Logo Raju's Resource Hub

బాల్యంలోనే బీజాలు వేయండి!

Google ad

చిన్నారులు బాగా చదువుకుని, జీవితంలో ఉన్నతంగా రాణించాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అయితే పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే బాల్యంలోనే బీజాలు పడాలి. దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. ఇలా చేస్తే మీ చిన్నారి బంగరు భవితకు దారి చూపినట్లే.

పిల్లలు బాగా చదువుకోవాలనే కోరికతో తల్లిదండ్రులు పెద్ద మొత్తంలో డొనేషన్లు కట్టి, వేలల్లో ఫీజులు చెల్లించి పెద్ద స్కూళ్లలో చేర్చుతారు. ఎంత ఎక్కువ ఫీజు వసూలు చేస్తే ఆ స్కూల్ అంత గొప్పదని భావించే పేరెంట్స్ కూడా లేకపోలేదు. అయితే కార్పొరేట్ పాఠశాలల్లో చేర్చినంత మాత్రాన చదువు బాగా వచ్చేస్తుందని అనుకోవడం పొరపాటే. అలాగే చిన్నారులు కొత్తవాళ్ల దగ్గర అంత సులువుగా దేనినీ నేర్చుకోలేరని తల్లిదండ్రులు గుర్తించడం ముఖ్యం. స్కూలు వాతావరణంలో ఇమడడానికి వాళ్లకు కొంత సమయం పడుతుంది. అందుకే బాల్యంలో పిల్లలతో ఓనమాలు దిద్దించే బాధ్యతను తల్లులే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాళ్లు సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో కొన్నాళ్లకు వాళ్లు స్కూల్‌లో టీచర్ వద్ద నేర్చుకోవడానికి అలవాటుపడతారు. పిల్లలకు చదువు చెప్పడం వల్ల తల్లీ-పిల్లల మధ్య అనుబంధమూ పెరుగుతుంది. అందుకే ఆది గురువు అమ్మే అన్నారు పెద్దలు.

మీరూ బాల్యంలోకి వెళ్లాల్సిందే!

చిన్నారులు బాగా చదువుకోవడానికి చిన్నప్పటి నుంచే చదివే అలవాటును వాళ్లలో పెంపొందించాలి. బాల్యంలో మీరు వేసే బీజాలే భవిష్యత్తులో వాళ్లు రాణించడానికి తోడ్పడతాయి. చదవడం అంటే ఏమిటో తెలియని చిన్నతనంలో వాళ్లతో చదివించాలంటే మీరు కూడా బాల్యంలోకి వెళ్లాల్సిందే. వాళ్లతో పాటు మీరూ చదివితేనే వాళ్లు చదవడానికి అలవాటు పడతారు. మీరు చదువుతూ వాళ్లను చదివించడం వల్ల వాళ్లలో ఉచ్చారణ ఎంతగానో మెరుగుపడుతుంది. క్లిష్టమైన పదాలను సైతం వాళ్లు స్పష్టంగా పలకడం సాధ్యమవుతుంది. రోజూ పిల్లలతో కలిసి చదివితే.. వాళ్లకు చదవడం ఒక అలవాటుగా మారిపోతుంది. రోజూ బ్రష్ చేసుకున్నట్టే ప్రతి రోజూ చదువుతూ ఉంటారు. పిల్లలను ఉత్సాహపరుస్తూ చదివించడం వల్ల వాళ్ల మెదడులోని న్యూరాన్స్ ఉత్తేజమవుతాయని నిపుణుల ఉవాచ. అనుకరిస్తూ గట్టిగా చదివించడం వల్ల పిల్లల మేథో సామర్థ్యం వికసించడమే కాకుండా వాళ్లు చదువులో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.

Google ad

ఇలా చేయండి…

* పిల్లలకు తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని ఎంచుకోండి. అది చూడముచ్చటైన రంగుల్లో ఉంటూ, వాళ్లలో బాగా ఆసక్తి కలిగించాలి.

* ఆ పుస్తకం పిల్లల వయసు, సామర్థ్యానికి సరిపోవాలి.

* చిన్నారి, మీరు ఇద్దరూ కలిసి చదవడానికి ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. మీరిద్దరూ కలిసి చదవడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకోండి. మీ ఏకాగ్రతకు ఏమాత్రం భంగం కలగకుండా చూసుకోండి.

* చిన్నారికి ఏమాత్రం అనాసక్తిగా ఉన్నా, విసుగ్గా అనిపించినా చదవడం ఆపేయండి. మళ్లీ కాసేపు ఆగి ప్రయత్నించండి. లేదంటే తర్వాత రోజుకు వాయిదా వేయండి.

* చదువుతున్నప్పుడు అందులో విషయం, సందర్భాన్ని బట్టి మీ గొంతు, హావ భావాల్లో తేడాలు చూపండి. కథనం, పాత్రలో పూర్తిగా మమేకమైపోండి. పాత్రను బట్టి గొంతు మార్చడం వల్ల పిల్లలకు వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పాత్రల స్వభావం సులువుగా అర్థమవుతుంది.

* పుస్తకంలోని బొమ్మలు చూపుతూ మధ్య మధ్యలో చిన్నచిన్న ప్రశ్నలు అడగండి. ఇలా చేయడం వల్ల వాళ్లు బాగా అనుకరిస్తారు. అలాగే తరచూ వచ్చే పదాలను వాళ్లతోనే చెప్పించడానికి ప్రయత్నించండి.

* పుస్తకం మొత్తం ఒకేసారి చదివేయకుండా కొన్ని పేజీలు చొప్పున ప్రతిరోజూ చదవండి.

* చదువుతున్న పుస్తకంపై పిల్లలు అంతగా ఆసక్తి చూపకపోతే బలవంతంగా దాన్ని పూర్తిచేయడానికి ప్రయత్నించద్దు. దాన్ని పక్కన పెట్టి వేరే పుస్తకంతో ప్రయత్నించండి.

* ఒకసారి చదివిన కథే మళ్లీమళ్లీ కావాలని పిల్లలు కొన్నిసార్లు అడుగుతుంటారు. ఇలాంటప్పుడు విసుక్కోవద్దు. తెలుసుకున్న దాన్నే మళ్లీ తెలుసుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపుతారు. ఆ కథను చెప్తూ, వేరే కథ/పుస్తకాన్ని పరిచయం చేయండి.

* అయితే మీరు ఎంచుకునే పుస్తకాలు హింసకు దూరంగా ఉండేలా చూడడం మరవద్దు. ఉన్నత వ్యక్తిత్వం, సానుకూల భావాలు, ఇతరుల అవసరాలు గుర్తించడం, స్నేహతత్వం, సాయపడే గుణం… మొదలైనవి అలవడేలా ఉన్న కథల పుస్తకాలను ఎంచుకోండి.

ప్రయోజనాలెన్నో!

* చిన్నారితో కలిసి చదవడం వల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది.

* వాళ్లలో వినడం, చదవడం, మాట్లాడడం, ఆలోచించగలగడం… మొదలైన నైపుణ్యాలు మెరుగవుతాయి.

* ఆలోచనా ధోరణి, సామాజిక నైపుణ్యాలు (సోషల్ స్కిల్స్) వికసిస్తాయి. వూహా శక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్కం..మొదలైనవి వృద్ధి చెందుతాయి.

* భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వేరే ప్రాంతాల్లో చదువుకోవడం, ఉద్యోగం చేయడం..లాంటివి తప్పకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు దిగులు చెందకుండా పుస్తకాలు చదువుకుంటూ సంతోషంగా ఉండడం సాధ్యమవుతుంది.

సో.. మరెందుకాలస్యం.. మీ చిన్నారితో ఇవాల్టి నుంచే కలిసి చదవండి. మీ మధ్య అనుబంధాన్ని మరింతగా పెంపొందించుకోండి. వాళ్లకు బాల్యం నుంచే చదువుపై ఆసక్తి పెరిగేలా చేయండి.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading