Posted in చక్రవర్తులు...రాజులు

శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు

శ్రీ హర్షుడుని హర్షవర్ధనుడు అని కూడా అంటారు. మొట్టమొదట స్థానేశ్వర్యం రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తరువాత క్రీ.శ.606 వ సం.లో తన రాజధానిని కన్యాకుబ్జంలో ఏర్పాటు చేసుకున్నాడు.
ఉత్తర భారతంలో హిమాలయా పర్వత పాదాలనుండి దక్షిణాన నర్మదా నదివరకు, పశ్చిమాన వల్లభి నుండి తూర్పున గంజాం వరకుగల ప్రాంతాలను తన ఏలుబడిలోనికి తెచ్చుకొని పరిపాలించిన మహాచక్రవర్తి శ్రీహర్షుడు.
హర్షుని యంత్రాంగం పటిష్టమైనది. పరిపాలనలో ప్రధానోద్యోగి ‘మహాసంధి విగ్రహాధికారి’. ఇతర సిబ్బంది ఇతనికి సహాయం చేస్తారు. రాష్ట్రపాల రాజప్రతినిధుల ద్వారా జరిగేది. పండిన పంటలో ఆరవ వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. ప్రభుత్వ అధికారులకు వేతనాలకు బదులుగా ఫ్యూడలిజం పద్ధతిలో భూములిచ్చేవాడు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి ప్రయోగలో ‘మహా పరిషత్’ ఏర్పాటు చేసి విరివిగా దానాలు చేసేవాడు
హర్షుని కాలంలో నలందా విశ్వవిద్యాలయం ఉన్నతంగా వర్థిల్లింది. 10 వేలమంది విద్యార్థలు, 1500 వందల మంది అధ్యాపకులు ఉండేవారట. ఈ విద్యాలయానికి హర్షుడు 100 గ్రామాలను దానంగా ఇచ్చాడని తెలుస్తుంది. హర్షుడు ప్రధమంలో హిందూ మతాన్ని అనుసరించాడు. హర్షునికాలంలో వచ్చిన హుయాన్ స్వాంగ్ వలన ప్రభావితుడై బౌద్దమతాన్ని స్వీకరించాడు. కానీ హిందూమతాన్ని ద్వేషించలేదు. సామ్రాట్ అశోకుని వలె అనేక ప్రజాహిత కార్యాలను అమలుచేశాడు.
హుయాన్ స్వాంగ్ కన్యాకుబ్జం మరియు ప్రయోగ నందు బౌద్ద ఉత్సవాలు నిర్వహించగా హర్షుడు వాటి నిర్వహణలో సాయమందించాడు.
ఆరోజులలో నలందా విద్యాపీఠం ఉన్నత స్థితిలో ఉండేది. హర్షుడు గొప్ప చక్రవర్తియే కాకుండా సంస్కృత కవి కూడా. జీమూతవాహను కథను ‘నాగానందం’, అనే నాటకంగా రచించాడు. ‘ప్రియదర్శిక’ నాటికలను రచించాడు. ఇతని రచనలలో మూడో నాటకం ‘రత్నావళి’ ఉత్తమమైనదిగా పేరు పొందినది. హర్షచరిత్ర, కాదంబరి కావ్యాలను రచించిన ప్రఖ్యాత సంస్కృత కవి హర్షవర్ధనుని ఆస్థానంలోని వాడే. ఉత్తర భారతాన్ని విజయవంతంగా పరిపాలించిన చివరి హిందూ చక్రవర్తి హర్షవర్థనుడు
హుయాన్ స్వాంగ్ తన యాత్ర చరిత్రలో హర్షుని పాలన గూర్చి, కళాసాహిత్య పోషణ గూర్చి గొప్పగా వ్రాశాడు

