ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. దాదాపు ఓటమి అంచుల వరకు వెళ్లిన చెన్నై టీమ్‌ని ఆఖర్లో రవీంద్ర జడేజా హిట్టింగ్ చేసి గెలిపించాడు. చివరి ఓవర్ వేసిన మోహిత్ శర్మ తొలి నాలుగు బంతుల్ని పొదుపుగా వేసినా.. ఆఖరి రెండు బంతుల్ని విసిరే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. దాంతో జడేజా వరుసగా 6, 4 బాదేసి చెన్నైకి ఐదో టైటిల్‌ని అందించాడు.
ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం అర్ధరాత్రి లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 214 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఆఖరి బంతికి చెన్నై 171/5తో ఛేదించింది. చెన్నై విజయానికి చివరి 6 బంతుల్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో లాస్ట్ ఓవర్ వేసిన మోహిత్ శర్మ తొలి 4 బంతుల్లో రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో 1X4, 1X6), శివమ్ దూబె (32 నాటౌట్: 21 బంతుల్లో 2×6)ని కట్టడి చేసి 3 పరుగులే ఇచ్చాడు. కానీ.. లాస్ట్ రెండు బంతుల్ని 6, 4గా మలిచిన రవీంద్ర జడేజా చెన్నై టీమ్‌ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలవడం ఇది ఐదోసారి. ఇప్పటి వరకు ముంబయి ఇండియన్స్ మాత్రమే ఐదుసార్లు టైటిల్ గెలిచింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరినా.. గత ఏడాది తరహాలో విజేతగా నిలవలేకపోయింది.
మ్యాచ్‌లో వర్షం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ లక్ష్యాన్ని 15 ఓవర్లకి 171 పరుగులుగా నిర్దేశించారు. దాంతో చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (26: 16 బంతుల్లో 3×4, 1×6), దేవాన్ కాన్వె (47: 25 బంతుల్లో 4×4, 3×6) ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడేయగా.. అజింక్య రహానె (27: 13 బంతుల్లో 2×4, 2×6), అంబటి రాయుడు (19: 8 బంతుల్లో 1×4, 2×6) క్రీజులో ఉన్నంతసేపు హిట్టింగ్‌తో అదరగొట్టేశారు. అయితే.. 13వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోని (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో లాస్ట్‌లో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్ని సిక్స్, ఫోర్‌గా మలిచి చెన్నైకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌తో అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పేశాడు.
మ్యాచ్‌లో అంతకముందు సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో 8×4, 6×6) దూకుడుగా ఆడటంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. టీమ్‌లో అతనితో పాటు సాహా (54: 39 బంతుల్లో 5×4, 1×6), శుభమన్ గిల్ (39: 20 బంతుల్లో 7×4) కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో పతిరన 2 వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జడేజా చెరొక వికెట్ తీశారు.






Raju's Resource Hub