Logo Raju's Resource Hub

యానాం అసెంబ్లీ నియోజకవర్గం 6th April 2021 ఎన్.రంగస్వామి vs గొల్లపల్లి అశోక్

Google ad
యానాం

పుదుచ్చేరి అసెంబ్లీకి తొలి ఎన్నికలు 1964లో జరిగాయి. తమిళనాడులో అంతర్భాగంగా కనిపించే పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలతో పాటూ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ చిన్న పట్టణంగా కనిపించే యానాం కూడా పుదుచ్చేరి పరిధిలో ఉంటుంది. ఇక కేరళ రాష్ట్రంలో భాగమా అన్నట్లు అరేబియా సముద్ర తీరంలో ఉన్న మాహె కూడా దీని కిందికే వస్తుంది. ఈ నాలుగు ప్రాంతాలలో కలిపి 30 అసెంబ్లీ స్థానాలతో పుదుచ్చేరి శాసనసభ ఏర్పడింది. ఎక్కువ ప్రాంతం తమిళనాడు సమీపంలో ఉండడంతో దానికి తగినట్లు ఇక్కడి రాజకీయాల్లో కూడా తమిళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

యానాం అసెంబ్లీకి ఇప్పటి వరకూ 15 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట ఏడు దఫాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కామిశెట్టి శ్రీపరశురామ వరప్రసాదరావు నాయుడికే ఇక్కడ విజయం దక్కడం విశేషం. 1963లో ఆయన భార్య కామిశెట్టి సావిత్రి కూడా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో ఫ్రెంచివారి నుంచి పాలనా పగ్గాలు ఇండియాకు దక్కినపుడు ఆమె కూడా అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు.

ఆ తర్వాత 1990 వరకూ యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుదుచ్చేరి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వరప్రసాదరావు నాయుడు మూడు సార్లు ఇండిపెండెంట్‌గా, రెండు సార్లు కాంగ్రెస్, ఒకసారి జనతాపార్టీ అభ్యర్థిగా గెలవడం విశేషం. పార్టీలు మారినా, వ్యక్తులను ఆదరించడం యానాంలో ఆనవాయితీగా వస్తున్నట్టు, ఇక్కడి చరిత్ర చెబుతోంది. 1990 ఎన్నికల్లో డీఎంకే మొదటిసారి ఇక్కడి నుంచి గెలిచింది. ఆపార్టీ తరుపున రక్షా హరికృష్ణ విజయం సాధించారు. ఆ మరుసటి ఏడాది 1991లో మళ్లీ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలగా రాజేశ్వరరావు గెలిచారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లాడి కృష్ణారావు ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. 2000లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పి.షణ్ముగం గెలవగా, 2001లో మళ్లీ మల్లాడి కృష్ణారావు ఇండిపెండెంట్‌గానే గెలిచారు. తర్వాత 2006, 2011, 2016 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన మల్లాడి కృష్ణారావుకు హ్యాట్రిక్ విజయాలు దక్కాయి. మొత్తంగా చూస్తే, యానాం నుంచి 50 ఏళ్లలో 5 సార్లు ఇండిపిండెంట్ అభ్యర్థులకే విజయం సాధించడం విశేషం.

1996 నుంచి ఇప్పటికీ యానాం రాజకీయాలు మల్లాడి కృష్ణారావు చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పుదుచ్చేరి ప్రభుత్వంలో వివిధ పదవులు నిర్వహించారు. కీలకమైన మంత్రిత్వశాఖలు ఆయనకు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలతో ఆయనకు మంచి సంబంధాలుండేవి. అదే సమయంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డితోపాటూ, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌తో కూడా ఆయన స్నేహం కొనసాగిస్తున్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారాల్లో కూడా కొంత చొరవ చూపుతుంటారు. ఈసారి మల్లాడి కృష్ణారావు పోటీకి దూరంగా ఉండడం ఆసక్తిగా మారింది. కొన్ని నెలల క్రితం ఏపీ రాజకీయాల్లో తనకు అవకాశం కల్పించాలని ఆయన బహిరంగంగానే సీఎం జగన్‌కి విజ్ఞప్తి చేశారు.

Google ad

మత్స్యకార కులానికి చెందిన మల్లాడి ఏపీలో బీసీ కార్పోరేషన్ల చైర్మన్ల ప్రమాణస్వీకారానికి విచ్చేసి, విజయవాడలో జరిగిన సభలో మాట్లాడారు. “జనవరి 6 తర్వాత పాండిచ్చేరి రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నాను. ఎలాంటి పదవులు ఆశించకుండా మీరు కేక వేస్తే, మీ కుటుంబం ఉన్నంత వరకూ మీ పార్టీకి సేవ చేసేందుకు రెడీగా ఉన్నాను. ఎలాంటి పదవులు, వేరేవి గానీ వద్దు. వెనుకబడిన జాతుల వ్యక్తిగా నా సూచనలు, సలహాలు ఉపయోగించుకుంటామని చెబితే, అంటే ఈ పదవులను వదిలేయడానికి ఈ క్షణంలోనే రెడీగా ఉన్నాను. జనవరితో నేను రాజకీయాల్లోకి వచ్చి పాతికేళ్లు నిండుతాయి. కాబట్టి, నేను జగన్ నాయకత్వాన నడుస్తాను” అని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కి చెందిన మల్లాడి కృష్ణారావు తన పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరిలో ఆయనతో పాటూ, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రాజీనామాలు సమర్పించడంతో అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం లేక నారాయణ స్వామి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.