Posted in చక్రవర్తులు...రాజులు

సముద్రగుప్తుడు

భారతదేశాన్ని పాలించిన గుప్తరాజ వంశీయులలో ప్రముఖ చక్రవర్తి సముద్రగుప్తుడు. క్రీ.శం.330 నుండి 375 వరకు ఈయన పరిపాలన సాగింది. తన తండ్రి ఒకటవ చంద్రగుప్తుని తరువాత క్రీ.శ.330 సం.లో పట్టాభిషక్తుడైనాడు.
పరాక్రమవంతుడు, వీరుడైన సముద్రగుప్తుడు ఉత్తరభారత దేశాన్ని జయించి దక్షిణిపథంవైపు తిరిగాడు. అప్పట్లో వేంగి దేశాన్ని హస్తివర్మ, కాంచీపురాన్ని విష్ణుగోపుడు పరిపాలించేవారు. వీరిని కూడా జయించాడు.
సముద్రగుప్తుడు అశ్వమేధయాగం చేశాడని దానికి గుర్తుగా బంగారు నాణాలను ముద్రించి వాటిపై రాజాధి రాజ, అప్రతిహత యోధానుయోధ అని తన బిరుదనామాలు చెక్కించాడని పండితుల ఉవాచ.
సముద్రగుప్తుడు కళాపోషకుడు. దానకళా విశారదుడని అలహాబాదు శిలాశాసనం ద్వారా తెలుస్తుంది.
సముద్రగుప్తుని కీర్తి ఆనాడే విదేశాలకు కూడా వ్యాపించింది. సముద్రగుప్తుని పట్టమహిషి దత్తాదేవి వలన రామగుప్తుడు, చంద్రగుప్తుడు అని ఇరువురు కుమారులు జన్మించారు. వీరిలో చంద్రగుప్తుడు భారతదేశ చక్రవర్తిగా పేరు పొందాడు.

Posted in చక్రవర్తులు...రాజులు

శ్రీకృష్ణ దేవరాయలు

1336 సంవత్సరంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో కాకతీయ ప్రతాపరుద్రుని సుబేదారు ఐన హరిహర రాయలుచే తుంగభద్రా నదీ తీరంలో స్థాపించబడ్డది విజయనగర సామ్రాజ్యం.
వీరిలో తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. ఇతని పరిపాలనా కాలం 1509 సం. నుండి 1530 సంవత్సరం వరకు. పరిపాలనా కాలం తక్కువైననూ కళలను, సాహిత్యాన్ని పోషించిన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప యుద్దవీరుడు కూడా. ఇతని తండ్రి తుళువ నరసనాయకుడు, తల్లి నాగలా దేవి. 17 జనవరి 1471 సంవత్సరంలో హంపిలో జన్మించాడు. ఇతని భార్య తిరుమలదేవి. ఇంకొక భార్య చిన్నాదేవి.
ఇతను స్వతాహగా కన్నడ ప్రాంతానికి చెందిన వాడు. కర్ణాటకలోని హంపీ విజయనగరం ఇతని రాజధాని. కానీ కృష్ణదేవరాయల కాలంలో ఆంధ్రదేశం అష్టైశ్వరాలతో తులతూగింది.
అష్టదిగ్గజాలుగా పేరుపొందిన అల్లసాని పెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభధ్రుడు, పింగళి సూరన, మాదయగారి మల్లన్న, ధూర్జటి, భట్టుమూర్తి, తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలోని వారే. వీరిలో తెనాలి రామకృష్ణ కవి స్వస్థలం నేటి గుంటూరు జిల్లాలోని తెనాలి. దూర్జటి కవి స్వస్థలం పవిత్రక్షేత్రమైన శ్రీకాళహస్తి. మాదయగారి మల్లన కృష్ణాజిల్లాకు చెందిన అయ్యంకి పురానికి చెందినవాడుగా చెబుతారు.
శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఎన్నోదేవాలయాలు నిర్మించబడ్డాయు. వీటిలో ప్రముఖమైనది విరుపాక్షదేవాలయం. ఇతను తిరుమల శ్రీవేంకటేశ్వరుని భక్తుడు. షుమారు ఆరుసార్లు శ్రీవేంకటేశ్వరుని దర్శించుకొని అనేక అభరణాలను స్వామికి సమర్పించాడు. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులతో ఉన్న విగ్రహాలను చూడవచ్చు.
శ్రీకృష్ణదేవరాయలు జన్మతః కన్నడిగుడు ఐనా తెలుగుభాషను ఆదరించి ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అంటూ తెలుగును అభిమానించినవాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి జాంబవతీ కళ్యాణం, మదాలసా చరితం ఇంకా అనేక కావ్యాలు వ్రాసాడు.
అనేక మంది కవులను పోషించాడు. ‘‘అమూక్తమాల్యద’’ అనే గొప్ప తెలుగు కావ్యానికి శ్రీకారం చుట్టింది కూడా నేటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలోని ఘంఠసాల మండలం శ్రీకాకుళం అనే గ్రామంలో ఉన్న శ్రీకాకుళేంద్ర మహావిష్ణు అనే దేవాలయంలోనే. ఈ గుడిలో శ్రీకృష్ణదేవరాయల జ్ఞాపకర్ధం ఇతని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీకృష్ణ దేవరాయల జీవితంలో ఎక్కుభాగం యుద్ధాలలో గడిచిపోయింది. బహమనీ సుల్తానులు, మహ్మదీయుల దండయాత్రలను నిలువరించాడు. నేటి ఆంధ్రప్రదేశ్ లోని కొండవీటి కోట, కొండపల్లి కోటలను జయించాడు.
అత్యంత సమర్ధుడు, రాజనీతిజ్ఞుడు ఐన మహామంత్రి తిమ్మరుసు సారధ్యంలో శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యాన్ని దక్షిణ భారతమే కాకుండా ఉత్తరాన మహానది వరకు వ్యాపింపచేశాడు. ఈయన పరిపాలన గురించి మ్యానిజ్, ప్వాజ్ వంటి పోర్చుగీస్ యాత్రికులు తమ రచనలలో ప్రశంచించారు.
శ్రీకృష్ణ దేవరాయలకు తిరుమల రాయలు ఒక్కడే కుమారుడు. చిన్నతనంలో కుమారుడుకి పట్టాభిషేకం చేసి తాను రాజప్రతినిధిగా పరిపాలన సాగించాడు. కానీ దురదృష్టవశాత్తూ శత్రువుల కుట్రవలన తిరుమల రాయలు మరణించాడు. తరువాత జరిగిన చరిత్రకు సంభంధించి అనేక విభిన్నాభిప్రాయాలున్నాయి. తిమ్మరుసును అనుమానించాడాని, కొడుకు మరణంతో దిగులుతో చనిపోయాడని చెబుతారు. కానీ స్పష్టమైన ఆధారాలు లేవు.

