Google ad
లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా, వ్యవసాయశాఖామాత్యులైన సి.సుబ్రహ్మణ్యన్ గారి ఆధ్వర్యంలో ఎమ్.ఎస్.స్వామినాథన్ గారు అమలు పరిచిన వ్యవసాయ విప్లవమే హరిత విప్లవం.
నోబెల్ గ్రహీత, ప్రపంచ హరిత విప్లవ పితామహుడైన నార్మన్ బోర్లాగ్ పర్యవేక్షణలో మొదలైన ఈ మహత్తర పథకం భారతదేశ వ్యవసాయరంగ భవితను తిరగరాసి, ఆహారధాన్యాల కొరతను మరచి, మిగులుపై దర్జాగా కూర్చునేలా చేసింది.
ముందు కాస్త నేపథ్యం చూద్దాం.
స్వాతంత్య్రం సమయానికి దేశంలో 90% జనాభా వ్యవసాయమే జీవనోపాధిగా పల్లెల్లో ఉండేది. పెరుగుత్నున జనాభా, ఏళ్ళుగా మారని సేద్య పద్ధతులు వ్యవసాయంలో తగినంత పురోగతి తేకపోగా దేశవృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి.
1961లో దేశం ఎదుర్కొన్న క్షామం వల్ల తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 1964 దాకా వ్యవసాయ రంగానికి తగిన ఊతమివ్వటంలో ప్రభుత్వ విధానాలు సైతం విఫలమయ్యాయి.
మొదటి పంచవర్ష ప్రణాళిక తరువాత ఉపేక్షకు గురైన వ్యవసాయరంగం గురించి నెహ్రూ గారు అన్న మాట:
“స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ళ తరువాత కూడా వ్యవసాయప్రధాన దేశమైన మనం మనకు తగినంత ఆహారం పండించుకోవటంలో విఫలం అయ్యాం. దేవుడిపైనో, వరదలపైనో, క్షామంపైనో నెపముంచి లాభం లేదు. మన ప్రణాళికలోనే లోపం ఉన్నదన్న విషయాన్ని ఒప్పుకోవాలి.”
అప్పటికే వ్యవసాయంపై మరింత దృష్టి పెట్టాలని అమెరికా చేస్తున్న సూచనను మన నేతలు గూడుపుఠాణి అని ఉపేక్షించటం జరిగింది.
1950ల నుంచే పీ.ఎల్-480 అనే అమెరికన్ చట్ట ప్రకారం వారి నుండి గోధుమలు పెద్ద ఎత్తున భారతదేశానికి దిగుమతి అయ్యేవి (ఈ చట్టం ముఖ్యోద్దేశం అమెరికా స్వప్రయోజనమే). 1960-1964 కాలంలో అత్యధికంగా 16 మిలియన్ టన్నుల గోధుమలు దిగుమతి అయ్యాయి. ఈ దిగుమతుల వల్ల ప్రపంచం భారతదేశాన్నిఒక “బాస్కెట్ కేస్”లా చూడసాగింది[1].
నెహ్రూ గారి తరువాత జూన్ 2, 1964లో ఏకగ్రీవ ఎన్నికతో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యేప్పటికి దేశంలో:
- ధాన్యం కొరత
- ధరల పెరుగుదల
- వ్యవసాయంలో తిరోగతి
- పారిశ్రామిక వృద్ధి నెమ్మదించి నిరుద్యోగ సమస్య పెరుగుదల
- విదేశీ మారక నిల్వలు దాదాపు ఖాళీ
శాస్త్రిగారు వ్యవసాయ సంస్కరణలకు పెద్దపీట వేసి, మేధావి అయిన సి.సుబ్రహ్మణ్యన్ గారిని ఆహార, వ్యవసాయశాఖామాత్యులుగా నియమించారు.
సుబ్రహ్మణ్యన్ గారు నార్మన్ బోర్లాగ్ గురించి, ఆయన మెక్సికోలో విజయవంతంగా పండించిన కొత్తరకం HYV-హై ఈల్డ్ వెరైటీ (తక్కువ-సమయంలో-ఎక్కువ-దిగుబడి) మరగుజ్జు గోధుమ వంగడాల గురించి వాకబు చేసి, వాటి దిగుమతికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రత్యేక విమానాల్లో 16000 టన్నుల మరుగుజ్జు గోధుమ విత్తనాలను తెప్పించారు. పెద్దఎత్తున ఎరువుల దిగుమతి, ఎరువుల పరిశ్రమలో విదేశీ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు. ఎమ్.ఎస్.స్వామినాథన్, బి.శివరామ్ గార్ల ఆధ్వర్యంలో దేశం నలుమూలలా ఆ గోధుమల సాగును వ్యాపింపజేశారు.
సాగుకు ఆధునిక పద్ధతుల అవసరం ఉండటంతో ట్రాక్టర్ల వంటి పరికరాలు, పనిముట్ల గిరాకీ పెరిగి ఆ పరిశ్రమకు ఊతం దొరికింది.
అలాగే ఎక్కువ శ్రమ అవసరంతో వ్యవసాయ కూలీలకు తగినంత పని, తద్వారా నిత్యావసర వస్తువుల అమ్మకాలు పెరిగాయి. గ్రామాల్లో ఆదాయవ్యయ స్థాయిల్లో పురోగతి మొదలైంది.
ప్రతిఫలం వేగంగా దక్కింది[2]:
- 1967-1977 వరకు గోధుమ పంట ఏటా 5.5% పెరిగింది.
- 1973లో సోవియెట్ యూనియన్ వద్ద చేసిన గోధుమల అప్పులో 5,50,000 టన్నులు తీర్చేసాం.
- 1979లో వియెత్నాంకు 3,00,000 టన్నులు, ఆఫ్ఘనిస్తాన్‌కు 50,000 టన్నుల గోధుమలు అప్పుగా ఇచ్చాము.
- 1984లో ఇథియోపియాకు కరువుసాయంగా ధాన్యం పంపాము.
1950-1951లో 54 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహారధాన్య ఉత్పత్తి కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టేసరికి 200 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే ఏటా 3% వృద్ధి (1905 నుండి 1945 వరకు ఇది 1%గా నమోదయింది).
ఇదే సమయంలో జనాభా పెరుగుదల 2.1%. అలా ఆహారకొరత ఉన్న “బాస్కెట్ కేస్” దేశం నుంచి మిగులు పండించగల స్థితికి ఎదిగాం.
అయితే హరిత విప్లవం తెచ్చిన తంటాలూ ఉన్నాయి:
- అధిక దిగుబడి రకాల సాగుకు అవసరమైన రసాయనిక ఎరువుల అధిక వాడకంతో ఎన్నో ప్రదేశాల్లో భూసారం స్వభావమే మారిపోయింది.
- ఆధునిక వ్యవసాయ పద్ధతుల అతివేగ అనుసరణతో సాంప్రదాయ, సేంద్రీయ పద్ధతులకు అర్ధాంతర అవసానం ఏర్పడింది.
- ఆధునిక పద్ధతులు సన్నకారు రైతులకు అందుబాటులో లేనందున, ఆపై అస్తవ్యస్తంగా అమలైన భూసంస్కరణల వల్ల ఆదాయ, సాంఘిక అసమానతలు పెరిగాయి.
- హరితవిప్లవానికి ముందు సాగయ్యే ఆహార పంటలెన్నో తరువాత పశుగ్రాస పంటలైపోయాయి. అలాగే ఎన్నో సాంప్రదాయ వరి రకాలు దాదాపు అంతరించిపోయాయి.
Google ad
Raju's Resource Hub