పుదుచ్చేరీ- ప్రాంతీయ సరిహద్దులు
రాజ్యాంగ పరిధిలో అనివార్యంగా కొన్ని వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొత్త కాదు గనుక సహజమైన ప్రజాస్వామ్య ప్రక్రియే అనుకోండి. తొలివిడత లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 19 తేదీన మొదలౌతున్నాయి. అందులో పుదుచ్చేరీ ఏకైక లోక్‌సభ ఒకటి.
చారిత్రకంగా పుదుచ్చేరీకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 1723లో వ్యాపారం కోసం భారతదేశం లోకి అడుగుపెట్టారు. ప్రధాన వర్తక కేంద్రంగా పుదుచ్చేరీని ఎంచుకున్నారు. అనుబంధంగా ఫ్రెంచి స్థావరాలుగా మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. తమిళం మాతృభాషగా గల పుదుచ్చేరీ, కారైకాల్ తమిళనాడు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఈ రెండిరటి దూరం 150 కిలోమీటర్లు. కేరళ రాష్ట్రం పశ్చిమాన మలబారు తీరంలో మాహే ఉంది. పుదుచ్చేరీ నుండి వెయ్యి కిలోమీటర్ల దూరం. మాట్లాడే భాష మలయాళం. ఇక ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు ప్రాంతమైన యానాం భౌగోళికంగా పూర్వ తూర్పు గోదావరి జిల్లా అంతర్భాగంగా గోదావరి ఎడమ పాయ ఒడ్డున ఉంది.
పుదుచ్చేరీకి యానాం 850 కి.మీ దూరంలో ఉంది. విచిత్రంగా ఇవన్నీ ఒకే లోక్‌సభ పరిధిలోకి వస్తాయి.
పుదుచ్చేరీ ఓటర్ల సంఖ్య అక్షరాల పది లక్షల ఇరవై మూడువేల ఏడువందల తొంభై తొమ్మిది. యానాం ఓటర్లు 39,408 మంది. పుదుచ్చేరీ కేంద్రపాలిత ప్రాంతంలో 30 శాసనసభ నియోజకవర్గాలున్నాయి ( పుదుచ్చేరీ`22, కారైకాల్`6, మాహే`1, యానాం`1). ఏ నియోజకవర్గ ఓటర్ల సంఖ్య నలభై వేలకు మించదు.
జాతీయోద్యమం సమయంలో ఫ్రెంచి స్థావరాల పరిస్థితి విచిత్రంగా ఉండేది. చుట్టూరా బ్రిటిష్ వారిని తరిమికొట్టాలని ఉద్యమాలు, సత్యాగ్రహాలు జరుగుతుంటే ఈ ప్రాంతాలు మాత్రం ఏ అలజడీ లేకుండా
ఉండేవి. స్తబ్దతగా ఉదాసీనంగా ఉండేవి. దేశమంతా జాతీయభావంతో కదంతొక్కుతున్నపుడు ఇక్కడ ఎంతమాత్రం స్పందన లేకపోవడం ఆశ్చర్యమే.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్ళకు గానీ స్థానికంగా ఉద్యమాలు చైతన్యం కాలేదు. నమ్మదగనివాళ్ళను నమ్మి అమాయకంగా మోసపోవడం వల్ల జరిగిందిది. ఎట్టకేలకు 1954లో యానాం భారతయూనియన్‌లో విలీనం అయ్యింది.
పుదుచ్చేరీ లోక్‌సభ స్థానం దేశం లోనే ప్రత్యేమైందని చెప్పుకోవచ్చు. భిన్న భాషలు, సంస్కృతి నియోజకవర్గంలో కనిపిస్తాయి. నాలుగు భిన్న ప్రాంతాల ప్రజలు ఒక లోక్‌సభ సభ్యుడ్ని ఎన్నుకోవడం ఒక విశేషం. ఎన్‌డిఏ కూటమి అభ్యర్థిగా బిజెపికి చెందిన కేంద్రపాలిత ప్రాంత హోం మంత్రి ఏ. నమశ్శివాయం పోటీ చేస్తున్నారు. ఈయనకు ప్రసుతం పుదుచ్చేరీలో ఉన్న ఎన్. ఆర్. కాంగ్రెసు బలపరుస్తోంది. ఈయన ముఖ్యమంత్రికి స్వయాన మేనల్లుడు. తనదైన బలం ఉన్నప్పటికీ పుదుచ్చేరీ శ్రేయస్సు, అభివృద్ధి కోసం బిజెపి అభ్యర్థిని గెలిపించే ప్రయత్నంలో రంగసామి ప్రభుత్వం ఉంది.
ఇక కాంగ్రెసు తరపున మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత లోక్‌సభ సభ్యుడు వి. వైద్యలింగం పోటీ చేస్తున్నారు. 30 నియోజక వర్గాల్లో 21 మంది శాసనసభ్యులు నమశ్శివాయం తరపున ఉంటే వైదలింగం పక్షాన 9 మంది శాసనసభ్యులున్నారు. ఎన్నికల బరిలో 26 మంది ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది.
39,408 ఓటర్లున్న యానాం నియోజకవర్గంలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. స్థానిక శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. బిజెపికి బయట నుండి బలపరుస్తున్నారు. మాజీ మంత్రి, ఢల్లీికి పుదుచ్చేరీ ప్రత్యేక ప్రతినిదిగా వ్యవహరిస్తున్న మల్లాడి కృష్ణారావు ఎన్‌ఆర్ కాంగ్రెసు ఎన్‌డిఏ కూటమికే మద్ధతు ఇస్తున్నారు. ఈయన స్వతంత్రంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అనుయాయిగా యానాంలో చక్రం తిప్పుతున్నారు. ఆయన యానాం అభివృద్ధికి సంబంధించి పరిష్యారం కాకుండా ఉండిపోయిన కొన్ని సమస్యల్ని కోరికల చిట్టాగా ఎన్‌డిఏ అభ్యర్థికీ ముఖ్యమంత్రికి విన్నవించి వాటిని నెరవేరుస్తానని వాగ్దానం తీసుకుని పనిచేస్తున్నారు.
ఇక కాంగ్రెసు అభ్యర్థి వైద్యలింగం యానాం ప్రజలకు చిరపరిచితులు, తెలుగు మాట్లాడతారు. సౌమ్యుడుగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రత్యర్థి వర్గాలుగా ఉన్నవారు కనుక కలిసి కాకుండా వేర్వేరుగా ఒకే వ్యక్తి తరపున ప్రచారం చేస్తున్నారు. ఇదొక వింత. ఈ ఇద్దరిలో ఎవరి వల్ల ఎన్ని ఓట్లు వచ్చినా బిజెపీ అభ్యర్థి ఖాతాలోనే పడతాయి. గెలుపోటముల్ని ప్రభావితం చేసేలా యానాం ఓట్ల బలం ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
మరో సంగతి. యానాం నియోజకవర్గంలో 1300 మంది ముస్లింలు, రెండువేలు మంది క్రైస్తవులు, 5200 మంది ఎస్‌సిలు ఉన్నారు. సైద్ధాంతిక వైరుధ్యంతో బిజెపి వైపుకు రారేమోనని భయంతో ‘నోటా’కు వేయమని ప్రబోధిస్తున్నారు ఆదిలో కొంతమంది నాయకులు. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకించి ఇలా కోరడం మంచి పద్ధతి కాదని విమర్శించే వారున్నారు.
POLLING DAY 19-04-2024



Raju's Resource Hub