Logo Raju's Resource Hub

డెలివరీ అలారం, ప్రసవవేదన

Google ad

ప్రకృతి అత్యద్భుతమైనది. నలుసు కడుపున పడిన సమయం నుంచి కావలసినవన్ని, గర్భంలోనే సమకూర్చి పెట్టేలా ఏర్పాటు చేసింది. నలభై వారాలు కడుపులో ఉన్నా పర్లేదు కాని.. నాలుగు నిమిషాలు ఆలస్యం అయితే బిడ్డకు అనేక సమస్యలు. అందుకే బిడ్డ పుట్టుకను ఆలస్యం కాకుండా చూసేలా ఒక హెచ్చరికలాంటి వేదనను ఏర్పాటు చేసింది. అదే ప్రసవవేదన. కాన్పు సమయంలో వచ్చే ఆ నొప్పులు ఏమిటో, కాన్పు ఎందుకు ఆసుపత్రిలో అయ్యేలా చూసుకోవాలో, అలా చూసుకోకపోతే వచ్చే సమస్యలు…
తల్లి గర్భాశయం నుంచి బిడ్డను బయటకు నెట్టే ప్రక్రియను ప్రసవం లేదా డెలివరీ అంటారు. ప్రసవ సమయంలో బిడ్డ యోనిమార్గం ద్వారా బయటకు వస్తే దాన్ని సాధారణ ప్రసవం అని, లేదా శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసుకురావడాన్ని సిజేరియన్‌ డెలివరీ అంటారు. ఒకవేళ నెలలు పూర్తిగా నిండక మునుపే… అంటే 37 వారాలకు మందే ప్రసవం జరిగితే దాన్ని ‘ప్రీమెచ్యూర్‌’ డెలివరీ అంటారు.
తల్లి గర్భాశయం నుంచి బిడ్డను, ఉమ్మనీటి పొరను, మాయను, యోనిమార్గనుంచి బయటకు తీసువచ్చేందుకు వీలుగా జననాంగాల్లో జరిగే మార్పుల తీరును లేబర్‌ అని, ఆ సమయంలో వచ్చే నొప్పులను ప్రసవ వేదన అంటారు.
నొప్పులు ఎప్పుడు : తల్లి కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి బయటకు వచ్చేందుకు పట్టే వ్యవధిని అంచనా వేయడానికి ఒక ఉజ్జాయింపు లెక్క కడతారు. చివరిసారిగా రుతుస్రావం అయిన తేదీ నుంచి బిడ్డ బయటకు రావడానికి 280 రోజులు వ్యవధి పడుతుంది. వారాల్లో చెప్పాలంటే 40 వారాలు, నెలల్లో చెప్పాలంటే తొమ్మిది నెలలు పూర్తయ్యాక వారం రోజుల వ్యవధి పడుతుంది. దీని ఆధారంగా ప్రసవం అయ్యే తేదీని డాక్టర్లు ఉజ్టాయింపుగా చెబుతారు.
ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి రెండువారాలు ముందుగా లేదా మరికొందరిలో ఒకవారం ముందుగా లేదా మరికొందరిలో సరిగ్గా ప్రసవం అయ్యే సమయానికి నొప్పులు రావచ్చు.
సాధారణ ప్రసవం : నొప్పులు వాటంతట అవే ప్రారంభమై, గర్భాశయ ముఖద్వారంలో బిడ్డ తల కిందివైపునకు ఉండటం, బిడ్డ బయటకు వచ్చే ప్రక్రియ మరీ ఆలస్యం కాకుండా బయటి ప్రమేయాలతో బిడ్డ బయటకు వచ్చి,తల్లికీ, బిడ్డకూ ఎలాంటి హాని జరుగకపోతే దాన్ని సాధారణ ప్రసవంగా చెప్పవచ్చు.
