Google ad
స్వర శాస్త్రంలోను, యోగ , తంత్ర శాస్త్రాలలోను శరీరంలోని నాడుల గురించి చెప్పబడిఉంది. శివ సంహితలో నాడులు 3,50,000 అని చెప్పబడింది. ప్రపంచ సార తంత్రంలో 3,00,000 నాడులు అని చెప్పబడ్డాయి. వాశిష్ట సంహిత, గోరక్ష శతకం, హఠ యోగ ప్రదీపిక, హఠరత్నావళి, స్వరశాస్త్ర మంజరి లలో కూడా 72,000 నాడుల గురించి చెప్పబడ్డాయి. నాడీ శాస్త్ర సంగ్రహంలో 16 నాడులు ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. హఠ రత్నావళిలో ముఖ్యమైన 14 నాడులు వాటి అధిదేవతలు వాటి స్థానాలు చెప్పబడ్డాయి. వీటిలో మరీ ముఖ్యమైనవి మూడుగా చెప్పబడ్డాయి. ఈ మూడు నాడుల గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. అవి ఇడ, పింగళ, సుషుమ్నలు. శరీరంలో ఈ నాడులు అంతర ప్రవాహినులు. కొందరు ఈ నాడీ వ్యవస్థను నరకోశాలతో అనుసంధానం చేయటం కలదు. కానీ ఈ నాడులు పైకి కనిపించేవి కావని ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులలో చెప్పబడింది. సంస్కృతంలో నాడి అనగా ప్రవహించేది అని అర్థం (ఫ్లో). నాడులు తరంగ చలనం ద్వారా ప్రాణశక్తిని ప్రవహింపజేసేవి.
శరీరము, మనస్సులను శక్తిమంతంగా ఉంచేవి ధన ఋణాత్మక అయస్కాంత రేణువులు. అణువులను ఛేదించి శక్తిని (Nuclear energy) విడిచి పెట్టటం మనిషి సాధించినాడు. ఇదే విధంగా అధిక శక్తిని మన శరీరం నుంచి విడుదల చేయవచ్చును. మానవ మనశ్చేతనను వృద్ధి చేయడానికి మన ప్రాచీన ఋషులు ప్రాణశక్తిని సాధనంగా రూపొందించారు. రెండింటికి భేధమేమంటే ఒకటి బయటినుంచి శక్తిని ఉపయోగించుకుంటే, రెండవది అంతశ్శక్తిని వినియోగించుకుంటుంది.
ప్రాణశక్తి శరీరంలో పుట్టే న్యూక్లియర్ హై ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఎలా పనిచేస్తాయో అదే విధంగా పని చేస్తుంది. ఒత్తిడి వలన వేగంగా ప్రవహించే నీటి ప్రవాహ వేగానికి చక్రాలు తిరిగి, విద్యుచ్ఛక్తి వచ్చినట్లే, ఈ చర్యవలన అయస్కాంత శక్తి పుట్టి నిల్వ అయినట్లే యోగులుకూడా శరీరంలో ప్రాణశక్తి అనే బ్యాటరీని శ్వాసపద్ధతి ద్వారా చార్జిచేసి శ్వాస పద్ధతిలో శక్తిని పుట్టిచడం జరుగుతుంది. ఈ శక్తికి నియమాలే షట్చక్రాలుగా చెప్పారు.
శ్వాస తగ్గిస్తే ఆయువు పెరుగుతుందా? అని చాలా మందికి సందేహం ఉంది. ఆ విషయాన్ని గురించి ఆలోచిద్దాం. యోగ గ్రంథాలలో మనం పీల్చే, విడిచే గాలి సంఖ్య 21600 అని ఇవ్వబడింది. అంటే నిముషానికి 15 సార్లు శ్వాసక్రియ సాధారణ వ్యక్తులలో జరుగుతుంది. శక్తి వినియోగానికి శ్వాసక్రియకు దగ్గర సంబంధం ఉంది. ఏఏ పనులకు ఎంతెంత శ్వాస నడుస్తుంది అనే విషయం కూడా యోగ గ్రంథాలు వివరించాయి.
పాటలు పాడేటప్పుడు శ్వాస విడుపు ఒక అడుగు, ఆహారం తినేటప్పుడు 15 అంగుళాలు, నడిచేటప్పుడు 2 అడుగులు, నిద్రలో రెండున్నర అడుగులు, మైధున క్రియలో మూడు అడుగులు, వ్యాయామం చేసేటప్పుడు వీటన్నిటికంటే ఎక్కువ శ్వాస క్రియ జరుగుతుంది. పూర్వ కాలంలో శ్వాస నడకను బట్టి వర్గీకరణ చేసేవారు, నేడు శక్తి వినియోగంబట్టి వర్గీకరణ జరుగుతుంది. కేలరీలలో శక్తిని కొలుస్తున్నారు. యోగాసనాలు వేసేటప్పుడు ఒకటి నుంచి మూడు కేలరీలు ఒక నిముషానికి ఖర్చు అవుతుంది. అదే వ్యాయామంలో అయితే 3 నుండి 20 కేలరీలు ఒక నిముషానికి ఖర్చు అవుతుంది.
పురాణ గ్రంథాలు, అధ్యాత్మిక గ్రంథాలు, నీతి కావ్యాలు చదివేవారికి, బ్రహ్మచర్యం పాటించే వారికి, జపం, ధ్యానం చేసేవారికి శ్వాసక్రియ తగ్గుతుంది. ఏకాగ్రత ఆయువు పెరుగుతాయి. కోరికలు ఎక్కువగా ఉన్నవారికి శ్వాసక్రియ సంఖ్య అధికమవుతుంది. తక్కువ కోరికలు ఉన్నవారికి, ఆశలేనివారికి శ్వాసక్రియల సంఖ్య తక్కువగా ఉంటుంది. వారు ఎక్కువకాలం జీవిస్తారు. నిత్య జీవన కార్యకలాపాలలో మన విలువైన ఊపిరి చాలా వ్యర్థమవుతుంది. సాధారణ శ్వాసక్రియ కంటే యోగ సమాధిలో సాంద్రత నాలుగురెట్లు ఎక్కువ అవుతుంది. ద్యానంలో ఆరింతలు అవుతుంది. ఏడుపులో 10 రెట్లు, మాట్లాడుతున్నప్పుడు 12 రెట్లు, నడకలో 16 రెట్లు, నిద్రలో 22 రెట్లు, సంభోగంలో 36 రెట్లు ఉంటుంది. మౌనం పాటించండం వల్ల పొదుపు చేసి ఆయుర్థాయం పెంచుకోవచ్చు.
Google ad
Raju's Resource Hub