Logo Raju's Resource Hub

కొబ్బరి కాయను నివేదిస్తాము – ఎందుకు?

Google ad
భారత దేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదనలలో కొబ్బరికాయ ఒకటి.  వివాహములు పండుగలు, కొత్త వాహనము, వంతెన, ఇల్లు మొదలగునవి వాడేటప్పుడు మరియు అన్ని శుభ సందర్భాలలోనూ కొబ్బరికాయ నివేదింపబడుతుంది.  నీటితో నిండి మామిడి ఆకులతో అలంకరింపబడి దానిపై కొబ్బరికాయ ఉన్న కలశమును ముఖ్యమైన పూజా సందర్భాలలో మరియు ప్రత్యేక అతిథులను ఆహ్వానించడానికి ఉపయోగించబడుతుంది.
హోమము చేసే సమయములో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించ బడుతుంది.  భగవంతుని మెప్పుకై, కోరికలు తీర్చుకొనడానికి కొబ్బరికాయ పగుల గొట్టబడి స్వామికి నైవేద్యముగా పెట్టబడుతుంది.  తరువాత ప్రసాదముగా పంచ బడుతుంది.
ఒకానొకప్పుడు మనలోని జంతు ప్రవృత్తులను భగవంతునికి సమర్పించడానికి గుర్తుగా జంతుబలి అమలులో ఉండేది.  నెమ్మదిగా ఆ ఆచారము తగ్గిపోయి దానికి బదులుగా కొబ్బరికాయ నివేదించ బడుతున్నది.  ఎండిన కొబ్బరి కాయకు పై భాగములో పిలకకోసం మాత్రము వదిలి, మిగతా పీచు అంతా తీసి వెయ బడుతుంది.  పైన ఉన్న గుర్తులు మానవుని తల మాదిరిగా కనిపిస్తాయి.  పగిలిన కొబ్బరికాయ అహంకారము యొక్క విరుపును ప్రతిబింబింప చేస్తుంది.  మనలోని అంతరంగ ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరితో సహా భగవంతునికి నివేదింప బడతాయి.  భగవంతుని స్పర్శతో శుద్ధి అయిన మనసు ప్రసాదం గా వినియోగించ బడుతుంది.
దేవాలయాల్లోనూ ఇళ్ళల్లోను చేసే సంప్రదాయ బద్దమైన పంచామృత అభిషేక ప్రక్రియలో విగ్రహం పైనుంచీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధపు మిశ్రమము, విభూతి మొదలగు వాటితో అభిషేకము చేస్తారు.  ప్రతి ఒక్క పదార్ధము భక్తులకి ప్రయోజనాలను కల్గించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గలిగి ఉన్నది.  సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.
కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక.  చెట్టు యొక్క ప్రతి భాగము – మ్రాను, ఆకులు, కాయ, పీచు మొదలైనవి ఇంటి కప్పు, చాపలు రుచికరమైన వంటకాలు, తైలము, సబ్బులు మొదలైన వాటి తయారీ లో ఉపయోగించ బడతాయి.  ఇది భూమిలోనుంచి ఉప్పు నీటిని తీసికొని బలవర్ధకమైన నీటిగా మార్చుతుంది.  ఈ నీరు ప్రత్యేకముగా రోగులకు ఉపయోగ పడుతుంది.  ఇది ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలోను వాడబడుతుంది.
కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినేత్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు.  అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించ బడుతుంది.  కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి మరియు జ్ఞానికి ప్రతీకగా కొబ్బరి కాయ కలశం పై పెట్టబడి అలంకరింపబడి, మాలాలంకృతము చేయబడి పూజింపబడుతుంది.
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading