కందుకూరి వీరేశలింగం పంతులు – సంస్కరణ శీలి ..సంస్కారధీశాలి

ఆయనో సాహితీ శిఖరం.. సంస్కరణలకు ప్రతిరూపం.. అఖండ గోదావరి తీరాన ఊపిరిపోసుకుని.. తెలుగు జాతి జాగృతికి ఊపిరిలూదిన చైతన్యఝరి.. కొత్త వెలుగులకు తెరదీసి.. సమాజాన్ని నిద్రలేపి.. మెలకువ దారుల్లో నడిపించిన నవయుగ వైతాళికుడు.. మూఢ నమ్మకాలు.. సాంఘిక దురాచారాలపై అలుపెరగక పోరాడిన యోధుడు.. తెలుగునాట సామాజిక, సాహిత్య రంగాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన బహుముఖ సాహితీ పండితుడు.. మగువల అభ్యున్నతికి శ్రమించిన స్త్రీ జనోద్ధారకుడు.. యావదాస్తిని సమాజ అభ్యున్నతికి ధారపోసిన త్యాగధనుడు.. శతాబ్దాల ముందుచూపున్న దార్శనికుడు.. ఆయనే మన… కందుకూరి వీరేశలింగం పంతులు.

స్ఫూర్తి ప్రదాత

సమాజ హితానికి.. కందుకూరి తన ఆస్తులన్నీ ధారపోశారు. మరణానికి 11 ఏళ్ల ముందే ఆస్తులన్నీ హితకారిణి సమాజానికి ఇచ్చేశారు. రాజమహేంద్రవరంలో వంకాయల వారి వీధిలో రెండంతస్తుల కందుకూరి స్వగృహం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. చల్లపల్లి వెంకయ్య వద్ద కొన్న 22 ఎకరాలు ఇవ్వగా..ఈ స్థలంలో ప్రస్తుత ఎస్ కేవీటీ డిగ్రీ కళాశాల, ఆనంద గార్డెన్స్ ఉన్నాయి. చల్లపలి రామయ్య నుంచి కొన్న 4.5 ఎకరాలు, లక్ష్మీవారపుపేటలో 14,799 గజాలు ఇచ్చేశారు. వీటి విలువ 115 ఏళ్ల కిందట రూ.41,500 కాగా.. ప్రస్తుతం రూ.కోట్ల మాటే.ఇదే స్ఫూర్తితో పలువురు దాతలు విద్యాభివృద్ధికి భూములు ఇచ్చారు.

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ మంచి పుస్తకం కొనుక్కో

కందుకూరి అందరిలో చైతన్యం నింపి సమాజాన్ని జాగృతం చేసే సాహిత్య ప్రక్రియలను కొత్త పుంతలు తొక్కించారు. పత్రికలు, పలు రచనలతో చైతన్యం నింపారు. 130కి పైగా గ్రంథాలు రాసిన సంఘ సంస్కరణ పండితుడు.. బహుముఖ సాహితీ పండితుడు కందుకూరి. ఆయన వాడిన కుర్చీలు, మంచాలు, టేబుళ్లు, పుస్తకాలన్నీ నేటి తరంలో చైతన్యాన్ని రగిలిస్తున్నాయి. రాజమహేంద్రిలోని కందుకూరి పుర మందిరంలో ఆయన వాడిన కుర్చీని ప్రత్యేకంగా భద్రపరిచారు. జిల్లావ్యాప్త గ్రంథాలయాల్లో కందుకూరి చైతన్య ఝరులు నేటికీ పదిలం.. తరాలు మారి డిజిటల్ ప్రపంచం వచ్చినా కందుకూరి రచనలు.. ఆయన స్ఫూర్తి మంత్రం నేటికీ అనుసరణీయమే

ఆడపిల్ల చదువు.. ఇంటికి.. అవనికీ వెలుగు

పురమందిరం

మహిళలు వంటింటికే పరిమితం.. బయటకు రావటం మహాపాపమని భావించే రోజుల్లోనే.. బాలికా విద్యను ప్రోత్సహించారు కందుకూరి.

బాల్య వివాహాలు.. కన్యాశుల్కం.. సతీసహగమనం దుష్ట ఆచారం

సాంఘిక దురాచారాల అంతానికి కందుకూరి శ్రమించిన తీరు స్ఫూర్తిదాయకం.. భర్త చనిపోతే భార్యనూ చితిలోకి తోసే సతీ సహగమనం ఆచారం ఉండేది. వీటిపై కందుకూరి సాహితీ బాణం ఎక్కుపెట్టి తన రచనలతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. బాల్య వివాహాల కట్టడికి ప్రయత్నం నేటికీ సాగుతోంది.

వితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. 1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో ఆయన జన్మించారు. కందుకూరి జన్మించిన ఇల్లు ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దాన్ని భావితరాల కోసమని పరిశోధన కేంద్రంగా నిర్వహిస్తోంది. సంఘసంస్కర్తగా వీరేశలింగం చేసిన కృషి, అలనాటి విశేషాలు అక్కడ ఇప్పటికీ కనిపిస్తాయి. అనేక సంఘ సంస్కరణలు చేసిన కందుకూరి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. బాలికా విద్యపై అవగాహన కల్పించారు. సామాజిక దురాచారాలు, అవినీతి అంతానికి పత్రికలు స్థాపించారు. ఇందుకు ఆయన ఇంటినే ముద్రణాలయంగా మార్చారు. ఇప్పటికీ ఆ ఇంట్లో అలనాటి ముద్రణా యంత్రం ఉంది. వ్యవస్థల్లో లోపాలు ప్రజలకు తెలిసేలా పలు నాటకాలూ రచించారు.

Leave a Reply

%d bloggers like this: