Logo Raju's Resource Hub

Urinary Infection మూత్రనాళ ఇన్ఫెక్షన్

Google ad

దాదాపు అరవైశాతం మంది మహిళలు తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్
ఈ సమస్య పురుషులతో పోలిస్తే.. మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సంతానోత్పత్తి వయసులోనే కాదు మెనోపాజ్ తరువాత కూడా ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మహిళ కావడమే. మూత్రాశయం దగ్గర బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే… మహిళల్లో మూత్రాశయ మార్గం నుంచి మూత్రం బయటికి వెళ్లే మార్గం చాలా చిన్నగా ఉంటుంది. దాంతో బ్యాక్టీరియా చేరితే సులువుగా వ్యాపిస్తుంది. అలా వచ్చే ఇన్ఫెక్షన్లలో కొన్నింటిని యాంటీబయాటిక్స్తో నివారించవచ్చు.ఒకవేళ ఇన్ఫెక్షన్ తాలూకు బ్యాక్టీరియా మూత్రపిండాలకు గనుక వ్యాపిస్తే.. నడుమునొప్పీ, చలీ, జ్వరం, వికారం, వాంతులు.. కావడం వంటివన్నీ కనిపిస్తాయి. ఈ సమస్య కొందరిలో ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చి తగ్గిపోతే మరికొందరిలో తరచూ ఇబ్బందిపెట్టొచ్చు.
కానీ చాలామంది ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటాం. వైద్యులకు ఆ లక్షణాలను చెప్పడానికి ఇబ్బందిపడతారు. చాలామటుకు వీటిని మందులతోనే నయం చేయొచ్చు. కానీ అలా చేయకపోవడం వల్ల ఇతర సమస్యలు వస్తాయి.
అవి ఎలాంటి సమస్యలంటే…
– తరచూ ఇన్ఫెక్షన్ కనిపించడం, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. అది క్రమంగా అధిక రక్తపోటుకు దారితీసి.. చివరకు మూత్రపిండాలు పనిచేయని పరిస్థితి ఎదురవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
– సమస్య మొదట్లోనే అదుపు చేయకపోతే… మెనోపాజ్ వచ్చాక అర్జ్ ఇంకాంటినెన్స్ సమస్య ఎదురుకావచ్చు. అంటే తెలియకుండానే మూత్రం పడిపోవడం, నియంత్రించుకోలేకపోవడం వంటి ఇబ్బందులన్నమాట.
– ఒకవేళ గర్భధారణ సమయంలో ఎదురైతే గనుక ఆ తల్లికే కాదు.. పుట్టబోయే పాపాయికీ కొన్నిసార్లు ప్రమాదకరమే. కొన్నిసార్లు లక్షణాలు కనిపించకపోవచ్చు కూడా.
– మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజెన్ హార్మోను విడుదల ఆగిపోతుంది. అదే జననేంద్రియాల్లో పీహెచ్ శాతాన్ని పెంచుతుంది. క్రమంగా అదే ఇన్ఫెక్షన్కి కారణం అవుతుంది.
లక్షణాలు….
– తరచూ బాత్రూంకి వెళ్తుంటే మంటగా అనిపించడం…
– రోజులో ఎక్కువ సార్లు బాత్రూంకి వెళ్లడం… లేదా ఆపుకోలేకపోవడం
– పొత్తి కడుపులో నొప్పి, కలయిక సమయంలో నొప్పి
– మూత్రం కోసం తరచూ నిద్ర లేవడం
– మూత్రం నురగగా ఉండటం, దుర్వాసన..
– చాలా అరుదుగా మూత్రంలో రక్తం కనిపించడం వంటివన్నీ దీనికి సంకేతాలే.
ముందు జాగ్రత్తలే మేలు…
– మంచినీళ్లు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా బ్యాక్టీరియా బయటకు పోతుంది. ఇన్ఫెక్షన్ అదుపులోకి వస్తుంది. అలాగని రోజులో నాలుగైదు లీటర్ల నీటిని తాగాలని లేదు. మూత్రం రంగు తెల్లగా పారదర్శక రంగులో వచ్చేవరకూ మంచినీళ్లు తాగితే సరిపోతుంది.
– ఒక రోజులో ఒకటిన్నర నుంచి రెండు లీటర్ల వరకూ ద్రవపదార్థాలు తీసుకోవాలి. రోజూ రెండుపూటలా భోజనం సమయంలో నీళ్లు తాగితే చాలనుకోకూడదు. ప్రతి గంటకోసారి దాహం వేసినా వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండాలి. భోజనం చేసేప్పుడు మాత్రం మరో గ్లాసు అదనంగా తీసుకుంటే చాలు.
– గాఢతా, సువాసన ఎక్కువగా ఉండే సబ్బులూ, యాంటీసెప్టిక్ క్రీంలూ, స్ప్రేలూ, పౌడర్లు జననేంద్రియ భాగాల్లో వాడకుండా చూసుకోవాలి.
– వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి. మలవిసర్జనకు వెళ్లిన తరువాత ముందునుంచీ వెనక్కి శుభ్రం చేసుకోవాలి. దానివల్ల బ్యాక్టీరియా మూత్రకోశంలోకి వెళ్లకుండా ఉంటుంది. జననేంద్రియ భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంకి వెళ్లినప్పుడు పూర్తిగా వెళ్లాలి తప్ప మధ్యలోనే ఆపేయకూడదు. కాటన్ లోదుస్తుల్ని ఎంచుకోవాలి. అవి కూడా రోజులో రెండుసార్లు మార్చుకోవాలి.
– లైంగికచర్య సమయంలో ఎక్కువశాతం బ్యాక్టీరియా మూత్రాశయంలోకి చేరుతుంది. అదే ఇన్ఫెక్షన్కి దారితీయొచ్చు. అందుకే కలయిక తరువాత తప్పనిసరిగా మూత్రవిసర్జనకు వెళ్లాలి. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కూడా ఎక్కువశాతం బ్యాక్టీరియా చేరుతుంది. దాన్ని నివారించాలంటే పీచుశాతం ఎక్కువగా ఉన్న పండ్లూ, కూరగాయలు తీసుకోవాలి. పండ్లరసాలు ఎక్కువగా తాగాలి. కుదిరితే క్రాన్బెర్రీ జ్యూస్ని తాగడం మంచిది. ఇది బజార్లో దొరుకుతుంది. ఇందులో ప్రత్యేకంగా ఉండే యాసిడ్ మూత్రంలోకి ప్రవేశిస్తుంది. అది మూత్రం పీహెచ్శాతాన్ని తగ్గిస్తుంది. పీహెచ్శాతం ఉన్నప్పుడే బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి దాన్ని అదుపులో ఉంచుతుంది.
– బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా వైద్యులు యాంటీబయాటిక్స్ని సిఫారసు చేస్తారు. అంటే నేరుగా ఇన్ఫెక్షన్ని నివారించకుండా పరోక్షంగా బ్యాక్టీరియా సంఖ్యను తగ్గిస్తారు. రెండోసారి లక్షణాలు కనిపిస్తే మూత్ర పరీక్ష చేయించుకుని ఆ ప్రకారమే మాత్రల్ని వాడాలి. మందులు వాడి ఆపేసిన తరువాత సమస్య తిరగబెట్టే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ తరువాత కూడా పరీక్ష చేయించుకుని లేదని నిర్ధరించుకోవాలి. కొందరు బ్యాక్టీరియాను నివారించేందుకు దీర్ఘకాలం మందులు వాడాల్సి రావచ్చు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading