ఎక్కువ కెలొరీలూ, ఎక్కువ విటమిన్లూ, ఖనిజ లవణాలతో ఆరోగ్యానికి మారుపేరు పందిరి కూరగాయలు. ఇవి సులువుగా జీర్ణమవుతాయి. పైగా శరీరానికి చల్లదనం కూడా.
పందిరి కూరగాయల్లో ముఖ్యమైనవి సొరా, బీరా, పొట్లకాయా, కాకర. వీటిని అన్ని కాలాల్లో పెంచుకోవచ్చు. కుండీల్లోనూ నాటుకోవచ్చు. వీటికి పందిరి లేదా జాలీ వంటి సరైన ఆధారం ఇవ్వగలిగితే పెంచుకోవడం సులువే. ఈ పాదులకు ఆరేడు గంటలపాటు ఎండా, సారవంతమైన మట్టి మిశ్రమం అవసరం. వీటిని పెంచే కుండీలు అడుగున్నర లోతూ, పెంచుకునే మొక్కల సంఖ్యను బట్టి కనీసం అడుగు వ్యాసంతో ఉండాలి. పెద్ద ప్లాస్టిక్ పెయింట్ బకెట్లు బాగుంటాయి.
ఏడాదంతా కాసేలా… సొరా, బీరా, పొట్లకాయా, కాకర… ఏదయినా సరే కుండీకి లేదా పాదుకు నాలుగైదు గింజలు నాటుకోవాలి. ఇవి మొలకెత్తాక రెండు మొక్కలుంచుకుని బలహీనంగా ఉన్నవాటిని తీసేయాలి. నాటే ముందు విత్తనాలను బీజామృతంతో కలిపి ఆరబెట్టాలి. నాటిన 45-70 రోజుల్లో రకాన్ని బట్టి కాపు కొస్తాయి. ఇలా రెండుమూడు నెలలపాటు కాస్తూనే ఉంటాయి. వీటిని రకానికో కుండీలో ప్రతినెలా నాటుకుంటే ఏడాదంతా తాజా కూరగాయలు అందుతాయి.
పిందె వేసిన పది రోజుల్లోపు కోసుకుంటే కాయలు లేతగా ఉంటాయి. ఈ కూరగాయలను పందిరీ/జాలీ/కంచె మీదికి అల్లించేటప్పుడు పది కణుపుల వరకూ పక్కకొమ్మలూ, నులితీగలు తీసి తల తుంచివేయాలి. మొక్క ఆధారం కోసం కర్ర లేదా జాలీకి పురికొసతో కట్టి, తరువాత వచ్చే ప్రతి పక్క కొమ్మనూ 10-12 కణుపుల తరువాత తుంచేస్తే ఎక్కువ కాపు ఉంటుంది. నులితీగలను తీసేస్తే పూతా, పిందె ఎక్కువగా వస్తుంది.
విత్తనాల్లో రకాలు… పదిరోజులకొకసారి జీవామృతం, వర్మివాష్ లాంటివి పోస్తూ ఉంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పొగాకు కషాయం, పచ్చిమిర్చి కషాయం, గోమూత్రం చీడపీడలను అదుపులో ఉంచుతాయి. మజ్జిగా, వంటసోడా నీళ్లూ, బూడిద తెగులును చాలా వరకూ దూరంగా ఉంచుతాయి. ఫిరమోన్ ట్రాపు ఒకటి పెట్టుకోవడం వల్ల పండు ఈగ ప్రమాదం ఉండదు. స్టిక్కీట్రాపులు రెండుమూడు పెట్టుకుంటే రసం పీల్చే పురుగులు చాలావరకు అదుపులో ఉంటాయి. ముదిరిపోయి తీగ మీదే ఎండిపోయిన సొరా, బీరకాయలను దాచుకుంటే… కావాల్సినప్పుడల్లా విత్తనాలు నాటుకోవచ్చు.
కాకర, పొట్ల మాత్రం ముదిరి, పండిపోయిన కాయల నుంచి గింజలు తీసి, శుభ్రంచేసి, బూడిద కలిపి నీడలో ఆరబెట్టి వాడుకోవాలి. లేదంటే ఈ కిందివాటిని ఎంచుకోవచ్చు.
సొర – పొడవు కాయలకు ఇండమ్204 (ఇండో అమెరికన్), నరేంద్రజ్యోతి(విఎన్‌ఆర్), పీకేఎం1, సీవో1, కోలగా ఉండేవి: కోహినూర్ (విజ్ఞాన్), పూర్ణిమ (విఎస్‌ఆర్), గుండ్రని కాయలకు: నం.85
బీర – సన్నగా, పొడవుగా ఉండే కాయలకు జగిత్యాల లాంగ్, ఆర్తి, సురేఖ, మహిమ…
గుత్తుల్లో కాసేవి సాత్పూలియా
పొట్ల – తెల్లపొట్టి కాయలకు సీవో 2, శ్వేత, తెల్ల పొడవు కాయలకు: పీఎల్‌ఆర్1, కౌముది, ఆకుపచ్చ మీద తెల్లచారలుండే పొడవు కాయలకు సీవో1, ఎండీయూ1
కాకర – పొడవాటి ఆకుపచ్చ కాయలకు ఇండమ్ కోహినూర్, విఎస్‌ఆర్ 28,
తెల్ల కాయలకు ఇండమ్ తాజ్, చాందిని,
పొట్టిగా, గుండ్రంగా ఉండే ఆకుపచ్చ కాయలకు విఎస్‌ఆర్ కన్హయ్య
Raju's Resource Hub