Logo Raju's Resource Hub

గణపతి నవరాత్రి ఉత్సవాలు

Google ad

గణపతి నవరాత్రి ఉత్సవాలు ఛత్రపతి శివాజీ మరాఠా ప్రాంతాన్ని ఏలుబడి సాగిస్తున్నప్పుడు, హిందువులందరూ ఏకమయ్యేందుకు సామూహికంగా గణపతి నవరాత్రులను జరిపించే వారు. గణపతి పేష్వాలకు ఇష్టదైవం కూడా. అయితే ఆ సాంప్రదాయం అప్పుడు కేవలం అతను పరిపాలించిన మరఠ్వాడా ప్రాంతం వరకే పరిమితమై ఉండేది. ఆ సాంప్రదాయాన్ని దేశంలో చాలా భాగాలకు విస్తరించే ఖ్యాతి మాత్రం బాలగంగాధర్ తిలక్ కు దక్కుతుంది.

1857 లో సిపాయల తిరుగుబాటు, దీనినే మనం’ మొదటి స్వాతంత్ర సమరం’అని కూడా అనచ్చు, జరిగినప్పుడు తిలక్ చాలా చిన్నవాడు. అయితే ఆ విప్లవం లేదా తిరుగుబాటు విఫలం అవడానికి హిందువులలో అనైక్యత కూడా ఒక కారణం అని తిలక్ గుర్తించాడు.

హిందువులలో ఐక్యత కోసం మరఠ్వాడా ప్రాంతంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను దేశమంతటా విస్తరిస్తే బాగుంటుందని అతను కృషి చేసాడు. ఇంతేకాకుండా గణేశుడు ఇటు బ్రాహ్మణులకు, బ్రాహ్మణులు కాని వారికి కూడా ఇష్టమైన దేవుడు అని తిలక్ గ్రహించాడు. ఆ విధంగా బ్రాహ్మణులను, బ్రాహ్మణులు కాని వారిని కూడా కలుపుకు పోయేందుకు ఈ పండగ ఉపయోగపడుతుందని తిలక్ గ్రహించాడు.

మనకు తెలిసినంతవరకూ “స్వాతంత్రం నా జన్మహక్కు” అని మొట్టమొదటిసారి ప్రవచించిన యోధుడు బాలగంగాధర్ తిలక్. కాని చాలామందికి తెలియని విషయం గణేశ్ నవరాత్రులని సమూహికంగా జరుపుకోడానికి తిలక్ చేసిన కృషి..

Google ad

1వ రోజు

1భాద్రపద శుద్ధ చవితి
వరసిద్ధి వినాయకుడు
నైవేద్యం : ఉండ్రాళ్లు

ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి. చవితినాటి చంద్రుణ్ని చూసినవారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథ చదువుకుని అక్షతలు తలమీద వేసుకోవాలి. అక్షతలను మనమే ధరించాలి తప్ప, భగవంతుడిపై వేయకూడదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. నవరాత్రులు జరిపేవారు మాత్రం మూషికాసుర వృత్తాంతమూ తెలుసుకోవాలి. మూషికాసుర వృత్తాంతం: దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు. సేద్యం చేసుకుని భుక్తి గడుపుకొంటూ, ముక్తికోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. అనింద్యుడనే మూషికరాజు వారి కష్టార్జితమైన పంటను హరిస్తూ ఉంటే… భరద్వాజ ముని సూచనపై వినాయక వ్రతం ఆచరించసాగాడు ఆ మహర్షి. ఉద్యాపన చేస్తుండగా ఆ నివేదనలను కూడా అనింద్యుడు హరించడంతో అసురుడవై జన్మించమని రుషిపత్ని శపిస్తుంది. విఘ్నేశ్వరుడి ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా అనింద్యుడు యక్షరాజైన కుబేరునికి కుమారుడిగా పుట్టాడు. ఒకసారి తండ్రితోపాటు మణిద్వీపానికి వెళ్లాడు. అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణపాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు. జగన్మాత కోపగించి, “మూషికాసురునిగా అసురజన్మ ఎత్తుదువు గాక!” అని శపిస్తుంది. “కామక్రోధాది అష్టదుష్ట శక్తులను అంతం చేసినవానికి నీవు దాసుడవవుతావ”ని కూడా పలికింది. అలా గణపతి దుష్టశక్తులను అణచి మూషికుని దాసుని చేసుకున్న కథే గణపతి నవరాత్రుల వృత్తాంతం.

2వ రోజు

భాద్రపద శుద్ధ పంచమి
వికట వినాయకుడు
నైవేద్యం : అటుకులు

‘లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలలో ఆయనను స్మరిస్తాం. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి, మొదటిరోజున పూజించినట్లే పూజించాలి. ఈరోజున చదువుకోవాల్సిన కథాంశం… పరమశివుడి కోపానికి గురైన మన్మథుడు, ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు. అలా కాముణ్ని భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్రాగ్ని సముద్రంలో పడింది. ఆ అగ్నినుంచి పుట్టినవాడే జలంధరుడు. శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడు కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు. ఆ అసురుడు… శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు. అజేయత్వం, నిర్భయత్వం, మృత్యుంజయత్వమనే వరాలను పొందుతాడు. మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించ సాగాడు. అలా లోకమంతా కామాధీనమయింది. దేవతలు, మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి, ఆయన సూచనమేరకు వికట వినాయకుడిని భక్తిశ్రద్ధలతో సేవించారు. ఆయన నుంచి అభయం పొందారు. తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉన్నాడు. అందువల్ల మూషికాసురుడు తనవిరోధి వినాయకుడి మీదికి కామాసురుని పురిగొల్పాడు. కామాసురుడు మయూరరూపం ధరించి, లోకమంతటినీ కామంతో ప్రభావితం చేస్తూ… గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు, మునులు, ‘మయూరవాహనా! వికట వినాయకా!’ అని స్తుతించారు. అటుకులు నివేదించి స్వామిని తృప్తి పరిచారు. రెండోనాటి పూజ ద్వారా సమాజం దుష్ట కామాన్ని వీడాలి.

3వ రోజు

భాద్రపద శుద్ధ షష్ఠి
లంబోదర వినాయకుడు
నివేదన: పేలాలు

క్రోధాసురుణ్ని వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి. సముద్ర మథనంలో లభించిన అమృతాన్ని లోక కంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం శ్రీమన్నారాయణుడు మోహినీ రూపం ధరించాడు. శివుడు ఆమె మోహంలో పడి వెంటాడగా, మోహిని శివుడిని వంచించి మాయమైంది. ‘కామాత్‌ క్రోధో అభిజాయతే’ అన్నట్లుగా కామం తీరని శివుడు క్రోధావిష్టుడు అయ్యాడు. మోహిని వల్ల తమకం కారణంగా వీర్యస్ఖలనమై దుష్ప్రదేశంలో పడింది. దానినుంచి ఉద్భవించినవాడే క్రోధాసురుడు. శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు. ముల్లోకాలనూ జయించే శక్తిని, మృత్యురాహిత్యాన్ని, లోకప్రసిద్ధిని వరాలుగా పొందాడు. ఆవేశపురిని రాజధానిగా చేసుకున్నాడు. అతని భార్య ప్రీతి. క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు. దాంతో దేవతలు, మునులు లంబోదరుడిని ఆశ్రయించగా, ఆయన క్రోధాసురుని పీచమణచాడు. క్రోధాసురుడు లంబోదరుడిని శరణువేడాడు. ఆయన అనుగ్రహించాడు. దుష్టశిక్షణాదులందు తప్ప నీవు లోకంలోకి రావద్దని ఆదేశించి, క్రోధుని తన నేత్రాల్లో ఇమిడి పొమ్మన్నాడు. ఈ క్రోధుని కారణంగా ప్రజలు కార్యాకార్య విచక్షణ కోల్పోతారు. కాబట్టి ఎవ్వరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు. ఈనాటి పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం.

4వ రోజు

భాద్రపద శుద్ధ సప్తమి
గజానన వినాయకుడు
నివేదన: చెరకుగడలు

నవరాత్రుల నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి. విశ్రవబ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారుసోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు. తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు. అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. మనసు చెదిరి, చూపుల్లో చాంచల్యం ఏర్పడుతుంది. కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంగా చూడటంతో అతని ఒక కన్ను మాడిపోతుంది. ఆ కంటి బూడిద నుంచి పుట్టినవాడే లోభాసురుడు. అతను లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయ వరాలు పొందుతాడు. లాలస అనే కన్యను వివాహమాడతాడు. దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడనే మునిని ఆశ్రయిస్తారు. ఆయన గజానన వినాయకుడిని ప్రార్థించమన్నాడు. వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు. శివ, శుక్రాచార్యుల చేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు. దాంతో లోభాసురుడు గజాననుడి శరణు వేడాడు. గజానన వినాయకుడు లోభుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు. ధర్మవిరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు. ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే.

