Logo Raju's Resource Hub

కరోనా సెకండ్‌ వేవ్‌

Google ad
Difference Between Corona First Wave Second Wave - Sakshi

ఫస్ట్‌ వేవ్‌లో కరోనా పట్ల విపరీతమైన భయం ఉండేది. దానికి తోడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు పూర్తిగా అప్రమత్తతతో ఉన్నారు. ఈ రెండు అంశాలు ఉన్నప్పటికీ… అప్పటివరకు కరోనా ఇన్ఫెక్షన్‌కి ఎవరికీ రెసిస్టెన్స్‌ లేకపోవడం తో లాక్‌డౌన్‌ తర్వాత, అప్పటి పాండమిక్‌ విపరీతంగా సాగింది. అయితే మరణాల సంఖ్య మొదట్లో 3 శాతం ఉండగా పోనుపోను మరణాల సంఖ్య తగ్గుతూ 1.5 శాతానికి వచ్చింది. అయితే ఇప్పటి తాజాపరిస్థితిలో ఫస్ట్‌వేవ్‌లో ఉన్న భయం రెండవ వేవ్‌ నాటికి ప్రజల్లో లేదు. అనేక మందికి కరోనా వచ్చి తగ్గిపోవడంతో అదే విధంగా తమకు కూడా తగ్గిపోయే అవకాశం ఉందనీ, ఒకసారి తగ్గిపోయినట్లయితే ఇక అది రెండోసారి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ప్రజల భావన. దీంతో కోవిడ్‌ పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కొంత మేరకు ప్రజలు గాలికొదిలేసినట్లుగా కనబడుతోంది. దాంతో సెకండ్‌ వేవ్‌లో చాలా ఎక్కువ మందికి చాలా తక్కువ సమయంలో వ్యాధి వస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొదటిసారి 10 వేల కేసులు నుండి 80 వేల కేసులు దాకా రావటానికి 84 రోజులు పట్టినట్లయితే ఈసారి అది 42 రోజుల్లోనే రావటం చూస్తున్నాం. ఇంతేకాకుండా రెండో వేవ్‌లో యుక్తవయస్కులూ, పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం కనిపిస్తోంది. 

దీనికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది… డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం వైరస్‌ రూపాంతరం చెందినప్పుడు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందగలిగిన వేరియంట్స్‌ బలపడే అవకాశం ఉంటుంది. ఇది అన్ని వైరస్‌ వ్యాధుల్లోనూ కనబడుతుంటుంది. కాబట్టి కరోనా కూడా పోను పోను ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్స్‌ గా మారే అవకాశం ఉంటుంది. బ్రిటిష్‌ వేరియంట్‌ దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో కనబడుతున్న డబల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ కూడా ఇదే విధంగా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఇక రెండవ కారణం మానవ ప్రవర్తనకి సంబంధించింది. పాండమిక్‌ మొదట్లో ఉన్న భయం ఈ రెండో వేవ్‌ నాటికి లేదు. కాబట్టి ఎక్కువమంది కోవిడ్‌ కి సరైన మార్గదర్శక నియమాలు పాటించడంలేదు. మాస్క్‌ ధరించడం లేదు సరికదా ఫిజికల్‌ డిస్టెన్స్‌ కూడా పాటించడం లేదు. కొంతమేరకు పాండమిక్‌ ఫాటిగ్‌ అనేది ఇందుకు కారణం. పాండమిక్‌ ఫాటిగ్‌ అంటే మనం తీసుకునే జాగ్రత్తలు పోను పోను తీసుకోలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్తల గురించి ఎవరు చెప్పినా వినటానికి కూడా చిరాకు వస్తుంది. ఇంకెంతకాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అన్న భావన అందరిలోనూ వచ్చేస్తుంది. లాక్‌ డౌన్‌ విధించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. ఒకసారి వ్యాధి వచ్చి తగ్గిపోయిన వాళ్లు, వారితో పాటు అప్పటికే టీకా తీసుకొని ఉన్నవాళ్లు పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. వాళ్లను చూసి మిగతావాళ్లు కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల రెండవ తరంగంలో వ్యాధి మరింత ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశం కనబడుతోంది. ఈ కారణాలు మాత్రమే కాకుండా మనకి తెలియని కారణాలు అనేకమైనవి ఉండవచ్చు అనేవి నిపుణుల అభిప్రాయం.

వ్యాక్సిన్‌ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అంటే మొదటి డోస్‌ వేసుకున్న తర్వాత సుమారు గా 45 నుంచి 50 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి కోవిడ్‌ నుండి రక్షణ కలిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యాక్సిన్‌ ఇవాళ వేసుకున్నప్పటికీ… సుమారు రెండు నెలల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే ఈ సెకండ్‌ వేవ మొదలయ్యే సమయానికి భారతదేశంలో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే టీకా సంపూర్ణంగా ఇచ్చారు. అంటే పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కేవలం 1 నుంచి 2 శాతమే కాబట్టి… వారిని మినహాయించి మిగతావారందరి విషయంలో వారు మొదటిదో, రెండోదో డోస్‌ తీసుకున్నా… దాని ప్రభావం పూర్తిగా అమల్లోకి ఇంకా వచ్చి ఉండనందున దాని పనితీరు ప్రభావపూర్వకంగా ఉండే అవకాశం తక్కువ. అయితే దాంతో మరో ప్రయోజనం మాత్రం ఉంది. సెకండ్‌ వేవ్‌ ఎక్కువకాలం ఉండకుండా వ్యాక్సిన్‌ మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అంతేకాదు… మూడవ వేవ్‌ రాకుండా కూడా వ్యాక్సిన్‌ మనల్ని రక్షించే అవకాశం ఉంది.

Google ad

రెండవ వేవ్‌లో వ్యాక్సిన్‌ ఇంకొక రకమైన మార్పు కూడా తీసుకొస్తోంది. ‘పెల్జ్‌ మెన్‌ ఎఫెక్ట్‌’ అంటే ఒక వ్యాధికి సంబంధించిన రక్షణ మనకి వస్తుంది అని తెలియగానే మనం తీసుకునే నివారణ చర్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కోవిడ్‌ వ్యాక్సిన్‌ సందర్భంగా మనం చూస్తున్నాం. అనేకమంది కోవిడ్‌ వ్యాక్సిన్‌కి వెళ్లగానే కోవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేస్తున్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కోవిడ్‌ వాక్సినేషన్‌ సెంటర్‌కి వెళ్లి అక్కడ అ జబ్బు తెచ్చుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీని ఉద్దేశం వ్యాక్సింగ్‌ చేయించుకో వద్దని కాదు. వ్యాక్సిన్‌ మాత్రమే మనల్ని కాపాడుతుంది. అయితే వ్యాక్సిన్‌ కోసం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా కోవిడ్‌ నివారణ చర్యలు పాటించాల్సిందే. వాక్సిన్‌ అయిపోయిన తర్వాత రెండు నెలల పాటు కూడా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందే. దాదాపు ఏడాది నుంచి అస్సలు బయటకు రాని వాళ్ళు కూడా వ్యాక్సిన్‌ కోసం బయటకు వచ్చి ఆ సమయంలో మాస్క్‌ సరిగ్గా ధరించక జబ్బు తెచ్చుకుంటున్న దృష్టాంతాలు మనం చూస్తున్నాం.

ఇక చికిత్స విషయానికి వస్తే… సెకండ్‌ వేవ్‌లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొదటి వేవ్‌లో మాదిరిగానే ఆక్సిజన్, స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్, హెపారిన్‌లు… కోవిడ్‌ చికిత్సలో ప్రధాన భూమిక ని నిర్వహిస్తాయి. అయితే కొత్తగా వస్తున్న బారిసిటనిబ్, మోల్నుపిరావిర్, కోవిడ్‌ సింథటిక్‌ యాంటీబాడీస్, ఇంటర్ఫెరాన్‌లు కోవిడ్‌ చికిత్సను మరింత ఆధునీకరించే అవకాశం ఉంది.

ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
పోయిన సంవత్సరం ఫస్ట్‌ వేవ్‌ సమయంలో తీసుకున్న జాగ్రత్తల కంటే మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పోయిన సంవత్సరం మాస్క్‌ పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం తక్కువ ఉండేది. ఇప్పుడు మాస్క్‌ ఖచ్చితంగా సరిగ్గా పెట్టుకుంటే తప్ప మనకి ఇన్ఫెక్షన్‌ వచ్చే రిస్కు తగ్గడం లేదు. అంటే మాస్కు పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆ మాస్క్‌ ముక్కు పైకి ఉండేటట్లు చూసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకూ మాస్క్‌ కంపల్సరీగా ధరించటం, కుటుంబ సభ్యులు కాని వారితో మూసి ఉన్న గదుల్లో ఉన్నప్పుడు అసలు మాస్కు తీయకుండా ఉండటం చాలా అవసరం.

గత ఏడాది లాక్‌ డౌన్‌ పెట్టినప్పుడు కోవిడ్‌ ని ఎదుర్కోవడానికి మనదేశం సన్నధ్ధం కాలేదు. అప్పుడు లాక్‌డౌన్‌ సహాయంతో మనం వ్యాధిని కొన్ని రోజులు వాయిదా వేసుకుని, ఈలోపల మన ఆక్సిజన్‌ ఫెసిలిటీ, మన వెంటిలేటర్స్, మరియూ మన ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచుకున్నాం. అయితే ఒకసారి మన ఆసుపత్రులూ, సౌకర్యాలూ సమకూర్చుకున్న తర్వాత లాక్‌డౌన్‌ వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవు. ప్రజలు తాము తీసుకోవాల్సిన కోవిడ్‌ ప్రమాణాలు, నియమనిబంధనలు తూ.చ. తప్పకుండా పాటిస్తే లాక్‌ డౌన్‌ మళ్లీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. లేనిపక్షంలో లాక్‌ డౌన్‌ లేదా కఠిన నిబంధనలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉందని గ్రహించి… ఆ మేరకు జాగ్రత్తలూ, కోవిడ్‌ నియమనిబంధనలూ, ఇతర సూచనలూ తప్పక పాటించాలి

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading