Logo Raju's Resource Hub

అందరు బావుండాలి అన్న ఆలోచనకు నాంది పలికే రోజు రావాలి….!!

Google ad

కాలంనాడెప్పుడో వేమన గారు చెప్పినట్లు ” తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా” అని ఎంతసేపు ఎదుటి వారి తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకుంటే చివరికి మనం కూడా ఆ తప్పుల్లోనే కొట్టుకుపోతామని అనుకోవడం లేదు. మానసికమైన హింస చాలా ప్రమాదకరం కానీ దానికి సాక్ష్యాలు ఉండవు, శిక్షలు ఉండవు. నమ్మి వఛ్చిన వారిని నట్టేట ముంచి సమాజంలో సాధుజీవుల్లా చాలామంది నటించేస్తున్నారు. కొత్తగా వచ్చి చేరిన స్నేహాలు, పలకరింపులు, పరామర్శలు … వీటిలో తలమునకలౌతు తనను కావాలని వచ్చిన బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మహానుభావులెందరో ఈనాడు. తమ సుఖం చూసుకుంటారు కానీ అన్ని అమర్చిపెట్టే తోడును కనీసం తిన్నావా అని పలకరించడం చేతకాని ప్రబుద్ధులు.. గారాల పిలుపులతో నయగారాలు ఒలికిస్తూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కబుర్లు. నడవడి, వ్యక్తిత్వం అనేవి మనిషికి పెట్టని ఆభరణాలు. అవి లేని నాడు మనకు సొమ్ము ఎంత ఉన్నా విలువ లేనట్లే. నలుగురిలో గౌరవం మనకు ఉందిలే అనుకుంటే సరిపోదు. ఎదుటివారు మనకు ఇవ్వాలి కానీ మనకి మనం గొప్ప అనుకుంటే ఎలా…!

పరిచయాలు సుగంధాన్ని పరిమళింపజేయాలి కానీ దుర్గంధాన్ని వ్యాపింపజేయకూడదు. పర వ్యాపకాల కోసం కేటాయించే సమయంలో కాస్త మన కోసం బతికేవారి కోసం కూడా వెచ్చిస్తే కొద్దిపాటి సంతోషాన్ని కుటుంబంలో నింపగలిగినవారు అవుతారు. ఎన్నో జీవితాలు పడుతున్న మానసిక వేదనకు కారణం ఈ అంతర్జాల మాయాజాలం అవుతోందనడానికి సాక్ష్యాలు మనకు తెలిసినా దానిని నివారించలేని దౌర్భాగ్యంలో ఉన్నాం ఈరోజు. నిజాలు తెలిసినా నిలదీయలేని అసహాయత, ధైర్యం చేసి అడిగితే తమ తప్పులను ఎదుటివారికి అంటగట్టి వయసు, విజ్ఞత మరచి నోటికి వచ్చినట్లు నానా మాటలు అనే పెద్దమనుష్యులు ఈ సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. మన సంతోషం కోసం ఎదుటివారి జీవితాల్లో చీకటి నింపేంత హీన స్థితికి దిగజారే మనస్థత్వాలను వదలి అందరు బావుండాలి అన్న ఆలోచనకు నాంది పలికే రోజు రావాలి….!!

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading