Logo Raju's Resource Hub

సింగపూర్ పర్యాటకం

Google ad

దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. చిన్న ద్వీపం దేశం. మలేషియాకు దక్షిణాన ఉంది. దక్షిణ ఆసియాలో సింగపూర్ అతి చిన్న దేశం.
1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
వ్యాపారపరంగానూ, ఆర్థికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయము. పర్యాటకముగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశము సింగపూర్.
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్థిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది . ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.
సింగపూర్… పేరు వినగానే సందర్శకులకు అందాల సెంటోసా దీవి, అతిపెద్ద జెయింట్వీల్, మరీనా బే శాండ్స్, చైనాటౌన్, నైట్ సఫారీ
లిటిల్ ఇండియా… ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తుకొస్తాయి. వాటిలో కొన్ని…….
నైట్ సఫారీ
నైట్ సఫారీ అంటే రాత్రివేళలో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. జంతుప్రదర్శనశాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళలో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటము పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళలో కూడా జంతుప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.
పక్షుల పార్క్
ఇక్కడ పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అద్భుతమైన ఈ ప్రదర్శన పర్యాటకులనెంతో ఆకర్షిస్తుంది.అలాగే అనేక రకముల పక్షులను ఇక్కడ సందర్శించ వచ్చు. గద్ద తన ఆహారాన్ని ఎలా వేటాడుతుందో ఇక్కడ సందర్శకుల కోసము ప్రదర్శిస్తూ ఉంటారు.అత్యంత అపురూపమైన లేత కాషాయ రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తము చుట్టి చూడటానికి చక్కని రైలు ప్రయాణము ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్ పై భాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పైకి వెళ్ళినపుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా చూడగలగటము ఒక అద్భుతమైన ఆకర్షణ.
సెంతోసా ద్వీపం
ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్లాయన్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్లాయన్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవం ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
ఇక్కడ చూడవలసిన వాటిలో ఆండర్ వాటర్ వరల్డ్ ఇంకొకటి. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. సింగపూరు సముద్ర తీరాన రేవు (హార్బర్) నుండి క్రూయిజ్ లలో 12 గంటల టూర్, మరియు రెండు నుండి మూడు రోజుల పడవ ప్రయాణము చేయవచ్చు. ఈ టూరులో ఈ దేశములో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. సముద్రతీరములో డాల్ఫిన్ షో లను జరుపుతూ ఉంటారు. లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్ ఇవి చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్ టెక్ లలో తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. సన్ టెక్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడ అనేక మతాలకు సంబంధించిన గుడులు ఆయా సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తూ భక్తులను అలరిస్తుంటాయి. ఇక్కడి భోజనశాలల్లో రుచికరమైన భారతీయ భోజనం లభిస్తుంది.
చాంగి విమానాశ్రయం
విమానం దిగగానే ముందుగా చూడాల్సింది అక్కడి చాంగి విమానాశ్రయం. అది ఓ సుందరలోకం… ప్రయాణికులు స్వర్గధామంగా భావించే అద్భుత పర్యటక ప్రదేశం..! ఆవిమానాశ్రయంలో అడుగుపెడితే, టెక్నాలజీప్రియులూ ప్రకృతి ప్రేమికులూ షాపింగ్ లవర్లూ అయిన పర్యటకులకి సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఎందుకంటే పేరుకే అదో విమానాశ్రయం. కానీ ఉద్యానవన విహారానికీ విందువినోదాలకీ పెట్టింది పేరు. అందుకే ప్రపంచంలోకెల్లా ఉత్తమ విమానాశ్రయంగా ‘స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్’ సంస్థ అందించే అవార్డును వరసగా ఐదోసారీ గెలుచుకుంది. 1981లో ప్రారంభమైననాటి నుంచి నేటి వరకూ 533 పురస్కారాల్ని దక్కించుకుంది.
ఈ విమానాశ్రయం కోసమే తయారుచేసిన ఆర్కిడ్ టీ పెర్ఫ్యూమ్ని అన్నిచోట్లా చల్లడంతో లోపలకు వెళ్లగానే ఒకరకమైన పూల పరిమళం గుబాళిస్తూ ఏ దేవలోకంలోకో అడుగుపెడుతోన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవలే నాలుగో టెర్మినల్నీ సొంతం చేసుకున్న ఈ ఎయిర్పోర్టు, యాభై వేలమంది సిబ్బందితోనూ వేలాది ప్రయాణికులతోనూ నిత్యం కళకళలాడుతుంటుంది. అక్కడి నుంచి ప్రతి 90 సెకన్లకీ ఒకటి చొప్పున వారానికి ఏడు వేల విమానాలు వచ్చిపోతుంటే, ఏటా దాదాపు ఆరుకోట్లకు పైగా ప్రయాణికులు ఎక్కి దిగుతుంటారు.

వన విహారం!
అరుదైన వృక్షజాతుల్నీ జీవజాతుల్నీ చూడాలనుకునే వాళ్లకి చాంగి ఎయిర్పోర్టు ఓ చూడచక్కని వేదిక. దాదాపు 250 జాతులకు చెందిన ఐదు లక్షల మొక్కలు అక్కడ కనువిందు చేస్తుంటాయి. ముళ్లమొక్కల కాక్టస్ గార్డెన్, తామరపూల కొలను, ఆర్కిడ్ వనం, జలపాతాలతో కూడిన వర్షారణ్యం, పొద్దుతిరుగుడు పూలతోట…
ఇలా పలు రకాల ఉద్యానవనాల్లో హాయిగా విహరించవచ్చు. సీతాకోకచిలుకలకూ అక్కడో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. అందులో సింగపూర్ జాతీయ కీటకమైన రోజ్ బటర్ఫ్లైతోబాటు నలబై జాతులకు చెందిన ఇతర సీతాకోకచిలుకలు ఎగురుతుంటాయి.
ప్రకృతి అందాలకి సాంకేతిక పరిజ్ఞానం తోడయితే ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నదానికి అక్కడి ఎన్ఛాంటెడ్ గార్డెనే ప్రత్యక్ష నిదర్శనం. అందులో ప్రధానంగా ఆకర్షించేది అక్కడున్న నిలువెత్తు పూలకుండీ. చూడగానే అది మొక్కల్ని పెంచే కుండీలా అనిపిస్తుంది కానీ, అదో ఫ్లవర్ వేజ్. బొకే ఆకారంలో గాజుతో చేసిన ఆ వేజ్లో దాదాపు రెండువేలకు పైగా టెస్ట్ ట్యూబులు అమరి ఉంటాయి. ఒక్కో ట్యూబులో తాజా పూలనీ ఆకుల్నీ ఉంచి వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ నిజంగానే అందులో మొక్కల్ని పెంచుతున్నారేమో అనిపించేలా చేస్తుంటారు. అంతేకాదు, దాని దగ్గరకు వెళ్లగానే మనిషి కదలికల్ని గుర్తించిన సెన్సర్లు, గాలిసవ్వడులు చేస్తూ పచ్చని ప్రకృతిలో విహరించిన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే అక్కడున్న కొలనులో నారింజ రంగులోని ఆర్చర్, కొయ్ చేపలూ నీళ్లలో కేరింతలు కొడుతూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి.

సాంకేతిక వినోదం!
టెర్మినల్-1లో ఏర్పాటుచేసిన సెల్ఫీ ట్రీ అంటే ప్రయాణికులకు ఎంతిష్టమో. చెట్టు ఆకారంలో రూపొందించిన ఆ పరికరం, చుట్టూ నిలువెత్తు సైజులో టచ్ స్క్రీన్ కంప్యూటర్లు ఉంటాయి. వాటి ముందు నిలుచుని సెల్ఫీ దిగగానే అది చెట్టు పైభాగంలోని డిస్ప్లే బోర్డులో కనిపిస్తూ, అందులో స్టోరయిపోతుంది. ఆ విమానాశ్రయాన్ని సందర్శించామన్న గుర్తుగా అది అక్కడ శాశ్వతంగా కనీసం ఓ వందేళ్లపాటు ఉండిపోతుందన్నమాట. కంప్యూటర్లోని ఆప్షన్ల ద్వారా సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ డిజైన్లనీ మార్చుకోవచ్చు. దీన్ని ఫేస్బుక్లోకీ పంపించుకోవచ్చు. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్లకోసం రెండు, మూడో టెర్మినల్స్లో నిర్మించిన థియేటర్లలో రోజంతా ఉచితంగా ప్రదర్శించే బ్లాక్బస్టర్ మూవీలన్నింటినీ చూడొచ్చు. కంప్యూటర్ గేమింగ్ జోనుల్లో ఎంతసేపయినా ఆడుకోవచ్చు. ట్రాన్సిట్ లాంజ్ల్లోని ఎమ్టీవీ బూత్ల్లో ఇష్టమైన మ్యూజిక్ వీడియోలను చూడొచ్చు.
ఇక, షాపింగుమాల్స్ సరేసరి. విమానం కోసం వేచి చూస్తూ లాంజ్ల్లో కూర్చున్నప్పుడు- పసిపిల్లలకు తల్లులు పాలు ఇవ్వాలన్నా డైపర్లు మార్చాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అందుకే పాపాయిలకోసం ప్రత్యేకగదులూ ఉన్నాయి. పిల్లలు విసిగించకుండానూ బోరు కొడుతుందని ఏడవకుండా హాయిగా ఆడుకునేందుకు స్లైడ్లూ, టన్నెల్సూ కూడా ఏర్పాటుచేశారు. విమానాశ్రయంలోని అన్ని టెర్మినల్స్నీ సందర్శించి రావడానికి వెంట లగేజీని తీసుకెళ్లకుండా భద్రపరిచే కౌంటర్లూ ఉన్నాయి. బడలికతో అలసిపోయి కాసేపు కునుకు తీయాలనుకునేవాళ్లకోసం స్నూజ్ లాంజ్లూ, ఎయిర్పోర్టు ట్రాన్సిట్ హోటల్లో సేదతీరే అతిథులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రూఫ్టాప్ ఈతకొలనూ… వంటివన్నీ ఈ విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే, మరో ఏడాదీ రెండేళ్లలో పూర్తయ్యేలా మరో టెర్మినల్నీ, అన్ని టెర్మినల్స్ని అనుసంధానిస్తూ ‘జ్యూయెల్ చాంగి ఎయిర్పోర్టు’ పేరుతో మరో కట్టడాన్నీ నిర్మిస్తున్నారు. అందులో సుమారు 11 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇండోర్ ఫారెస్ట్నీ, వాటర్ఫాల్నీ ఏర్పాటుచేస్తున్నారు. ‘ద రెయిన్ వోర్టెక్స్’ పేరుతో ఏర్పాటుచేస్తోన్న ఆ వాటర్ఫాల్ రాత్రి వేళల్లో రకరకాల థీమ్ల్లోని లైట్ అండ్ సౌండ్ మ్యూజిక్ ఫౌంటెయిన్గా మారిపోతూ సందర్శకుల్ని ఆహ్లాదపరుస్తుందనడంలో సందేహం లేదు.
సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు, సిటీ బస్సుల పై ఆధారపడతారు. ముందుగా డబ్బులు చెల్లించి తీసుకున్న పాసులతో నిర్ణయించిన మైలేజి వరకు ప్రయాణము చేయవచ్చు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్, వాహన రద్దీలను తగ్గించుటకు ఇక్కడి ప్రభుత్వము పార్కింగ్ రుసుము అధికము చేయడము, అధిక కొనుగోలు పన్నులను విధించడము చేస్తుంటుంది. ఈ కారణంగా ప్రజలు ఎక్కువగా బస్సులు, రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. టాక్సీలలో ఎక్కువగా ఒకేరకమైన కనీస రుసుము వసూలు చేస్తుంటారు. విహార యాత్రీకుల కోసము ఆకర్షణీయమైన పైభాగము తెరచి ఉండే బస్సులను నడుపుతూ ఉంటారు.
సింగపూరు దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి, విస్తారమైన వర్షాలు కలిగిన దేశం . గాలిలో తేమ సరాసరి 90 శాతం. వరసగా వర్షాలు పడే సమయాలలో ఇది 100 శాతానికి చేరుకుంటుంది.వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.గొడుగుల అవసరం ఎక్కువ కాబట్టి వీటిని దృఢంగాను ఆకర్షణీయంగానూ తయారు చేస్తారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో ప్రక్క దేశమైన ఇండోనేషియా పొదలలో రేగే మంటల కారణంగా సంభవించే వాతావరణ కారణంగా ఆరోగ్య రక్షణకోసం ప్రభుత్వమునుండి కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూంటారు.
సింగపూర్ జనాభాలో 51 శాతము ప్రజలు బౌద్ధమత, థాయిజమ్ అవలంబీకులు. 15 శాతము ప్రజలు. క్రిస్టియన్లు, 14 శాతం ముస్లిములు వీరిలో అధిక శాతం ఇండియా ముస్లిములు. స్వల్ప సంఖ్యలో సిక్కుమత, హిందూమత, బహాయి విశ్వాము కలిగిన ప్రజలు ఉన్నారు. 15 శాతము ప్రజలు ఏ మతం అవలంబించని వారుగా గుర్తించబడ్డారు. వీరు కాక అనేక మతాలకు చెందిన దేశ సభ్యత్వము లేని ప్రజలు ఇక్కడ పనులను నిర్వహిస్తూ నివసిస్తూ ఉంటారు.
సింగపూరు జాతీయ భాష మలయ్. వారి జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది.
ఇంకా పూర్తి వివరాలకోసం …..సింగపూర్ టూరిజం బోర్డ్ వారి అధికారిక వెబ్ సైట్ ను చూడండి……
http://www.visitsingapore.com/en_in.html

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading