుడు, లక్ష్మీగణపతి, ధన్వంతరి, యమదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

నరక చతుర్దశి వేళ యమ దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాదు యమ దీపం వెలిగించిన వారికి అకాల మరణం నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే విధంగా యమ ధర్మరాజు నుంచి దీర్ఘాయువుగా జీవించేందుకు అవకాశం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
నరక చతుర్దశి రోజున సాయంకాలం ప్రదోష కాలంలో గోధుమపిండితో లేదా బియ్యం పిండితో దీపం తయారు చేసి నాలుగు వత్తులు తయారు చేసి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత దీపం చుట్టూ గంగాజలం చల్లాలి. ఈ దీపాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి దక్షిణ దిశలో ఉంచాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత యమ ధర్మరాజును భక్తి శ్రద్ధలతో పూజించాలి.
నరక చతుర్దశి పౌరాణిక కథ
పురాణ కథల ప్రకారం నరకాసురుడు అనే రాక్షసుడు భూమిలో ప్రజలను తీవ్రంగా హింసించాడని చెబుతారు. అతను దేవతలను అవమానించడమే కాకుండా, వారి శక్తులను దుర్వినియోగం చేశాడు. ప్రజలు అతని బాధల నుండి విముక్తి కోరినప్పుడు, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహారం చేశాడు. ఈ విజయాన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే తైలాభ్యంగ స్నానాన్ని (నూనె స్నానం) చేయడం ద్వారా కాయిక, మానసిక కల్మషాలను తొలగించవచ్చని నమ్ముతారు.
నరక చతుర్దశి రోజున లక్ష్మీ దేవిని పూజించడం సంప్రదాయం. మహాలక్ష్మి పూజ ద్వారా ధనం, ఐశ్వర్యం, శాంతి, సంతోషాలను ఆహ్వానిస్తారు. పూజలో దీపాలను వెలిగించడం ద్వారా చెడు శక్తులు దూరమవుతాయని నమ్ముతారు. ఇల్లు శుభ్రపరచి దీపాలతో అలంకరించడం ద్వారా, లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామని విశ్వసిస్తారు.
దీపాలను వెలిగించడం
చీకటిని తొలగించడానికి ఇంటి బయట యమ దీపం వెలిగిస్తారు. ఇది అకాల మరణాన్ని నివారించడమే కాకుండా, కుటుంబానికి శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు. నరక చతుర్దశి శ్రద్ధా విశ్వాసాలుఈ పండుగలో కేవలం అర్చనలు మాత్రమే కాకుండా, లోక కల్యాణం కోసం మంచి ఆలోచనలను ఆచరించడం ఎంతో ముఖ్యమైనది. చెడు శక్తులపై మంచి శక్తుల విజయం సాధ్యమని, ధర్మమే ఎల్లప్పుడూ నెగ్గుతుందనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. తైలాభ్యంగ స్నానం, లక్ష్మీ పూజ ద్వారా శుభం, క్షేమం, ఆరోగ్యాన్ని పొందవచ్చని నమ్ముతారు.
నరక చతుర్దశి పండుగలో దాగి ఉన్న సందేశం ధర్మబద్ధమైన జీవనం వైపు మిమ్మల్ని తీసుకెళ్లడమే. లక్ష్మీ పూజతో పాటు యమదీపం వెలిగించడం మన జీవితాల్లో శ్రేయస్సును, సంతోషాన్ని తీసుకువస్తుంది. ఈ పండుగ ద్వారా చెడును తొలగించి, సత్యం, ధర్మాన్ని ఆచరించాలని సంకల్పం చేయాలి.