5వ రోజు

భాద్రపద శుద్ధ అష్టమి
మహోదర వినాయకుడు
నివేదన: కొబ్బరి కురిడి

మహాగణపతిని జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు. శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియశిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి, మహాశక్తిమంతుడిని చేశాడు. అతను మదిర అనే రాక్షసకన్యను పెండ్లాడతాడు. మూషికాసురుడు మోహాసురుణ్ని గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు. ముందుగా తన చెరనుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వలోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు. మోహాసురుడు అలాగే చేస్తాడు. ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికీ మూలకారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు. సాటి గంధర్వులతో ప్రవాళ క్షేత్రానికి వెళ్లి, ప్రవాళ గణపతిని పూజిస్తాడు. గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు. భ్రాంతి తొలగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు. నన్ను నీలో కలుపుకోవాల్సిందని వేడుకుంటాడు. అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది. ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో చేరుతుంది. కాబట్టి అయిదోనాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే.

6వ రోజు

భాద్రపద శుద్ధ నవమి
ఏకదంత వినాయకుడు
నివేదన: నువ్వులు/ నువ్వులతో చేసిన పదార్థాలు

పూర్వం చ్యవన మహర్షికి మదం ఆవహించింది. ఆ దుష్టభావం నుంచి మదాసురుడు ఉద్భవించాడు. అతను శుక్రాచార్యుడి నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మదోన్మత్తుడు అయ్యాడు. ప్రమదాసురుని కుమార్తె లాలసను పెండ్లాడతాడు. లోకకంటకుడై విజృంభించసాగాడు. అప్పుడు సనత్కుమారుడు చేసిన సూచనతో ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు మునులు. అదే సమయంలో మూషికాసురుడు గణాధిపతిని ఎదుర్కొన్నాడు. దేవతలు, రుషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం ఆ అసురునిపై లంఘించి, వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణగి ఏకదంత గణపతిని శరణువేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధిచెప్పి, పాతాళానికి పంపుతాడు. నేటిపూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే.

7వ రోజు

భాద్రపద శుద్ధ దశమి
వక్రతుండ వినాయకుడు
నివేదన: అరటి మొదలైన పండ్లు

ఒకప్పుడు దేవేంద్రుడికి విపరీతమైన ఆవులింత వచ్చింది. దానినుంచి మత్సరుడనే రాక్షసుడు జన్మించాడు. అతను శుక్రాచార్యుడి నుంచి శివమంత్రం పొంది, తపస్సు చేసి వరాలు పొందుతాడు. వరగర్వంతో లోకవిజేత కావాలని యత్నిస్తాడు. ఈర్ష్య అనే రాక్షసకన్యను వివాహమాడి విషయప్రియుడు, సుందరప్రియుడు అనే పుత్రులకు జన్మనిస్తాడు. మత్సరాసురుని బాధలు భరించలేక దేవతలు, రుషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. ఆయన వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు. వారంతా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించారు. మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది, గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు. వక్రతుండ గణపతి కనికరించి, ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు. నేటి పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడటమే.

8వ రోజు

భాద్రపద శుద్ధ ఏకాదశి
విఘ్నరాజ వినాయకుడు
నివేదన: సత్తుపిండి

ఒకప్పుడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లాడుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వునుంచి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. అతనికి పార్వతి మమకారుడని పేరుపెట్టింది. గణేశ మంత్రాన్ని ఉపదేశించింది. తపస్సు కోసం వనాలకు వెళ్లిన మమకారుడికి శంబరాసురుడు అనే రాక్షసుడు అనేక మాయావిద్యలు, ఆసురీవిద్యలు నేర్పుతాడు. అతణ్ని మమతాసురుడని సంబోధించాడు. తన కుమార్తె మోహినిని అతనికిచ్చి వివాహం చేస్తాడు. అప్పటినుంచి మమకారుడు.. మమతాసురుడు అయ్యాడు. మూషికాసురుడు మమతాసురుడి దగ్గరికి వెళ్లి గణపతితో పోరాటానికి సహకరించమని కోరాడు. మమతాసురుడు కాలసర్పరూపం ధరించి తన కోరల నుంచి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగాడు. దానిని భరించలేక అందరూ గణాధిపతిని ‘పాహిమాం! రక్షమాం!’ అంటూ వేడుకున్నారు. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి, ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విష వాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పంకూడా తొండంలో చొరబడింది. దానిని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి. గట్టిగా బిగించడంతో మమతా సర్పపు పొలుసులు నుగ్గు కాగా కోరలు ఊడిపడి రక్తధారలు కారజొచ్చాయి. అసురుడు, ‘గణేశా! శరణు. నీకు సోదరుడను. ప్రాణభిక్ష పెట్టు’ అంటూ ప్రాధేయపడటంతో గణపతి కరుణించాడు. ‘మమతాసురా! నీవు నాకు వాహనమై నా పాదాల చెంత ఉంటావు!’ అన్నాడు. పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా పాపకారణమే! పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది. అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ అంతరార్థం.

9వ రోజు

భాద్రపద శుద్ధ ద్వాదశి
ధూమ్రవర్ణ వినాయకుడు
నివేదన: నేతి అప్పాలు

కర్మసాక్షి అయిన సూర్యుడికి జగత్తుకు తానే కర్తను అనే భావన కలిగింది. ఆ క్షణంలో సూర్యుడికి తుమ్ము వచ్చింది. అందులోంచి అహంకారుడనే రాక్షసుడు ఉద్భవించాడు. అతను తపస్సుతో గణేశుడిని మెప్పించి అమరత్వం, ఆరోగ్యం, జయశీలత వరాలుగా పొందాడు. ప్రమదాసురుని పుత్రిక అభిలాషను వివాహమాడుతాడు. గర్వాదులను పుత్రులుగా పొందుతాడు. సుఖప్రియ నగరానికి రాజుగా ఉండి, తన రాక్షసత్వంతో లోకాలను బాధిస్తుంటాడు. అహంకారుడి బాధలు భరించలేక దేవ, ముని, మనుజ సముదాయం ధూమ్రవర్ణ వినాయకుడిని ఆశ్రయించారు. అహంకారుడికి హితవు చెప్పమని నారదుడిని పంపుతాడు గణపతి. మహర్షి మాటలను పెడచెవిన పెడతాడు రాక్షసుడు. ఇంతలో మూషికాసురుడు వినాయకుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. అహంకారుని తోడు తీసుకుంటాడు. అహంకారుడు ముందుకువచ్చి, తన నాసికారంధ్రం నుంచి భయంకరమైన ధూమాన్ని వెలువరిస్తాడు. ఆ ధూమం ముల్లోకాలనూ చుట్టుముడుతుంది. లోకాలన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతాయి. వినాయకుడు గట్టిగా శ్వాస పీల్చాడు. ఆ శక్తికి ముల్లోకాల్లో వ్యాపించిన ధూమం తిరోగమించింది. అది గణపతి నాసికారంధ్రంలో ప్రవేశిస్తుండగా రాలిన ధూళి వినాయకుని దేహంపై పడి, స్వామి శరీరం ధూమ్రవర్ణంతో విరాజిల్లింది. ఆ అద్భుతాన్ని చూసి దేవతలు, మునులు ‘జయహో ధూమ్రవర్ణ వినాయకా! జయహో!’ అంటూ జయజయధ్వానాలు చేశారు. ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి, స్వామి శరణాగతుడయ్యాడు. గణేశుని అర్చించే వారి జోలికి రానని చెప్పి, ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. ఈ తొమ్మిదోనాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే. మూషికాసురుడు తన పరివారంలోని ముఖ్యులు పరాజితులు కావడంతో నిర్వీర్యుడైపోతాడు. గణాధిపతిని శరణాగతి వేడి తనను వాహనంగా స్వీకరించి, తన జన్మను ధన్యం చేయమని ప్రార్థిస్తాడు. అనుగ్రహమూర్తి అయిన గణపతి మూషికాసురుణ్ని తన వాహనంగా అంగీకరించాడు. ఇలా అనింద్యుడు అనే ఎలుక వినాయకునికి వాహనమైంది. మూషికాసురుని భార్య ప్రియంవద మహాపతివ్రత. ఆమె కూడా వినాయకుడిని శరణు వేడుతుంది. తాను తన భర్తను వీడి మనజాలనని విన్నవించుకుంటుంది. ‘ఓ ప్రియంవదా! నీ కోరికను మన్నిస్తున్నాను. నీవు నాకు ఛత్రంగా ఉండి కలకాలం భర్తకు చేరువలోనే ఉంటావు’ అన్నాడు.

గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, మమకారాలను తొలగించి ముక్తికి అర్హుడిగా మార్చడమే!

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading