📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పందెం కోళ్లు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పందాలకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆహారం.. శిక్షణ ఇచ్చి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. పందెం రాయుళ్లను ఆకట్టుకునేలా పుంజులను సన్నద్ధం చేస్తున్నారు. కొందరు ఆన్లైన్లోనే వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడిపందేలే అనేలా తయారైంది పరిస్థితి. స్థానికుల కంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువగా వీటిలో పాల్గొంటూ ఉంటారు. ఆ మూడు రోజులు రూ.500 కోట్లకు పైగా చేతులు మారతాయి. దీంతో పుంజుల పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆయిల్పాం తోటలు మొదలు, చెరువు గట్లు, పొలాలు తదితర ప్రాంతాల్లో కోళ్ల పెంపకాలు జరుగుతాయి. పందెం రాయుళ్లు.. పెంపకందారులతో ఒప్పందం చేసుకుని ప్రత్యేకంగా కోళ్లను పెంచుతారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చిన్నా పెద్దా కలిపి దాదాపు 400 పెంపకం కేంద్రాలున్నాయి. ఇప్పటికే ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పందెం రాయుళ్లు కోళ్ల కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి సంక్రాంతికి ఇక్కడకు వచ్చేవారు ఆన్లైన్లో (వీడియో కాల్ ద్వారా) పుంజులను చూసి బేరమాడుకుంటున్నారు. అడ్వాన్సు చెల్లించి వారు ఇక్కడకు వచ్చే నాటికి సిద్ధం చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. పోరాటం చేసే విధానం, రంగు, ఎత్తును బట్టి ఒక్కో పుంజును రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు అమ్ముతారు. ఈ నెల రోజుల్లో దాదాపు ఏడు వేలకు పైగా పుంజులు అమ్ముతారని అంచనా. వీటి అమ్మకాల పైనే రూ.25 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది.

నెమలి, అబ్రాస్, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, రసంగి, సీతువ తదితర జాతులకు చెందిన రెండేళ్ల వయసున్న కోళ్లను పందేలకు సిద్ధం చేస్తారు. నిత్యం ఉడకబెట్టిన గుడ్లు, బాదం, ఉడికించిన మటన్, జీడిపప్పు, రాగులు, సజ్జలు తదితర ఆహారం పెడతారు. బరువు పెరగకుండా చురుగ్గా పోరాటం చేసేలా ఈ మేత తినిపిస్తారు. పొగరు పెరగడానికి అశ్వగంధ పొడి పట్టిస్తారు. బికాంప్లెక్స్ మాత్రలు నీటిలో వేసి తాగిస్తారు. వాతం చేయకుండా కస్తూరి మాత్రలు తమలపాకులో చుట్టి పెడతారు. 90 రోజుల పాటు ఇదే తరహా ఆహారం అందిస్తారు. చెప్పాలంటే కోళ్లను ఇంట్లో బాలింత కంటే భద్రంగా చూస్తారు. స్నానానికి, తాగేందుకు వేడి నీటినే వాడతారు. అలుపు నియంత్రణ కోసం నీళ్లలో వదిలి వారానికి ఒకసారి ఈత కొట్టిస్తారు. వేగంగా తరుముతూ పరిగెత్తిస్తారు. ప్రత్యేక ఆహారం, రోగాల బారిన పడకుండా మందుల వినియోగం, గంపలు, కూలీలు ఇతర అన్ని ఖర్చులు కలిపి ఒక్కో కోడిని సిద్ధం చేసేందుకు రూ.30 వేల వరకు ఖర్చవుతుందని పెంపకందారులు చెబుతున్నారు.

Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading