కోనసీమకు కొబ్బరి ఎలా వచ్చింది, ఎలా విస్తరించింది

అంబాజీపేటలో కొబ్బరి కాయల పనిలో కార్మికుడు

కోనసీమ అనగానే అందరికీ ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకువస్తాయి. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరచుకున్న కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది.

కోనసీమ వాసుల జీవితాలు కొబ్బరి సాగుతో బాగా ముడిపడిపోయాయి.

కోనసీమ నుంచి కొబ్బరి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. కానీ, రవాణా సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తగినంత అభివృద్ధి జరగలేదన్నది కోనసీమ వాసుల ఆవేదన.

కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరుతున్నారు. ఇటీవల కొబ్బరికి పెరుగుతున్న తెగుళ్లకు తగిన విరుగుడు సకాలంలో అందించే ఏర్పాట్లు చేయాలని ఆశిస్తున్నారు.

కోనసీమ

కొట్టుకువచ్చాయా?

కోనసీమకు, కొబ్బరి తోటలకు మూడు శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెబుతారు.

కోనసీమ భౌగోళికంగా ఓ ద్వీపంలా ఉంటుంది. మూడు వైపులా గోదావరి పాయలు ప్రవహిస్తుంటాయి. వశిష్ట, వైనతేయ, గౌతమీ పాయల ప్రవాహం కోనసీమను సస్యశ్యామలం చేసింది. మరోదిక్కున బంగాళాఖాతం ఉంది.

బంగాళాఖాతం తీరప్రాంతం కావడంతోనే కొబ్బరి సాగు మొదలైందని కొందరి అభిప్రాయం. ఇండోనేసియా, థాయిలాండ్ వంటి తూర్పు ఆసియా దేశాల నుంచి తుపాన్లు, ఇతర సందర్భాల్లో కొబ్బరి కాయలు కొట్టుకువచ్చి ఉంటాయని తమ పూర్వీకుల అంటుండేవారని కోనసీమ కొబ్బరి రైతుల సంఘం ప్రతినిధి అడ్డాల గోపాలకృష్ణ బీబీసీతో అన్నారు.

ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ, చాలా మంది దీనితో ఏకీభవిస్తున్నారు.

సముద్రం ద్వారా కొట్టుకువచ్చిన కొన్ని కొబ్బరికాయలు కోనసీమ ప్రాంతంలో మొలిచాయని, వాటి కాయలు తమకు ఉపయోపడటంతో రానురాను స్థానికులు కొబ్బరి సాగు చేశారన్న అంచనాలు ఉన్నాయి.

కోనసీమ చాలా తరాలుగా కొబ్బరి సాగులో తలమునకలై ఉంది.

స్థానికుల జీవితాల్లో ఇదో భాగమైపోయింది. కొబ్బరి ఆకులతో ఇళ్లు వేసుకుని ఉంటారు. కొబ్బరి పీచుని వివిధ రకాలుగా వాడుతారు. కొబ్బరి కాయల విక్రయంతో బతుకు సాగిస్తుంటారు.

‘కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్న’ అని కొందరు అంటుంటారంటే, అది వారికి ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. పది కొబ్బరి చెట్లు ఉంటే జీవనం సాఫీగా సాగిపోతుందని కూడా స్థానికులు భావిస్తుంటారు.

ప్రస్తుతం కోనసీమలో 54వేల హెక్టార్లలో కొబ్బరి పంట పండిస్తున్నట్టు అంబాజీపేట పరిశోధనా కేంద్రం రికార్డులు చెబుతున్నాయి.

దేశమంతా 21.40 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతుండగా అత్యధికం కేరళలో 8లక్షల హెక్టార్లు, తమిళనాడులో 5.17లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 4.65లక్షల హెక్టార్లలో కొబ్బరి పంట ఉంది, వాటి తర్వాత ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.30లక్షల హెక్టార్లకు కొబ్బరి సాగు విస్తరించింది.

ఇటీవల తీర ప్రాంతాలతో పాటుగా మెట్ట సహా అన్ని రకాల భూముల్లోనూ కొబ్బరి పంట వైపు రైతులు మొగ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

కొబ్బరి కార్మికులు
కొబ్బరి

1996లో పెద్ద దెబ్బ

కోనసీమ తీర ప్రాంతం కావడంతో తుపాన్ల తాకిడి ఎక్కువ. ఏటా ఓవైపు గోదావరి వరదలు, మరోవైపు తుపాన్లు కోనసీమవాసులను కలవరపెడుతూ ఉంటాయి.

ఈ ఏడాది గోదావరికి వచ్చిన పెద్ద వరదలతో కోనసీమ లంకలు, అనేక లోతట్టు గ్రామాల వాసులు నిరాశ్రయులయ్యారు. అన్నింటికీ మించి 1996 తుపాను కోనసీమ మీద పెద్ద ప్రభావం చూపింది.

ప్రధానంగా అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలు సముద్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఆయా మండలాల్లో తుపాను విరుచుకుపడింది.

వందల మంది ప్రాణాలు తీసిన పెనుతుపాను… కొబ్బరి సాగును కూడా తీవ్రంగా దెబ్బతీసింది. వేల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. మిగిలిన చెట్లు కూడా దిగుబడి లేక బోసిపోయాయి.

కోనసీమ కొబ్బరి మీద 1996 నవంబర్ 6 నాటి తుపాను ఎన్నడూ చూడని స్థాయిలో ప్రభావం చూపించిందని కోనసీమ వాసులు చెబుతున్నారు.

‘‘ఒక్క రాత్రిలో తుపాను బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు చేపట్టేందుకే పక్షం రోజులు పట్టింది. ఆ సమయంలో కొబ్బరి పంటకు అపార నష్టం జరిగింది. చాలా చెట్లు విరిగిపోయాయి. నిలబడినవి కూడా మళ్లీ యథాస్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత వివిధ తెగుళ్లు కొబ్బరిపంటను పీడిస్తున్నాయి. ఇరియోఫిడ్ మైట్ కారణంగా కాయ పరిమాణం క్షీణించింది. దానికి విరుగుడు కనుగొనడానికి సమయం పట్టడంతో కోనసీమ కొబ్బరి రైతులు నష్టపోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.

కోనసీమ కొబ్బరి రైతులకు మరింత సేవలు అందించేందుకు 1955లో కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని అంబాజీపేటలో ప్రారంభించారు.