Posted in చక్రవర్తులు...రాజులు

రంజిత్ సింగ్

పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్. సిక్కురాజ్య కూటమిలో సుకార్ చకియా శాఖకు నాయకుడు. తన ప్రతిభతో ఆఫ్గన్ రాజు జమాన్షాను ఓడించి 1799 సం.లో లాహోర్ ను తన రాజ్యంలో కలుపుకున్నాడు.
1822 సం.లో అమృత్ సర్ ను జయించి రెండు సిక్కు రాజధానులను తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు.
ఇతని రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ వరకూ, పశ్చిమాన ముల్తాన్ వరకు, వాయువ్యంలో పెషావర్ వరకు విస్తరించింది.
తన సైనికులకు విదేశీ నిపుణలచే శిక్షణ ఇప్పంచి బలపరచుకున్నాడు
పంజాబీ భాషను పోషించుటయే గాక పంజాబీ బైబిల్, అక్బర్ నామా వంటి అనువాదాలు వెలుగులోకి తెచ్చాడు.

Posted in చక్రవర్తులు...రాజులు

రాజరాజ చోళుడు

చోళ రాజవంశ చక్రవర్తులలో ప్రముఖుడు రాజరాజ చోళుడు. క్రీ.శ. 985 సం.లో తంజావూరు (నేటి తమిళనాడులోని) రాజధానిగా చోళ సింహాసనాన్ని అధిష్టించి 1018 సం. దాకా పరిపాలించాడు.
చేర, పాండ్య, తూర్పు చాళుక్య (వేంగి), ఓఢ్ర దేశాలను జయించి బెంగాల్ నుండి సింహళం వరకు తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు.
రాజరాజ చోళుడు దేశ భాషలను ఆదరించి, స్థానికసంస్కృతులను ఆదరించి, దేవాలయ వాస్తు శిల్ప కళను పోషించి పేరుపొందాడు.
తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇతని కాలంలో నిర్మించినదే. రాజరాజ చోళుని పరిపాలనలో దేశం సుభిక్షమై ప్రజలు సుఖజీవనం గడిపినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది.

Posted in చక్రవర్తులు...రాజులు

రెండవ ప్రతాప రుద్రుడు

కాకతీయ రాణి రుద్రమ దేవి మనుమడు. రుద్రమదేవికి పుత్ర సంతానం లేకపోవటంతో పెద్ద కుమార్తె ముమ్మడమ్మ పుత్రుడైన ప్రతాప రుద్రుని దత్తపుత్రునిగా స్వీకరించింది. ఇతని తండ్రి మహాదేవరాయలు.
రుద్రమదేవి మరణానంతరం 1295 లో సింహాసనం అధిష్టించాడు. అప్పటికి ఇతని వయస్సు 35 సంవత్సరాలు.
పరిపాలనా విధానాన్ని కట్టుదిట్టం చేసి 77 గురు నాయకులు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల పరిపాలనా బాధ్యతలను వారికి అప్పగించాడు.
ప్రతారుద్రుని సైన్యం చాలా శక్తివంతమైనది. ఢిల్లీ నుండి అల్లావుద్దీన్ ఖల్జీ ఏడు సార్లు దండెత్తినా ఏడుసార్లు కూడా వారిని వెనకకు తరిమివేశారు. కానీ ఎనిమిదవ సారి ఓడిపోయి సంధి చేసుకున్నాడని తెలుస్తుంది.
1323 సం.లో ఘియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడైన ఉలమ్ ఖాన్ ఓరుగల్లు మీద దండెత్తి కోటను స్వాధీనం చేసుకున్నాడు ప్రతారుద్రుణ్ణి బందీగా ఢిల్లీ పంపించాడు. కానీ ప్రతాపరుద్రుడు దారిలోనే మరణించాడు.
ప్రతాప రుద్రుడు గొప్ప సాహిత్యపోషకుడు. సంస్కృతం, తెలుగు రెండు భాషలను ఆదరించాడు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో సంస్కృత కవులలో సాకల్య మల్లభట్టు ‘‘ఉదాత్త రాఘవం’’ ‘నిరోష్ఠ్య రామాయణం’ అనే రెండు కావ్వాలను వ్రాశాడు.
1320 సం.లో ‘జైనేంద్ర కళ్యాణాభ్యుదయం’ అనే సంస్కృత కావ్యాన్ని రచించిన జైన కవి అప్పారాయుడు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడే.
తెలుగులో ‘క్రీడాభిరామం’ అనే వీధి కాటకానికి మూలం ఐన సంస్కృత ‘ప్రేమాభిరామం’ రచించిన రావిపాటి త్రిపురాంతకుడు ప్రతాపరుద్రుని సమకాలికుడని చరిత్రకారుల అభిప్రాయం.
అలంకార శాస్త్రంలో ప్రామాణిక గ్రంధంగా చెప్పబడుతున్న ‘ప్రతాపరుద్ యశోభూషణం’ రచించిన విద్యానాధుడు కూడా ప్రతాపరుద్రుని ఆస్థానపండితుడు.
పాల్కురుకి సోమనాధుడు రచించిన ‘అనుభవ సారం’, ‘చతుర్వేదసారం’, ‘సోమనాధ భాష్యం’, ‘రుద్రభాష్యం’ గ్రంథాలు ఈ కాలంలోనే వెలువడ్డాయి. ప్రతాప రుద్రుడు కూడా ‘నీతిసారము’ అనే రాజనీతి శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ఇతనికి ‘‘విద్యాభూషణ’’ అనే బిరుదు కలదు.

Posted in చక్రవర్తులు...రాజులు

పృధ్వీరాజ్

ఢిల్లీని కేంద్రంగా పాలించిన చివరి హిందూ రాజు. పృధ్వీరాజు చౌహాన్ వంశీయుడు. క్రీ.శ. 1179 సం.లో సింహాసనం అధిష్టించాడు. అప్పట్లో కనౌజ్ ను పరిపాలిస్తున్న జయచంద్రుని కుమార్తె రాణీ సంయుక్తను అపహరించి వివాహమాడాడు.
ఘోరీ మహ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు స్థానేశ్వరానికి సమీపంలో ఉన్న తరాయి అనే ప్రాంతం వద్ద రాజపుత్ర యోధుల సాయంతో ఘోరీ మహ్మద్ సేనలను ఒడించాడు.
కానీ తరువాత సంవత్సరం ఘోరీ మహ్మద్ దాదాపు 1,20,000 సైన్యంతో దండెత్తి వచ్చినపుడు ఓడిపోయి బందీగా చిక్కాడని తెలుస్తుంది.
తరువాత ఘోరీ ఫృధ్వీరాజ్ కళ్లను పొడిపించాడాని కానీ ఫృధ్వీరాజ్ తన మిత్రుడైన చంద్రవర్దాయ్ అనే కవి సాయంతో తనకు వచ్చిన శబ్ధభేది విద్య ద్వారా ఘోరీని బాణప్రయోగంతో చంపాడని, తరువాత చంద్రవర్ధాయ్, ఫృధ్వీరాజ్ ఒకరినొకరు పొడుచుకుని చనిపోయారని కొందరి అభిప్రాయం.

Posted in చక్రవర్తులు...రాజులు

Raja Purushotham, Porus, Puru….. పురుషోత్తముడు

పురుషోత్తముడు…. దేశభక్తుడు, పరాక్రమశాలి. క్రీస్తు పూర్వం 256-323 మధ్యకాలంలో గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజైన అలగ్జాండర్ ప్రపంచాన్నంతటిని జయించాలని దండయాత్రలు చేస్తూ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత జీలం నది ఒడ్డున అలగ్జాండర్ సేనలతో యుద్ధం చేసాడు. కానీ ఓడిపోవటం జరిగింది. ఐతే అలగ్జాండర్ పురుషోత్తముని పరాక్రమాన్ని మెచ్చుకుని ఇతని రాజ్యం ఇతనికి ఇచ్చాడు.
ఇతని రాజ్యం పంజాబ్ లోని జీలం – చీనాబ్ నదుల మధ్య ప్రాంతమని గ్రీకు రచనల బట్టి తెలుస్తుంది
పురుషోత్తమునికే పూరువు, పోరస్ అని పేర్లు కూడా ఉన్నాయి.

Posted in చక్రవర్తులు...రాజులు

గణపతి దేవుడు

గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తి. 1999 నుండి 1262 వరకు ఒరుగల్లు (నేటి వరంగల్) ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
ఇతను గొప్ప వీరుడు కూడా. వెలనాటి పృధ్వీశ్వరునని, నెల్లూరు పాలకుడు తమ్ముసిద్దిని, తూర్పు గాంగ రాజైన అనియంక భీముణ్ణి, కంచి పాలకుడు రాజేంద్రచోళున్ని జయించాడు. దాదాపు తెలుగు ప్రాంతాలన్నిటిని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు.
ఒకటవ ప్రతాప రుద్రుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను పూర్తిచేశాడు. గణపతి దేవుని భార్య సోమలా దేవి. ఇతనికు కుమారులు లేరు. తన చిన్నకూతురు రుద్రాంబకు యుద్ధ విద్యలలోనూ, రాజకీయ వ్యవహారాలలో శిక్షణ ఇచ్చి తన తరువాత రాజ్యాధికారం అప్పగించాడు.
గణపతి దేవుడు గొప్ప కవిపండిత పోషకుడు. ఈయన ఆస్థానంలో అనేక మంది విద్యాంసులు ఉండేవారు. ఈయన సేనాని జాయప గొప్ప కళావేత్త. గీత రత్నావళి, వాద్య రత్నావళి, నృత్యరత్నావళి అనే సుప్రసిద్ధ గ్రంధాల రచయిత.
గణపతిదేవుడు పాలంపేట, ఘనాపురం, పిల్లలమర్రి ఇంకా అనేక చోట్ల దేవాలయాలు కట్టించాడు. రామప్ప చెరువు, పాకాల చెరువు ఇతని కాలంలోని త్రవ్వించబడ్డాయి.

Posted in చక్రవర్తులు...రాజులు

గౌతమీపుత్ర శాతకర్ణి

ఆంధ్రదేశాన్ని పరిపాలించి శాతవాహన రాజులలో పేరుగాంచినవాడు శాతవాహన రాజులలో 28వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి తల్లికి గౌరవస్థానం ఇచ్చి తల్లి పేరైన గౌతమిని తన పేరు ముందు చేర్చుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందినవాడు.
భారతదేశానికి వాయువ్య దిశనుండి వచ్చిన మధ్య ఆసియా తెగవారైన కుషాణులను, శక, పహ్లవులను, యవనులను జయించి తెలుగు రాజ్యాన్ని సుస్థిరం చేశాడు.
ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ శాతకర్ణిని ‘శాతవాహన కీర్తి వైభవ పునరుద్ధారకుడు’ క్షత్రీయ గర్వాపహారకుడు, అసమాన బ్రాహ్మణుడు అని నాసిక్ శాసనాల మీద చెక్కించింది. ఇతను తన రాజ్యంలో వ్యవసాయ అభివృద్ధికి కృషిచేసాడు. ప్రజలకు మంచి పరిపాలన అందించి గొప్ప పరిపాలనాదక్షుడు గా పేరు తెచ్చుకున్నాడు. బీదవారి మీద, అణగారిన ప్రజల మీద పన్నులను మినహాయించాడు.
శాతకర్ణి రాజ్యం తూర్పు, పడపర సముద్రాల వరకు వ్యాపించి ఉన్నట్లు చారిత్రిక ఆధారాల వలన తెలుస్తుంది. 24 సంవత్సరాలపాటు రాజ్యాన్ని పరిపాలించి క్రీ.శ. 86లో పరమపదించాడు.