ఔరంగజేబ్

భారతదేశపు చిట్టచివరి మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్. షాజహాన్ పుత్రులలో మూడవవాడు, ఢిల్లీలో జన్మించాడు. ఇతనికి మతాభిమానం ఎక్కువ. దురహంకారి. సింహాసనం కోసం సొంత సోదరులను హతమార్చిన క్రూరుడు. ఇతని పెద్ద అన్న దారాషుకో ఆధ్యాత్మికపరుడు, పరమత సహనం కలవాడు. రాజ్యం కోసం అన్న దారా, తమ్ముడు మురాద్, ఇంకో అన్నతో చేతులు కలిపి తండ్రిమీదనే దండయాత్ర చేసి తండ్రిని కారాగృహంలో బంధిస్తాడు.

దారాను, మురాద్ ను చంపిస్తాడు. ఇంకో అన్నను రాజ్యం నుండి తరిమివేసి 1658 సం.లో సింహాసం అధిష్టిస్తాడు. ఇతను సమర్ధుడైన పాలకుడే. కానీ హిందూమతం పట్ల విపరీత ద్వేషం కలవాడు. హిందువులను రకరకాలుగా హింసించేవాడు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీనగరంలోని విశ్వనాధ దేవాలయాన్ని పడగొట్టించి ఆ రాళ్లతోనే మసీదును కట్టిస్తాడు. రాజ్యమంతటా ఉన్న హిందూ దేవాలయాలను పడగొట్టించాడు.

హిందువులు జట్టు పెంచకూడదని శాసనం చేసి జట్టుపెంచిన వారిమీద జిజియాపన్ను విధించి వసూలు చేసేవారు. హిందువులు వాహనాలమీద తిరగరాదు. గుర్రపు స్వారీ చేయకూడదనే ఆంక్షలు విధించాడు. హిందువుల పాఠశాలలు, విద్యాలయాలను మూయించాడు. దీనితో అప్పటిదాకా మొగలాయిలతో సఖ్యతగా ఉన్న హిందువులు వారికి విరోధులుగా మారారు.

మేవాడ్ రాజు రాజా జస్వంత్ సింగ్ భార్యను, బిడ్డలను బంధించి వారిని బలాత్కారంగా మహ్మదీయులుగా మార్చటానికి ప్రయత్నించాడు. దీనితో రాజపుత్రులు రాణా రాజ్ సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసి కొండప్రాంతాలను విడిపించుకున్నారు. జౌరంగజేబ్ తన రాజ్యాన్ని ఆంధ్రప్రాంతంలోని గొల్కొండ, బీజాపూర్ వరకు విస్తరించుకున్నాడు. ఇతను ఎవరినీ నమ్మేవాడు కాడు.

మహారాష్ట్ర రాజైన ఛత్రపతి శివాజీని సంప్రదింపులకు ఢిల్లీకి రప్పించి మాయోపాయంతో కారాగృహంలో బంధించాడు. కానీ శివాజీ తన తెలివితేటలతో కారాగృహం నుండి తప్పించుకున్నాడు. ఆ తరువాత ఔరంగజేబ్ కు పక్కలో బల్లెంలాగ మారాడు. జౌరంగజేబ్ మరణంతో మొగలాయి సామ్రాజ్యం పతనమై, ఛిన్నాభిన్నమై అంతరించి పోయింది.

షాజహాన్

భారతదేశానికి ఐదవ మొగల్ చక్రవర్తి షాజహాన్. జహంగీరు కుమారుడు. షాజహాన్ అసలు పేరు ఖుర్రమ్. నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ కుమార్తె ఐన ముంతాజ్ మహల్ ను పెండ్లిచేసుకుంటాడు. ముప్పై సంవత్సరాల పాటు శాంతి భద్రతలను రక్షిస్తూ గొప్ప పరిపాలనా దక్షుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఇతని కాలంలోనే మొగల్ సామ్రాజ్యం పతాకస్థాయిలో విస్తరించింది.

శిస్తు వసూళ్లు పుష్కలంగా ఉండటంతో రాజ్యం ఐశ్వర్యవంతమైనది. ఇతను గొప్ప కళాపోషకుడు. సుందరమైన భవన నిర్మాణాలు, కళాసాహిత్య పోషణకు ఎక్కువగా ఖర్చుపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొంది నాదిర్షా చేత దోచుకోబడ్డ నెమలి సింహాసనం షాజహాన్ కాలంలోనే రూపొందించబడ్డది. ముస్లిం న్యాయ స్మృతిని అనుసరించి పండితుల అభిప్రాయాలను తీసుకుని తీర్పులిచ్చేవాడు. కానీ మతసహనం లేని మత దురహంకారి. సిక్కుమతస్థులను హింసించి చంపించాడు. మొగల్ సామ్రాజ్యాన్ని తన 31 సంవత్సారాల పాలనలో ఉన్నత స్థితికి తీసుకు వచ్చాడు.

తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడం తాజ్ మహల్ ను, ఆగ్రాలో యమునా నదీతీరంలో కట్టిస్తాడు. ఇతని నలుగురు కుమారులు. ఇద్దరు కుమార్తెలు. జహనారా పెద్ద కుమార్తె. రోషనారా రెండవ కుమార్తె. పెద్ద కుమారుడు దారాషుకో ఆద్యాత్మిక చింతన కలవాడు. మతసహనం కలిగినవాడు.
హిందూ వేదాంతం, పురాణాలను అధ్యయనం చేసాడు. ఇతని మిగతా పుత్రులు షుజా, మురాద్, ఔరంగజేబ్. వీరిలో ఔరంగజేబ్ పరమ దుర్మార్గుడు. తన తండ్రిమీద తిరుగుబాటు చేసి షుజాను అడవులలోకి తరిమివేసి, దారా షుకోను, మురాద్ ను చంపి, తండ్రిని కారాగారంలో బంధించి అధికారంలోకి వస్తాడు.

జహంగీర్

భారతదేశపు నాలుగవ మొగలాయి చక్రవర్తి జహంగీర్. ఇతను అక్బర్ కుమారుడు. 1605లో జహంగీర్ పరిపాలన ప్రారంభమయింది. జహంగీర్ కాలంలో పోర్చుగీసువారితో వర్తకవ్యాపారాలు అభివృద్ధి చెందాయి. దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. న్యాయపాలనకు, కళాపోషణకు, మతసహనానికి పేరుపొందాడు. జహంగీర్ భార్య నూర్జహాన్. ఇతని చిన్నప్పటి ప్రియురాలు. వీరి వివాహానికి అక్బర్ సమ్మతించకపోవటంతో, అక్బర్ మరణానంతరం ఈమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే నూర్జహాన్ కు వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది.

నూర్జహాన్ స్వతహాగా తెలివితేటలు కలది. తన బంధువర్గాన్ని రాజపరివారంలో చేర్చుకుని నెమ్మదిగా జహంగీర్ నుండి అధికారమంతా చేచిక్కించుకుంది. పేరుకు జహంగీర్ చక్రవర్తే గానీ, పెత్తనమంతా నూర్జహాన్ దే. కానీ సమర్థవంతంగా పరిపాలన సాగించింది. జహంగీర్ ను నెమ్మదిగా తాగుడుకు బానిసను చేసింది.

అక్బర్

అక్బర్ భారతదేశాన్ని పాలించిన మూడవ చక్రవర్తి. ఇతను మొగల్ రాజ్య స్థాపకుడైన బాబర్ మనుమడు, హుమయూన్ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్నతనంలోనే 1556 సం.లో తన 13వ ఏట సింహాసనం అధిష్టిస్తాడు. అప్పటికి రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉండేది. తన మంత్రి బైరాం ఘాన్ సహాయంతో అల్లర్లను అణచివేశాడు. అక్బర్ యువకుడై పూర్తిగా రాజ్యాధికారం చేపట్టేదాకా బైరాంఖాన్ దే పెత్తనమంతా.

అక్బర్ రెండవ పానిపట్ యుద్ధంలో హేమూని జయించాడు. 1576 సం.లో హల్దీఘాట్ వద్ద రాణా ప్రతాపసింహుణ్ణి జయిస్తాడు. 1586 లో కాశ్మీర్ ను, 1592 సం.లో ఒరిస్సాను జయించి కాశ్మీరు నుండి దక్షిణాపథం వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అక్బర్ హిందూమతం పట్ల ద్వేషభావం ప్రదర్శించకుండా హిందూ, ముస్లింల మధ్య సామరస్యాన్ని పెంచటానికి కృషిచేసాడు. రాజపుత్ర స్త్రీ అయిన జోధాబాయిను వివాహమాడాడు. జోథాబాయి తమ్ముడైన మాన్ సింగ్ ను తన సేనాధిపతిగా నియమించుకున్నాడు. ప్రఖ్యాతి గాంచిన హిందూ గాయకుడు తాన్ సేన్ ను తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. పరిపాలన దక్షుడైన తోడర్ మల్ కూడా అక్బర్ ఆస్ధానంలోని వాడే.

హిందువుల మీద వేసిన పన్నులను రద్దు చేసాడు. అన్నిమతాలు ఒకటే అని తాను స్వయంగా ‘దీన్-ఇలా-హీ’ అనే నూతన మతాన్ని స్థాపించాడు. కానీ ఈ మతం ప్రాచుర్యంలోనికి రాలేదు. 1571 సం.లో ఆగ్రా సమీపంలో ఫతేపూర్ సిక్కీ అనే పట్టణం నిర్మించి తన రాజధానిని అక్కడకు మార్చాడు. కానీ నీటి ఎద్దడి రావటం వలన తిరిగి ఢిల్లీకి తన రాజధాని మార్చాడు. మొగలాయి రాజులందరిలో కెల్లా మతసహనం కలవాడిగా పేరుపొందాడు. 49 సంవత్సరాల పాటు అక్బర్ చక్రవర్తి రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించి, చివరిదశలో తన కుమారుడైన జహంగీర్ కు రాజ్యం అప్పగించి 1605 సం.లో మరణించాడు.

హుమయూన్

భారతదేశానికి హుమయూన్ రెండవ మొగల్ చక్రవర్తి. ఇతని పరిపాలనా కాలం క్రీ.శకం 1530 నుండి 1556 వరకు. 1530 సం.లో తన 23వ ఏట మొగల్ సింహాసనాన్ని అధిష్టించాడు. సూర్ వంశీయుడైన షేర్షా చేతిలో ఓడిపొయి దేశం విడిచి పోయాడు. ఈ సమయంలో ఇతని భార్యకు అక్బర్ జన్మిస్తాడు. 1555 సంలో పర్షియా రాజు సాయంతో అప్పటి ఢిల్లీ పరిపాలకుడు షెర్షా వంశీయుడైన ఆదిల్ నూర్ ను, ఇతని మంత్రి హేమూను జయించి తిరిగి ఢిల్లీ పిఠం అధిష్టిస్తాడు. తరవాత కొద్దికాలానికే 1556 సం.లో మరణిస్తాడు. తరువాత ఇతని కుమారుడు అక్బర్ అధికారంలోకి వస్తాడు.

బాబర్

భారతదేశంలో మొగల్ సామ్రాజ్యానికి పునాది వేసినవాడు బాబర్. ఇతని తల్లివైపు వారు ప్రపంచంలోనే అత్యంత క్రూరుడుగా పేరుపొందిన చెంఘీజ్ ఖాన్ వంశానికి చెందినవారు. తండ్రి వైపువారు తైమూర్ వారసులకు చెందినవారు. బాబర్ చిన్నతనంలోనే సామర్కండ్ రాజై తన ప్రతిభతో తన సామ్రాజ్యాన్ని కాందహార్ వరకు వ్యాపింపచేశాడు.

అప్పటికి భారతదేశాన్ని ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. అప్పటి పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ ఇబ్రహింలోడీ మీద తిరుగుబాటు ప్రకటించి బాబర్ ను భారతదేశానికి ఆహ్వానిస్తాడు. బాబర్ తన సైన్యంతో భారతదేశంలోకి ప్రవేశించి పానిపట్ వద్ద ఇబ్రహిం లోడీతో తలపడతాడు. యుద్ధంలో ఇబ్రహింలోడిని జయించి భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపనకు పునాదివేస్తాడు.

1527 సం.లో రాజపుత్రులను యుద్ధంలో ఒడించి మొగల్ సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాడు. ఆఫ్ ఘన్ వజీర్లను 1529 సం.లో ఓడిస్తాడు. బెంగాల్ నవాబుతో సంధిచేసుకుని తన రాజ్యాన్ని బీహార్ వరకు విస్తరింప చేస్తాడు. బాబర్ సహజంగా కళాపోషకుడు. పండితులను, విద్యాంసులను, కళాకారులను తన ఆస్థానానినికి పిలిపించి సత్కరించేవాడు. ఇతని కాలంలోనే ఇతని చరిత్ర బాబర్ నామా వ్రాయబడ్డది. 1530 సం.లో ఆగ్రాలోని తన రాజప్రసాదంలో మరణించాడు. ఇతని తరువాత ఇతని కుమారుడు హుమయున్ రాజ్యాధికారం చేపట్టాడు.