
వాస్తు శాస్త్రరీత్యా నిర్మించుకున్న ఇంటికి బయట వైపు ఏదైనా వీధి మన గృహమును కానీ ప్రహారీ గోడను కానీ తాకుచున్నచో ఆ వీధిని వీధి పోటు లేదా వీధిశూల అంటారు. ఆ వీధి మన గృహాం దగ్గరగా వచ్చి నిలిచి పోవచ్చు లేదంటే కొన్నిసార్లు అక్కడి నుంచి పక్కకు తిరిగి ముందుకు సాగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే వీధిలో నడిచే వారి కంటి దృష్టి మన ఇంటి నిర్మాణ స్థలం యొక్క ప్రహరీపై లేదా ఇంటి పై పడటాన్నే వీధి పోటు అంటారు. ఈ వీధి పోట్లు మంచివి మరియు చెడువి రెండు రకాలుగా ఉంటాయి.
మంచి చేసే వీధి పోట్లు:
1.తూర్పు ఈశాన్య వీధి పోటు
2.ఉత్తర ఈశాన్య వీధి పోటు
3.దక్షిణ ఆగ్నేయ వీధి పోటు
4.పడమర వాయువ్య వీధి పోటు
1. తూర్పు ఈశాన్యం వీధి పోటు:
ఈ వీధి పోటు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మనశ్శాంతి, నిరంతరం ధన వృద్ది, విదేశాలకు వెళ్లడం, ఆకస్మిక రాజయోగం, ఉన్నత పదవులు, సంతానం అభివృద్ధి చెందుతుంది.
2. ఉత్తర ఈశాన్యం వీధి పోటు:
ఈ వీధి పోటు కూడా శుభ ఫలితాలు ఇస్తుంది. ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యాలు కలిగిస్తుంది, ఉన్నత విద్య యోగం, విలాసవంతమైన జీవితం, ఇంటిలో ఉన్న స్త్రీలు రాజకీయ, వ్యాపార ఉద్యోగ రంగాలలో ప్రగతిపథంలో పయనిస్తారు.
3. దక్షిణ ఆగ్నేయ వీధి పోటు:
ఈ వీధి పోటు శుభ ఫలితాలనే ఇస్తుంది. జనాకర్షణ, ధర్మ చింతన, స్త్రీల అభివృద్ధి ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు కావడం మగవారికి సంఘంలో గౌరవం లభిస్తుంది.
4. పడమర వాయువ్య వీధి పోటు:
ఇది కూడా మంచి చేసే వీధి పోటు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు మరియు కీర్తి ప్రతిష్టలను ఇస్తుంది.
చెడు చేసే వీధి పోట్లు :
1.తూర్పు ఆగ్నేయ వీధి పోటు
2. దక్షిణ నైరుతి వీధి పోటు
3.పడమర నైరుతి వీధి పోటు
4.ఉత్తర వాయువ్య వీధి పోటు
1. తూర్పు ఆగ్నేయ వీధి పోటు:
ఇది నష్టం కలిగించే వీధి పోటు ఎందుకంటే ఈ వీధి పోటువల్ల ఆ గృహస్తుడు నరకయాతనను అనుభవించాల్సి ఉంటుంది. తీరని సమస్యలు, అసంతృప్తికర జీవితం, విపరీత ఖర్చులు, రావాల్సిన చోట డబ్బులు రాకపోవడం, భూ సంబంధ వివాదాలు, జైలు శిక్షలు అనుభవించడం మొదలగునవి.
2. దక్షిణ నైరుతి వీధి పోటు:
దక్షిణ నైరుతిలో వీధి పోటు తీవ్ర ఆర్థిక సమస్యలు కారణం అవుతుంది. యజమాని లేదా పుత్ర సంతానం అనారోగ్యం పాలవుతారు. అనారోగ్య ఖర్చుల నిమిత్తం అప్పులు చేస్తారు. మానసిక అశాంతి, అభద్రతా భావం, ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది.
3. పడమర నైరుతి వీధి పోటు:
ఈ వీధి పోటు వలన అనేక రకములైన బాధలకు గురికావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇంటి యజమానిపైన ఆ దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినడం ఆర్థిక పతనం మానసిక ఒత్తిడి కుటుంబసభ్యుల మధ్య కలహాలు ఉంటాయి.
4. ఉత్తర వాయువ్య వీధి పోటు:
ఈ ఈ వీధి పోటు గృహస్థుల ఆర్థిక పతనానికి దారి తీస్తుంది. సంతానం దారి తప్పడం ఊహించని విధంగా వ్యాపారాలు నష్టాలు రావడం. పెట్టుబడులు పెట్టి మోసపోవడం, అప్పులు తీరకపోవడం జరుగుతాయి.
తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలలో పూర్తి ఎదురుగా వచ్చే వీధి పోట్లు మరియు ఈశాన్య మూల నుండి వచ్చే వీధి పోట్లు మంచి ఫలితాలను ఇస్తాయి.
ఆగ్నేయ, నైరుతి , వాయువ్య దిశల్లో వచ్చే వీధిపోట్లు చెడు ఫలితాలను ఇస్తాయి. ఒక్కోసారి మంచివి అనుకున్న వీధిపోట్లు చెడు ఫలితాలను చెడ్డవి అనుకున్న వీధిపోట్లు మంచి ఫలితాలను ఇస్తుంటాయి. అందుకు గల కారణం శల్య వాస్తు, ఇంటి యొక్క వాస్తు నిర్మాణం, దిక్కులు మొదలగు భౌగోళిక పరిస్థితులు మరియు వీధిపోటు కలిగించే తీవ్రత పై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
Raju's Resource Hub