పాతికేళ్ల పుదుచ్చేరి రాజకీయ ప్రస్థానం ముగిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, మల్లాడి కృష్ణారావు మరోసారి ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మల్లాడి యానాం ఎన్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.రంగస్వామిని గెలిపించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. దాదాపుగా తానే పోటీచేస్తున్నట్లు వాడవాడలా ప్రచారం నిర్వహిస్తున్నారు. రంగస్వామి తమిళుడు కావడంతో తెలుగు వారు ఎక్కువగా ఉండే, యానాంలో ఓటర్లకు చేరువయ్యేందుకు మల్లాడి అంతా తానై వ్యవహరిస్తున్నారు. రంగస్వామి తన సొంత నియోజకవర్గం తట్టన్ చావిడితోపాటూ, యానాంలో కూడా పోటీ చేస్తున్నారు. ఎన్.ఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రంగస్వామి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండడంతో, ఒకవేళ గెలిచినా ఎక్కడి నుంచి కొనసాగుతారో అనే చర్చ కూడా సాగుతోంది.

నామినేషన్ వేస్తున్న రంగస్వామి

మల్లాడి కృష్ణారావు పోటీలో ఉన్నా, లేకున్నా రంగస్వామిని ఆయన నిలబెట్టిన అభ్యర్థిగానే చూస్తున్నారు. కానీ, ఆయనకు గతంతో పోలిస్తే కొంత ప్రతిఘటన ఎదురవుతోంది. యానాం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రజల్లో ఇటీవల కొంత అసంతృప్తి కనిపిస్తోంది. బలమైన సొంత సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో మల్లాడి అండదండలతో పోటీ చేస్తున్న రంగస్వామిని, వారంతా ఆదరిస్తారని ఆ వర్గం ఆశిస్తోంది.

ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్

ఈసారీ పోటీ రంగస్వామి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ యువకుడు కావడం, గతంలో ఆయన తండ్రికి యానాంలో మంచి గుర్తింపు ఉండడంతో రంగస్వామికి ఆయన నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 16 మంది బరిలో ఉన్నా కాంగ్రెస్ కూడా మద్ధతునివ్వడంతో ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్, ఎన్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీనియర్ నేత రంగస్వామి మధ్యనే ప్రధాన పోటీ సాగుతోంది.

యానాం

యానాం పట్టణం, మరో ఏడు గ్రామాలతో ఉన్న యానాం జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 55,626 మంది ఉన్నారు. ఇక యానాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 37,747 మంది ఓటర్లున్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి చూస్తే చిన్నదే అయినప్పటికీ పుదుచ్చేరి రాజకీయాల్లో యానాం నేతలు కీలక పాత్ర పోషించారు. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న రంగస్వామి యానాం నుంచి బరిలో ఉండడంతో పుదుచ్చేరి ప్రాంతమంతా ఇది చర్చనీయమవుతోంది.

అదే సమయంలో ఇండిపెండెంట్ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలున్నా, యానాంలో మాత్రం పరిశ్రమలు మూతపడ్డాయని ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ అంటున్నారు. యువత ఉపాధి, పేదల భవిష్యత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. “ఒకప్పుడు ఏపీతో పోలిస్తే యానాంలో సంక్షేమం బాగుంది అనే వారు. ఇప్పుడు ఏపీలో పేదలకు సొంతింటి కల నెరవేరుతుంటే, యానాంలో పేదలకు చాలాకాలంగా సెంటు స్థలం కూడా అందడం లేదు. యానాంలో తగిన వైద్య సదుపాయం కూడా లేకపోవడంతో ప్రతి చిన్న సమస్యకు కాకినాడ ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. వాటిని చక్కదిద్దాలనే పోటీ చేస్తున్నా. ప్రజల మద్ధతు ఉంది. ఏకవ్యక్తి పాలనుకు ముగింపు పలికి, యానాం అబివృద్ధికి పాటుపడతాం “అని ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ అన్నారు.

మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనుచరులు మాత్రం ఓటర్లు తమను ఆదరిస్తారని నమ్ముతున్నారు. ” ఈ ప్రాంతానికి కృష్ణారావు నేతృత్వంలోనే ఒక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన బలపరిచిన రంగస్వామి సీఎం అయితే యానాం మరింత అభివృద్ధి అవుతుంది. .

ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గెలుపు ఆశలతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కానీ, రాజకీయ సమీకరణాలు మారడంతో ఏప్రిల్ 6న జరిగే పోలింగ్‌లో యానాం ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading