Logo Raju's Resource Hub

Foot Problems / పాదాల సమస్యలు

Google ad

పాదాలలో పగుళ్లు
పాదాల పగుళ్లకు అలర్జీలు మొదలుకొని చాలా కారణాలు ఉండవచ్చు. శరీరానికి తగిన నీరు అందకపోతే కూడా కాళ్లకు పగుళ్లు ఏర్పడతాయి. మనం వాడే సబ్బు, తీసుకునే ఆహారంలో న్యూట్రిషన్ పాళ్లు తక్కువగా ఉండటమూ కారణం కావచ్చు. కాళ్ల పగుళ్లకు బ్యాక్టీరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణమైతే ఒక్కోసారి అవి పగుళ్ల నుంచి పుండ్లుగా మారొచ్చు. అందుకే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కొన్నిసార్లు డయాబెటిస్/థైరాయిడ్ /ఒబేసిటీ లాంటివీ కాళ్ల పగుళ్ల సమస్యకు కారణం కావచ్చు. పాదాల పగుళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కింది సూచనలు పాటించాలి. మంచినీటిని ఎక్కువగా తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి కాళ్లను కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచి, శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పొడిబట్టతో శుభ్రంగా, తడిలేకుండా తుడవాలి. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉండే క్రీములను కాళ్లకు రాసుకొని సాక్సులను ధరించాలి. రాత్రంతా సాక్స్లు ధరించడం మంచిది. కాలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో…
పాదాలకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా రకాలుగా ఉంటాయి. అందులో ముఖ్యమైన కొన్ని సమస్యలివే…
ఆనెకాయలు: షూ వల్ల ఒకేచోట నిరంతరం ఒత్తిడి పడుతుండటం వల్ల ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. దాంతో అక్కడ మృతకణాలు చేరుతూ పోవడం వల్ల ఈ ఆనెకాయలు వస్తుంటాయి. కొందరు ఆనెకాయలను బ్లేడుతో కోసేస్తుంటారు. మరికొందరు ఆనెకాయలపై కొన్ని చుక్కల యాసి పోస్తూంటారు. కానీ ఆనెకాయలు వస్తే దాని చుట్టూ ప్లాస్టర్ వేసి డాక్టర్కు చూపించాలి.
బ్యూనియన్: కొందరికి షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి బొటనవేలు లోపలి వైపునకు నొక్కుకుపోయి, దాని వెనకవైపు ఎముక ముందుకు పొడుచుకువచ్చినట్లుగా అవుతుంది. ఈ సమసయను ‘బ్యూనియన్’ అంటారు. కొందరిలో ఇది వారసత్వంగానూ కనిపిస్తుంది. షూ వల్ల మరింత పెరుగుతుంది. షూ ఒరుసుకుపోతున్న చోట… పాదం తనను తాను రక్షించుకునేందుకు మరో అదనపు కణజాలాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో సమస్య ఉన్నవారు డాక్టర్ను కలిసి, అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం.
అథ్లెట్స్ ఫుట్ : ఈ సమస్య ఫంగస్ కారణంగా వస్తుంది. నిజానికి ఈ ఫంగస్ ఎప్పుడూ పాదాలపై ఉండే ఉంటుంది. కానీ పాదం నిత్యం తేమ, తడిలో ఉన్నప్పుడు ఆ ఫంగస్ పెరిగి, చర్మం చిట్లి, అథ్లెట్స్ ఫుట్ సమస్య వస్తుంది. అరికాళ్లలో ఉండే చెమట గ్రంథుల స్రావంతోనూ పాదం చెమ్మబారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటప్పుడు పాదాన్ని శుభ్రంగా కడిగి, వీలైతే ఆల్కహాల్ ఉన్న వాష్లను ఉపయోగించి శుభ్రం చేసి, పాదాల మీద పౌడర్ చల్లి, ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకుంటే పాదం ఆరోగ్యంగా ఉంటుంది. సమస్య తీవ్రతను బట్టి యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాల్సి రావచ్చు.
బొటనవేలి గోరు లోపలికి పెరగడం : కొందరికి బొటనవేలిపై ఉన్న గోరు లోపలివైపునకు పెరుగుతూ ఉంది. ఇలా జరగకుండా చూసుకోవాలంటే కాలి గోర్లు తీసే సమయంలో మూలల్లో మరీ చిగుర్ల నుంచి కాకుండా కాస్తంత దూరం నుంచే కట్ చేసుకుంటే ఈ సమస్యను ఎప్పటికీ రాకుండా చూసుకోవచ్చు.
పాదాలకు తిమ్మిర్లు పట్టడం : పాదానికి తిమ్మిర్లు పట్టి, పాదం మొద్దుబారినట్లుగా ఉండటం చాలా మందిలో కనిపించే సాధారణ లక్షణమే. ఇలాంటి లక్షణం కనిపించినవారిలో షుగర్ వ్యాధి లేకపోతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే షుగర్ వ్యాధి ఉండి తిమ్మిర్లతో పాదం మొద్దుబారి స్పర్శ తెలియకపోతే మాత్రం తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.
పాదాల వ్యాయామం: పాదాల కోసం చేయాల్సిన వ్యాయామాలు చాలా రకాలుగా ఉంటాయి. చిన్న వయసులో అయితే స్కూలు ఆవరణలో ఆడే అనేక రకాల ఆటలు పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. స్కిప్పింగ్ లాంటివి కాళ్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకూ తోడ్పడతాయి. ఇక టీనేజ్ దాటాక జిమ్కు వెళ్లే యువకులు స్క్వాట్స్ మొదలుకొని, వారికి అనువుగా ఉండే అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. పిక్కలు మనకు గుండెలాంటివి కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్తపడటం వల్ల కాళ్ల ఆరోగ్యం బాగుటుంది. అయితే ఏ వయసు వారిలోనైనా బ్రిస్క్ వాకింగ్ చేయడం అన్ని విధాలా ఆరోగ్యకరం. అది కాళ్లతో పాటు సమస్త అవయవాలకూ ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుంది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading