దంత వైద్యులకు భవిష్యత్తు ఆందోళనకరంగా తయారవుతోంది. ఐదేళ్లపాటు కోర్సు చదివి, బీడీఎస్ డిగ్రీ పట్టాలు పొందిన వీరికి ప్రైవేట్ క్లినిక్లలో రూ.15-20 వేల వరకు మాత్రమే వేతనం అందుతోంది. స్వల్ప వేతనాలతో పనిచేయలేక, కష్టపడి ప్రారంభించిన సొంత క్లినిక్లకు ఆదరణ లభించక ఆర్థికంగా సతమతమవుతున్నారు. వీటికితోడు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వెసులుబాటు కలిగిన దంతవైద్యులు.. బీడీఎస్కు అదనంగా ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు చేసి, ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకుంటున్నారు. కెనడా, అమెరికా, ఇతర దేశాల్లో రెండేళ్ల బయోస్టాటిస్టిక్స్, ఎపిడమాలజీ, డేటా ఎనలిటిక్స్ తదితర ‘మాస్టర్ ఆఫ్ పబ్లిక్ల్త్’ కోర్సులు చేస్తూ స్థిరపడుతున్నారు.
ఏటా రాష్ట్రం నుంచి సుమారు 500 మంది దంతవైద్యులు విదేశాలకు వెళ్తున్నారని అంచనా. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ, 15 ప్రైవేట్ దంత వైద్య కళాశాలల్లో కలిపి బీడీఎస్లో 1,700, పీజీలో 350 వరకు సీట్లు ఉన్నాయి. నీట్ ద్వారా రెండో ప్రయత్నంలోనూ ఎంబీబీఎస్ లో సీటు రానివారు బీడీఎస్లో చేరుతున్నారు. వీరిలో 80% అమ్మాయిలే ఉంటున్నారు. 2024-25 సంవత్సరానికి విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో చేరినవారిలో 95% మంది అమ్మాయిలే ఉన్నారని ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. బీడీఎస్ పూర్తయ్యాక చాలా కొద్దిమందే పీజీలో చేరుతున్నారు. కొందరు బీడీఎస్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో..
డెంటల్ డాక్టర్లకు సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వడమే అరుదు కాగా, ఒక్కో పోస్టుకు 800 చొప్పున దరఖాస్తులు వచ్చిన సందర్భాలున్నాయి.
- ఏరియా ఆసుపత్రుల్లో డెంటల్ పీజీతో పాటు ఇతర కోర్సులు చేసిన వైద్యులు ‘హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్’గా పనిచేస్తున్నారు. పీజీ పూర్తిచేసినవారికి సర్వజన ఆసుపత్రుల్లో ఒకటి, రెండు పోస్టులు మాత్రమే ఉంటున్నాయి.
- బీడీఎస్ తర్వాత ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసినవారు ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.
బీమా, అవగాహన తక్కువ
రాష్ట్రంలో దంత సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లేవారు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు. పన్ను పుచ్చిపోయినప్పుడు, పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడే దంత వైద్యులను సంప్రదిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మాత్రం కొంత అవగాహనతో వైద్యుల వద్దకు వెళ్తున్నారు.
బీడీఎస్లు సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేయాలంటే ఫర్నిచర్, ఇతర సౌకర్యాలకు కనీసం రూ.12-15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించిన రెండు, మూడేళ్ల వరకు నిరీక్షిస్తేగానీ రోగుల నుంచి ఆదరణ కనిపించడం లేదు.
రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో దంత వైద్య విభాగంలో ఓపీ తక్కువ. రోగులకు బీమా సౌకర్యమూ అరుదే. విదేశాల్లో, అక్కడి ప్రజలు క్రమం తప్పకుండా దంతవైద్య పరీక్షలు చేయించుకుంటారు. బీమా సౌకర్యమూ ఉంటుంది.
ఇతర రంగాల్లో మాదిరిగానే డెంటల్ క్లినిక్ల మధ్య పోటీ పెరిగి, కొత్తగా ఈ రంగంలోకి వచ్చినవారు బాలారిష్టాలు ఎదుర్కొంటున్నారు. విశాఖ వంటి పెద్ద నగరాల్లో 500 వరకు డెంటల్ క్లినిక్లు ఉండగా, చిన్న జిల్లా కేంద్రాల్లోనూ 60-70 వరకు ఉంటున్నాయి. వైద్యుల నైపుణ్యం ఆధారంగా రోగుల ఆదరణ లభిస్తుంది.
బీడీఎస్ పూర్తిచేసిన వారు అదనపు కోర్సులు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవచ్చు. ఎంబీఏలో హెల్త్కేర్ మేనేజ్మెంట్, పబ్లికెల్త్, డిప్లొమా కోర్సులు కాస్మెటిక్ డెంటిస్ట్రీ, ఇంప్లాంటాలాజీ, ఆర్థోడాంటిక్స్, ఇతర స్పెషాల్టీల్లో అవకాశాలున్నాయి. పరిశోధన రంగంలోనూ రాణించవచ్చు. ఎన్బీడీఈ (యూఎస్ఏ), ఓఆర్అ (యూకే), ఏడీసీ (ఆస్ట్రేలియా) రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. అదనపు కోర్సులు పూర్తిచేసిన వారు విదేశాల్లో ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నారు.
Raju's Resource Hub