అబ్‌నార్మల్‌ లేబర్‌ : సాధారణ ప్రసవం సమయంలో ఉండాల్సిన ఏ అంశమూ సవ్యంగా లేకుండా ఉంటే దాన్ని అబ్‌నార్మల్‌ లేబర్‌గా పేర్కొనవచ్చు అంటే జనన మార్గంలో బిడ్డ తలకింది వైపునకు తిరగకుండా ఉండటం,లేదా ఏదైనా అవరోధం వల్ల ప్రసవానికి ఆటంకం కలగడం, తల్లి, బిడ్డ ఈ రెండు ప్రాణాల్లో దేనికైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉండటాన్ని అబ్‌నార్మల్‌ లేబర్‌గా పేర్కొనవచ్చు.
కాన్పునొప్పులకు ముందు : గర్భాశయంలోని బిడ్డ నుంచి ఏసిటిహెచ్‌, కార్డిసోలఠ్‌ అనే హార్మోన్లు విడుదలై అవి తల్లి నుంచి స్రవించే ప్రోస్టాగ్లాండిన్స్‌, ఈస్ట్రోజెన్‌, ఆక్సిటోసిన్‌ వంటి హార్మోన్లను ఉత్తేజితం చేస్తాయి. గర్భాశయం కుంచించుకుపోవటంతో కాన్పునొప్పులు మొదలవుతాయి.
కాన్పు నొప్పులు ప్రారంభమైనపుడు నొప్పులు నెమ్మదిగా మొదలై క్రమంగా తీవ్రమవుతాయి.
ప్రసవ క్రమం: ఆ తర్వాత గర్భాశయం ముఖద్వారం విచ్చుకోవటం మొదలవుతుంది. దీనివల్ల అక్కడ ఉండే ఉమ్మనీటి పొరలు, చిన్న రక్తనాళాలు చిట్లి కొంత తెలుపుతో పాటు అవి యోని మార్గం నుంచి బయటకు స్రవిస్తాయి. దీనే షో అంటారు. ఇక ఆ తర్వాత ఉమ్మనీటి పొర సర్విక్స్‌లోకి ఉబ్బుతుంది. కొందరిలో ఉమ్మనీటి పొర చిట్లి ఉమ్మనీరు వేగంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలో శిశువు తల కిందకు దిగుతుంది.
శిశువును బయటకు తీసుకువచ్చే నొప్పులను పవర్‌ అని శిశువును ప్యాసెంజర్‌ అని, బిడ్డ వచ్చే మార్గాన్ని ప్యాసేజ్‌ అంటారు. సాధారణ డెలివరి పవర్‌ ప్యాసెంజర్‌, ప్యాసేజ్‌ అన్ని బిడ్డ బయటకు రావడానికి అనువుగా ఉండాలి.
పవర్‌ నొప్పులు : కాన్పు నొప్పులు మొదట్లో పది నిమిషాలకు ఒకమారు వచ్చి.. వచ్చినపుడల్లా 10…20 సెకన్లు ఉంటాయి. ఇవి మొదట్లో 10-15 నిమిషాలకు ఒకసారి వచ్చి… వచ్చినపుడు 20-30 సెకన్లు కొనసాగుతాయి. కొందరిలో మరింత ఎక్కువసేపు ఉంటాయి. ఈ నొప్పులు నడుములో ప్రారంభమై,పొత్తి కడుపునుంచి, తొడలలోకి పాకుతున్నట్లుగా వస్తాయి. లేబర్‌ చివర్లో 30-40 సెకన్లుపాటు ఉంటాయి. ప్రసవం సమయంలో గర్భాశయ కండరాలు ముడుచుకునిపోతూ. సాగుతూ, గర్భాశయ ముఖద్వారం తెరచుకుంటూ ఉండటం వల్ల వస్తాయి.బిడ్డ బయటకు వచ్చేందుకు తల్లికూడా సహకరించి పొట్ట కండరాలను బలంగా బిగబట్టటంతో బిడ్డ బయటకు వస్తుంది.
జననమార్గం: శిశువు గర్భాశయం నుంచి బయటకు రావాలంటే పెల్విన్‌ అనే ఎముకలనుంచి రావాల్సి ఉంటుంది. ఈ మార్గం శిశువు పరిమాణానికి సరిపడా ఉంటేనే బిడ్డ బయటకు రాగలుగుతుంది.
శిశువు : బిడ్డ బరువు, పొజిషన్‌, ప్రజెంటేషన్‌ అంటే, గర్భాశయం కిందివైపునకు బిడ్డ ఉందా మరే అవయవమైనా ఉందా అనే అంశాలపై కూడా ప్రసవం ఆధారపడి ఉంటుంది.
ప్రసవ దశలు : నాలుగు దశలుగా విభజింపవచ్చు.
మొదటి దశ : నిజమైన కాన్పునొప్పులు మొదలైన దగ్గర నుంచి గర్భాశయ ముఖద్వారం పూర్తిగా విచ్చుకునే వరకు ఉండే దశను మొదటి దశగా చెప్పవచ్చు. ఈ దశ వ్యవధి తొలిచూలు వారిలో 12 గంటలు ఉంటే, మలిచూలు వారిలో 6 గంటలు ఉండవచ్చు.
రెండో దశ : ఇది గర్భశయ ముఖద్వారం పూర్తిగా విచ్చుకున్న దగ్గర నుంచి బిడ్డ బయటకు వచ్చే వరకు ఉంటుంది. మొదటి కాన్పు వారికి గంట నుంచి రెండు గంటలు వరకు తర్వాత కాన్పులలో అరగంట వరకు ఈ దశ కొనసాగుతుంటుంది.
మూడో దశ : బిడ్డ పుట్టినప్పటి నుంచి, మాయ బయటపడే వరకు ఉండే దశ ఇది. దీనికి 15 నిమిషాలు పడుతుంది.
నాలుగో దశ : మూడో దశ తర్వాత ఒక గంటపాటు నిపుణుల పర్వవేక్షణలో ఉంచాల్సిన దశగా దీన్ని అభివర్ణించవచ్చు. ఈ దశలో తల్లి బి.పీ, పల్స్‌ రేట్, బ్లీడింగ్‌ వంటివి పరిశీలిస్తూ ఉండాలి.
చాలామందిలో కాన్పుకి రెండు మూడు వారాల ముందునుంచే కడుపు కొంచెం గట్టిగా, వదులుగా అవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వచ్చే నొప్పులను కాన్పు నొప్పుల్లా అనిపించే నొప్పులు లేదా ఫాల్స్‌ లేబర్‌ పెయిన్స్‌ అంటారు. నిజమైన కాన్పు నొప్పులకు, ఫాల్స్‌ ఫెయిన్స్‌కు తేడా ఇలా.. నిజమైన నొప్పులు: ప్రసవం మొదలయ్యే టైమ్‌కు వస్తాయి. నొప్పులు క్రమబద్ధంగా, కొద్ది కొద్ది విరామాలతో వస్తూ, క్రమంగా నొప్పి వచ్చే వ్యవధి పెరుగుతూ ఉంటుంది. నొప్పి నడుములో మొదలై పొత్తికడుపులోకి వస్తుంది. గర్భాశయం కండరాలు సమర్థంగా ముడుచుకుంటూ, సర్విక్స్‌ మెత్తబడి విచ్చుకోవటం మొదలవుతుంది.
ఉమ్మనీటి పొరలు, చిన్న రక్తనాళాలు చిట్లి, కొంత తెలుపుతో పాటు రక్తం బయటకు స్రవించే షో మొదలవుతుంది. నొప్పి ఉపశమించేందుకు ఇచ్చే మందులు, ఎనిమా వంటివి ఇస్తే నొప్పులు తగ్గవు.
కాన్పునొప్పుల్లా అనిపించేవి : ప్రసవానికి చాలా రోజుల ముందు నుంచే వస్తాయి. నొప్పి రావడం క్రమబద్ధంగా ఉండదు. నొప్పి తీవ్రతల్లో మార్పు ఉండదు. నొప్పి చాలావరకు పొత్తికడుపులోనే ఉంటుంది. గర్భాశయం కండరాలు ముడుచుకోవడం ఉంటుంది గానీ, సర్విక్స్‌ లో మార్పు ఉండదు. షో ఉండదు. ఉపశమన మందులు, ఎనీమాతో నొప్పులు తగ్గుతాయి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading