
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలన్నింటికీ ఓకే పరీక్ష రాస్తే సరిపోతుంది. అంతేకాదు, ఆ పరీక్షలో వచ్చిన స్కోరు కార్డును మూడేళ్ల పాటు ఉద్యోగాల కోసం వాడుకోవచ్చు. ఈ దిశగా సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CET) నిర్వహించేందుకు ‘జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ’ (National Recruitment Agency) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం (ఆగస్టు 19) ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో నాన్-గెజిటెడ్ పోస్టులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఇవపై ఎన్‌ఆర్‌ఏ కామన్ ఎలిజిబిటిటీ టెస్ట్ నిర్వహిస్తుంది. వివిధ ఉద్యోగ నియామకాల్లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ స్కోరు కార్డుకు మూడేళ్ల పాటు వాలిడిటీ ఉంటుంది. ఈలోగా జాబ్ రాకపోతే అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాసుకోవచ్చు. దేశంలో ఏటా ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 1.25 ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు విడివిడిగా విడుదల అవుతున్నాయి. వీటి కోసం ఏటా సుమారు 2.5 కోట్ల మంది పోటీ పడుతున్నారు. వీరంతా ఆయా బోర్డులు నిర్వహించే పరీక్షలు రాస్తున్నారు. కొత్త విధానం ద్వారా ఇకపై ఇలాంటి వారంతా ఒకే ఎగ్జామ్ రాసి ఈ ఉద్యోగాలన్నింటికీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఆన్‌లైన్ ద్వారా పరీక్ష (CET) నిర్వహించి రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కావాలంటే ఆ మెరిట్ జాబితాను ఉపయోగించుకొని వివిధ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధంగా విధానాన్ని రూపొందిస్తున్నారు.
Raju's Resource Hub