“ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” – సామెత

ఒకరికి జరిగిన మేలు ఇంకొకరికి కీడుగా పరిణమించింది అనటానికి ఈ సామెత పుట్టింది.

రెంటికీ చెడ్డ రేవడు – సామెత

రేవడు అంటే చాకలి లేదా రజకుడు. నది ఒడ్డున బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఉతికిన బట్టలు ఎగువన తెరపగా ఉన్న చోట ఆరేసి మిగిలిన బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఇంతలో దూరంగా నదకి ఉధృతంగా నీరు రావడం చూసి, గబగబా ఆరవేసిన గుడ్డలు తీయడానికి పరుగెత్తాడు. అతడు ఆరవేసిన బట్టలు సేకరించే లోపలే ఆ ధౌతవస్త్రాలు వరదనీటిలో కొట్టుకొని పోతున్నాయి. దిగువన ఉతకవలసిన బట్టలనైనా కాపాడుకొందామని కిందకు పరుగులు తీశాడు. అతనికంటే ముందే వరద ప్రవాహంలో అవీ కొట్టుకొని పోయాయి. దురదృష్టవంతుడు రెంటికీ చెడిన రేవడు(డి)అయ్యాడు. ఈ ఘటనే సామెత అయింది.

గొంతెమ్మ కోరికలు

పాండు రాజు మొదటి భార్య అయిన కుంతీ దేవి యొక్క వికృతి నామం గుంతి, గొంతీ. ఆ “గొంతీ” కి గౌరవ వాచకం గొంతి+అమ్మ = గొంతెమ్మ .

కురుక్షేత్ర యుద్ధం సమయంలో , కర్ణుడితో ఆమె మాట్లాడే సమయాన ఆమె “కర్ణుడూ బ్రతకాలి, అర్జునుడూ బ్రతకాలి” అని కోరుకున్నది, కానీ అది అసంభవము, అయితే ఇద్దరిలో ఒకరే ఉండగలరు తప్ప ఇద్దరు ఉండాలి అంటే అది సాధ్య పడని పని అని కర్ణుడు చెపుతాడు. కాబట్టి సాధ్యపడని కోరికలను గొంతెమ్మ కోర్కెలు అని అంటారు

అవ్వా కావాలి , బువ్వా కావాలి ” అన్న జాతీయం కూడా ఈ కోవకు చెందినదే.

సింగి నాదం -జీలకర్ర

ఇది ఒక తెలుగు సామెత.

ఎప్పుడో చదివిన కథ.

బ్రిటిషు వారు వర్తకమునకు మన దేశమున అనుమతి పొంది, మెల్ల మెల్లగా మన రాజుల అంతఃకలహాలను ఆసరా చేసుకొని వారి సూత్రం ఉందికదా “విభజించి పాలించు” దానితో వారు తగువులు పెంచి వారిని ఆశ్రయించేటట్టుగా తయారు చేసారు.

దొరలు నెమ్మదిగా తమ సిపాయలను రాజుల కు ఇచ్చి, వారి రాజ భటులను తొలగించే పన్నాగం పన్నారు. దానితో రాజ భటులకు ఉపాధి లేక దొంగ తనాలు మొదలుబెట్టి ఊళ్లను దోచుకోవడం సాగించారు.

వీరిని పిండారీలు అని పిలిచేవారు. వీరు పద్దితితో దోచుకోవడానికి వచ్చేటప్పుడు ఒక కొమ్ము బూర ఊదేవారు. (శృంగ నాదం ). ఈ నాదాన్ని విని ఊరి జనం పారిపోయేవాళ్లు. యధేచ్చగా దోపిడి కి అవకాశం కల్పించుకొనేవారు.

ఇది ఇలా ఉండగా, విదేశీ వర్తకులు తమ నావలు ఓడలలో జీలకర్ర లాంటి దినుసులు వేసుకొని అమ్మకం సాగించేవారు వారుకూడా తమ రాకను తెలియచేస్తూ కొమ్ము బూర ఊదేవారు.

కొమ్ము బూర-వాడుకలో సింగి నాదం అని పిలిచేవారు. ఈ జీలకర్ర వ్యాపారుల నాదం పిండారీ దొంగలదని జనం భయపడి పారిపోతూంటే, కొంతమంది పెద్దవాళ్ళు అది వర్తకుల దని, నచ్చచెప్పి వాటిని కొనుగోలుకు వెళ్లేవారు.

అలా వచ్చింది సింగి నాదం -జీలకర్ర. అంటే ఆ సింగినాదం జీలకర్ర వారిది. దొంగల నాదం కాదు అని.

అందుకనే తేలికగా తీసివేసే ఒక భయాన్ని సింగి నాదం -జీలకర్ర లే. ఒక తెలుగు సామెత గా మారింది.

విశ్వనాధ సత్యనారాయణ

ఆధునిక యుగంలో మొదటి తెలుగు మహాకవి, జ్ఙానపీఠ్ అవార్డు అందుకున్న మహాకవి. కవిసామ్రాట్, పద్మభూషణ, కళాప్రపూర్ణ, డాక్టర్ బిరుదులతో సత్కరింపబడిన వాడు. 1966 నుండి 1976 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి. కవిగా, కథకుడుగా, నవలా రచయితగా, నాటక కర్తగా, సాహిత్య విమర్శకుడుగా, మహావక్తగా, కావ్యగాయకుడుగా సుమారు 60 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలను అలరించారు.

కృష్ణాజిలా నందమూరు గ్రామంలో శోభనాద్రి, పార్వతమ్మ దంపతులకు 1895 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. విశ్వనాథ గారు రచించిన వాటిలో వేయి పడగలు నవలకు ఆంధ్ర విశ్వకళాపరిషత్ నిర్వహించిన పోటీలో బహుమతి రాగా, శ్రీమద్రామాయణ కల్పవృక్షమునకు 1970 సంవత్సరంలో జ్ఙానపీఠ అవార్డు వచ్చింది. స్వర్గానికి నిచ్చెనలు, చెలియలికట్ట, ఆంధ్రప్రశస్తి, కోకిలమ్మ పెళ్లి, కిన్నెరసాని పాటలు, ఏకవీర గిరికుమారుని ప్రేమగీతాలు, భ్రమరగీతాలు, మధ్యాక్కరలు విశ్వనాథగారి రచనలతో ప్రధానమైనవి.

వరలక్ష్మీ త్రిశతి ఆయన వ్రాసిన విలాపకావ్యం. చారిత్రకములు, సామాజికముల పౌరాణికాలు కలిపి దాదాపు 66 నవలలను, 20 వేల పైగా పద్యాలను వివిధ పత్రికలలో వందలకొద్దీ ఖండ కావ్యాలను రచించారు.

సంస్కృత భాషలో ‘అమృత శర్మిష్టమ్’, గుప్త పాశుపతమ్’ వంటి నాటకాలను రచించారు. 1936 సం.నుండి 1959 సం. వరకు విజయవాడ ప్రభుత్వ కళాశాలలో ఆంధ్రశాఖాధిపతిగా పనిచేశారు. తరువాత కరీంనగర్ కలాశాల ప్రిన్స్ పాల్ గా పనిచేసి 1963 సంలో పదవీ విరమణ చేశారు. 1976 అక్టోబర్ 18వ తేదీన గుండె జబ్బుతో కీర్తిశేషులైనారు.

సింగిరెడ్డి నారాయణ రెడ్డి (సి.నా.రే)

జ్ఙానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి, సినిమా గేయ రచయిత నారాయణ రెడ్డి. ఈయన 1931 నవంబర్ 15వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఉస్యానియా యూనివర్శిటీలో విద్యాభ్యాసం సాగించి ‘‘ఆధునికాంధ్ర కవితత్త్వం పై పరిశోధనలు జరిపి ధీసిస్ వ్రాసినందువలన డాక్టరేట్ బిరుదు లభించినది.

1954సం .లోఈయన రచించిన నవ్వని పువ్వు 1954లో అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, నాగార్జునా సాగరము, రామప్ప వంటి సంగీత రూపకాలు, దివ్వెల మువ్వలు, విశ్వనాధుడు వంటి పద్యకావ్యాలు సాహిత్య విమర్శల ప్రశంసలు అందుకున్నాయి.br/> చలనచిత్ర రంగానికి 3,000 పైగా పాటలు వ్రాసి సుప్రసిద్ద గేయరచయితగా పేరుపొందారు.

ఈయన కృతి విశ్వంభర (1981) మహాకావ్యంగా ఎంపిక కాబడి జ్ఙానపీఠ పురస్కారం లభించింది.
ఉస్మానియా యూనివర్శిటీలో 1982 వరకు తెలుగు పీఠాధ్యక్షులుగానూ, 1982 నుండి 89 వరకు అధికార భాషా సంఘ అధ్యక్షులుగానూ ఉన్నారు. 1986 నుండి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. 1989 నుండి తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులుగా నియమింప బడ్డారు.

సీ.నా.రే ప్రతిష్టాత్మకమైన సోవియెట్ ల్యాండ్ – నెహ్రూ అవార్డు, అసాన్ అవార్డు వంటివి చాలా అవార్డులు వచ్చాయి. ఈయన స్వగ్రామం హనుమాజీ పేటను 1990 సం.లో ఈయన గౌరవార్ధం గ్రామస్తులు ‘నారాయణరెడ్డి పేట’ గా మార్చుకున్నారు.

రాయ్రపోలు సుబ్బారావు

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’’
అనే సుప్రసిద్ధ గేయాన్ని వ్రాసిన రాయ్రపోలు సుబ్బారావు 1914 సం.లో శాంతినికేతనంలో రవీంద్రనాథ్ టాగోర్ అంతేవాసిగా చదువుకున్నాడు. భావకవిత్వం ప్రారంభించి అశువుగా చెప్పసాగాడు. భజగోవిందం శ్లోకాలను, సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోనికి అనువదించాడు.
ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు నుండి మధుకలశంగా తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన చేతిలో గోల్డ్ స్మిత్ రచన హెర్మిట్ ను లలిత గానూ టెనిసన్ రచన డోరాను అనుమతి గానూ తెలుగు కావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. తృణకంకణం ఈయన రచయించిన సొంత పద్యకావ్యం. ఇది అమలిన శృంగారం స్థాయినందుకున్నదని పండితుల అభిప్రాయం. జడకుచ్చులు, ఆంధ్రావళి, వనమాల ఇతని ఇతర ఖంఢ కావ్యాలు.

మిశ్రమంజరికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శ్రీలు పొంగి జీవగడ్డ అమరావతి పట్టణమున బౌద్దులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు అనే ఆంధ్ర ప్రశస్తిని కొనియాడుతూ వ్రాసిన ప్రసిద్ధ గేయ రచనలు. సుబ్బారావు గారి కావ్యశైలిలో రమణీయత ఉట్టిపడుతుందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం.

రాయప్రోలు సుబ్బారావు గారు 1954 సం. జూన్ 30వ తేదీన సికింద్రాబాద్ లో పరమపదించారు.

తెలుగు సామెతలు

ఆడి తప్పరాదు, పలికి బొంక రాదు
అడవి కాచిన వెన్నల
మొరిగే కుక్క కరవదు
ఆడలేక మద్దెల ఒడినట్టు
యధారాజ తథా ప్రజ
ఇచే వాడ్ని చూస్తే, చచ్చేవాడైనా లేచు
ఇదుగో పులి అంటే, అదుగో తోక అన్నట్టు
ఇల్లలక గానే పండుగ కాదు
ఇంట గెలిచి, రచ్చ గెలవాలి
ఉన్న మాటంటే ఉలికి పడ్డట్టు
ఎలుకకు పిల్లి సాక్షి
ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు
ఏ పుట్టలో ఏ పామున్నదో
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఓడలు బండ్లు, బండ్లు ఓడలగును
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ
బూడిదలో పోసిన పన్నీరు
కథకు కాళ్లు లేవు, ముంతకు చెవులు లేవు
కాకిపిల్ల కాకికి ముద్దు
కీడెంచి మేచెంచవలె
కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టు
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరపినట్టు
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు
కొండనాలుకకు మందు వేస్తే ఉండనాలిక ఊడినట్లు
కొత్త బిచ్చగాడు పొద్దెరగడు
కోటి విద్యలు కూటికొరకే
ఐకమత్యమే మహాబలము
గుడ్డెద్దు చేలో పడ్డట్టు
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు
చల్లకు వచ్చి ముంత దాచినట్టు
చింత చచ్చినా పులుపు చావదు
మునగ చెట్టు ఎక్కించడం
చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలి
మొక్కై వంగనిది మానై వంగునా
చెట్టు ముందా, విత్తు ముందా
చెరపుకురా చెడెదవు
నిలబడి దంచినా, ఎగిరి దంచినా ఒకే కూలి
తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు
తింటేగానీ రుచి తెలియదు, దిగితే కానీ లోతు తెలియలదు
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు
తులసివనంలో గంజాయి మొక్క
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
దీపముండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి.
దున్నపోతు మీద వాన కురిసినట్టు
దూరపు కొండలు నునుపు
దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టు
నిండుకుండ తొణకదు
నిద్రపోయ్యే వాడిని లేపవచ్చ, మేలుకొన్న వాడిని లేపలేము
నివురు కప్పిన నిప్పు
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది
పనిలేని మంగలి పిల్లితల గొరిగినట్టు
పరుగెత్తి పాలుతాగే కంటే, నిలబడి నీల్లు తాగడం మేలు
ముందు నుయ్యి, వెనుక గొయ్యి
పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టు
పువ్వు పూయగానే పరిమళించి నట్టు
పేరు గొప్ప ఊరు దిబ్బ
అంతిమ నిష్టూరం కన్నా ఆదినిష్టూరం మేలు
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగె నూనె
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు
మొండివాడు రాజు కన్నా బలవంతుడు
రోలు వెళ్లి మద్దెలతో చెప్పుకున్నట్టు
అనువుకాని చోట అధికులమన రాదు
కొండ అద్దమందు కొంచమై ఉండును
కంటికి రెప్ప, కాలికి చెప్పు
కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు
చెరువు నిండితే కప్పలు పదివేలు చేరు
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైనట్టు
మంత్రాలకు చింతకాయలు రాలవు
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి
ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత
మెరిసేదంతా బంగారం కాదు
కలసి ఉంటే కలదు సుఖం
అంగట్లో అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
అగ్నికి వాయివు తోడైనట్లు
కృషితో నాస్తి దుర్భిక్షం
అరటిపండు వలచి నోట్లో పెట్టినట్లు
ఆవు చేలో మేస్తే, దూడ గట్టుమీద మేయునా
పిట్ట కొంచె కూత ఘనం
అడిగే వాడికి చెప్పేవాడు లోకువ

సింగి నాదం -జీలకర్ర

మొల్ల

అతుకూరి మొల్ల (1440-1530) కవయుత్రి. తెలుగులో మొల్ల రామాయణముగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును వ్రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించినది. మొల్ల శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదని ప్రసిద్ధి. కడపజిల్లా గోపవరం ప్రాంతానికి చెందినదని అంటారు. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఇక్కడ ఉన్నది. గ్రామస్తులు ఈ బండకు పూజలు కూడా చేస్తారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకుంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరు గ్రామానికి చెందివుందటారని అంటారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు కూడా ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని పెద్దన కవి కూడా గోపవరం వచ్చినట్లు కొందరి వృద్ధుల కథనం.

మొల్ల స్వతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్నతనంలోనే తల్లిని కోల్పోగా తండ్రి కేశవ ఈమెను గారాబంగా పెంచాడని తెలుస్తుంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం. చివరిదాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము వలన మొల్ల పెళ్ళిచేసుకోలేదని అంటారు.

మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో ఉన్నది. ఈ కావ్యమును మొల్ల కేవలం ఐదు రోజులలో వ్రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక భాషకు దగ్గరలో ఉంది.

అన్నమయ్య

అన్నమయ్య లేక తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదట వాగ్గేయకారుడు. వాగ్గేకారుడుకి అర్థం సాధారణ భాషలో గేయాలను కూర్చేవాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు.

అన్నమయ్య జివితకాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసుకొని ఉంటాయి. అన్యమయ్య సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందంకం అంశతో జన్మించాడని శ్రీవైష్ణవ సాంప్రదాయంలో నమ్మకం. త్యాగయ్య, క్షేత్రయ్య రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే, జాబిల్లిరావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడే లేదో కాని తెలుగు పిల్లలు మాత్రం వెంటనే తింటారు. జో అచ్యుతానంద, జో జో ముకుందా… లాలిపాట తెలుగు తల్లుల నోళ్లలో నానుతుంది. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళపాటలు, శృంగారగీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా మొత్తము ముప్పై రెండువేల పాటలు రాశాడు.

అన్నమయ్య జీవితం గురించి ఆధారం అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న వ్రాసిన అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో పొందుపరచాడు. ఈ గ్రంధము 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య తాత నారాయణయ్య తండ్రి నారాయణ సూరి, తల్లి లక్కమాంబ. వీరికి చాలా కాలం సంతానం కలుగలేదు.ఈ దంపతులు సంతానార్థులై తిరుమలను దర్శించారు. సర్వధారి సంవత్సరం వైశాఖశుద్ధ పూర్ణిమ నాడు మే 9, 1408 కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యంలో ఛాయలలో పెరిగినాడు. ఏకసంధాగ్రాహి అవటం వలన అనతి కాలంలోనే ఉన్నత విద్యావంతుడయ్యాడు.

అన్నమయ్యకు 16వ యేటనే శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. ఒకనాడు ఎవరికీ చెప్పకుండానే అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరినాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండ ఎక్కుతూ ఒకచోట అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయాడు. అప్పుడు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండ ఎక్కమని బోధించింది. పరవశించిన అన్నమయ్య అలివేలు మంగమ్మను కీర్తిస్తు శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరం చేరుకున్న అన్నమయ్య అక్కడ అన్నిటిని దర్శించి మ్రొక్కి ఆ రాత్రి ఒక మండపములో నిద్రించాడు. తరువాత కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఘు చక్రములతో శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి రమ్మని బ్రతిమాలారు. గురువాజ్ఞపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. అతనికి యుక్తవయసు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు. అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించాడు. ఆ సమయంలోనే స్వామికి రోజుకొక్క సంకీర్త వినిపించాలని సంకల్పించాడు.

అప్పటి నుండి అన్నమయ్య వేలకొలది కీర్తనలు గానం చేశాడు. వాటిని శిష్యులు గానం చేస్తూ తాళపత్రాలలో లిఖించసాగారు. ఆతరువాత అన్నమయ్య భార్యలతో కలసి తీర్థయాత్రలకు బయలుదేరాడు. దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అన్నమయ్య కీర్తనలు అంతాటా ప్రసిద్ధి చెందాయి .పెనుగొండ ప్రభువైన సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందుకు అన్నమయ్యను చెరసాలలో ఉంచాడని అంటారు. తరువాత రాజాశ్రయం తనకు తగదని గమనించి తిరుమలకు చేరాడు.

తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధానలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో ఆధ్యాత్మిక గీతాలు అధికంగా రచించాడు. అన్నమయ్య వెంకటాచలానికి సమీపంలో ఉన్న మరులుంకు అనే ఆగ్రహారంలో నివసించేవాడు. క్రమంగా జీవితం పట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో కాలం గడిపేవాడు.

అవసాన కాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునికి వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడు. 95 సంవత్సరములు పరిపూర్ణ జీవితం గడిపి దుంధుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్యాదశి నాడు ఫిబ్రవరి 23, 1503న పరమ పదించాడు.

రాగిరేకులమీద వ్రాసిన కారణంగా అన్నమయ్య జనన, మరణాలు తెలుస్తున్నాయి. మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. కాని ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నాయి. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

బమ్మెర పోతన

బమ్మెర పోతన 15వ శతాబ్ధంలో వరంగల్‌ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన దంపతులకు జన్మించాడు. వ్యవసాయం చేసేవాడు. ప్రధమ రచన భోగినీ దండకం. సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశాడు. తరువాత తన రచనలన్నీ భగవతర్పణం గావించాడు. బమ్మెర పోతన
పోతన కవి, కవిసార్వభౌముడైన శ్రీనాధుని బంధువని అంటారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ”ఆంధ్రమహాభాగవతము” అనే పేరున తెనిగించాడు. పోతన ఇతర రచనలు వీరభద్ర విజయము, నారాయణ శతకం మొదలగునవి. ఆంధ్రసాహిత్యంలో పోతనామాత్యుడు చిరంజీవి.

శ్రీనాధుడు

శ్రీనాధ మహాకవి (1365-1441) 15వ శతాబ్ధంలో కాల్పట్టణం అనే గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు భీమాంబ, మారయ్య దంపతులు. కవిత్రయం తరువాత సమకాలికుడైన కవి. కొండవీటి రాజైన పెదకోమటి వేమారెడ్డి దగ్గర విద్యాశాఖాధికారిగా పని చేశాడు. ప్రధమార్థంలో చాలా విలాసవంతమైన జీవితం గడిపాడు చివరి దశలో బీదరికంతో బాధపడ్డాడు.

విజయనగర రాజైన రెండవ దేవరాయల కాలంలో డిండిమభట్టు అనే పండితునితో వాదించి నెగ్గి కవిసార్వభౌమ అనే బిరుదు పొందాడు. శ్రీనాధుని రచనలు శృంగారనైషధం, పల్నాటి వీరచరిత్రము, నందనందన చరిత్రము, క్రీఢాభిరామము, భీమేశ్వర పురాణం, శివరాత్రి మహాత్మం, హరవిలాసం, భీమేశ్వర పురాణం, ధనుంజయ విజయము, శాలివాహన సప్తశతి మొదలగునవి. ఇతను బమ్మెర పోతనకు బంధువు అంటారు.

ఎఱ్ఱన

ఎఱ్ఱన 14వ శతాబ్ధంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు పోతమ్మ సూరన్న దంపతులు. కవిత్రయంలో చివరివాడు. నన్నయ్య వదలివేసిన అరణ్యపర్వంను పూర్తిచేశాడు. రెడ్డిరాజయిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో (1325-1353) కవిగా ఉన్నాడు. సంస్కత గంథ్రాలైన హరివంశము, రామాయణములను తెలుగులో వ్రాసి తన రాజైన ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చాడు. నరసింహపురాణమును రచించాడు. ఎఱ్ఱనను ఎఱ్ఱాప్రగడ అని కూడా పిలుస్తారు.

తిక్కన

తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడు. క్రీ.శ. 1205 నుండి 1288 వరకు జీవించాడు. తిక్కన నన్నయ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మహాభారతంలోని అరణ్యపర్యమును వదలి మిగతా 15 పర్యాలు రచించాడు. జన్మస్ధలం గుంటూరు (గుంటూరు జిల్లా). కాకతీయుల కాలం నాటివాడు.

అప్సటి నెల్లూరు రాజు మనుమసిద్ధి దగ్గర ముఖ్యమంత్రిగా చేశాడు. దాయాదుల వలన రాజ్యం కోల్పోయిన మనుమ సిద్ధికి, కాకతీయ మహారాజు గణపతిదేవుని సహాయంతో తిరిగి రాజ్యాన్ని కట్టబెట్టాడు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు కలవు. యజ్ఞం చేయుటవలన సోమయాజి అయ్యాడు (తిక్కన సోమయాజి).

నన్నయ

పంచమ వేదమైన వ్యాసభారతాన్ని తెలుగులో వ్రాయుటకు పూనుకొని అందులోని ఆదిసభా పర్యాలను పూర్తి చేసి అరణ్య పర్వంలోని చతుర్థాశ్యాసంలో 141వ పద్యం వరకు మాత్రమే పూర్తిచేసి పరమపదించాడు. ఆ తరువాత భాగాలను తిక్కన, ఎఱ్ఱనలు పూర్తి చేసారు. అందుకే వీరి ముగ్గురిని కవిత్రయం అంటారు.

నన్నయ జన్మస్థలం పశ్చిమ గోదావరిలోని తణుకు. చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని (క్రీ. శ. 1022-1063) ఆస్థానకవి. నన్నయకు ఆదికవి, శబ్ధశాసనుడు అనే బిరుదులు కలవు. ఇతర రచనలు ఆంధ్రశబ్ధ చింతామణి.

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ)

ఇతని స్వస్థలం తూములూరు(పెరిగిన ఊరు) తెనాలి (గుంటూరు జిల్లా) తల్లి లక్ష్మమ్మ. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధుడు. తొలుత సామాన్య వ్యక్తి అయిన ఇతడు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరుడు అయ్యాడు. హాస్యకవిగా, వికటకవిగా పేరు పొందాడు. సత్తెనపల్లి మండలానికి చెందిన లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్యాంబ దంపతులు ఇతని తల్లితండ్రులు. తాత, సుదక్షిణా పరిణయం వ్రాసిన అప్పన్నకవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడులోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్డురాయి ప్రతిష్టించిన ప్రాంతంలోనే రామకృష్ణుల ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం.
చిన్నతనంలోనే తల్లి దండ్రులు మరణించటంతోనే మేనమామ తెనాలి ఆగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్ళారు. అక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. తెనాలి నుండి రాయలవారి ఆస్థానానికి వచ్చాడు కనుక తెనాలి రామలింగకవిగా ప్రసిద్ధి పొందాడని ఒక అభిప్రాయం. క్రీ.శ. 1514 నుండి 1575 వరకు జీవించాడని ఆధారాలు.

రచనలు : ఉద్భాటారాధ్య చరిత్ర, ఘటికాచల మహాత్మ్యము. పాండురంగ మహాత్మ్యము. ఉద్భాటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే ఒక యతి గాధ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల క్షేత్రంలో వెలసిన శ్రీ నారసింహస్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం (ఘటికాచలం ప్రస్తుతం తమిళనాడు లోని పోళింగూర్‌). పాండురంగ మహాత్మ్యం, స్కాంద పురాణము నందలి విఠ్ఠలుని మహాత్యములు మరియు ఇతర పాండురంగ భక్తుల సంపుటం.
లభ్యంకాని ఇతర రచనలు : హరిలీలా విలాసము, కందర్పకేతు విలాసము.

దూర్జిటి (పెద దూర్జటి)

దూర్జటి పేరుతో ఇంకో నలుగురున్నారు. అందువలన ఇతనిని పెద దూర్జటి అని కూడా అంటారు. దూర్జటి (పొత్తసీమ) ప్రస్తుతం చిత్తూజిల్లా శ్రీకాళహస్తి నివాసి. తల్లి దండ్రులు నారాయణ, సింగమ్మ దంపతులు. తాత జక్కయ నారాయణ.

దూర్జటి కాళహస్తీశ్వర భక్తుడు. భక్తి ప్రబంధమైన శ్రీ కాళహస్తీర మహాత్యం మరియు శ్రీకాళహస్తీశ్యర శతకం దూర్జటి యొక్క ప్రధాన రచనలు. దూర్జటి చెప్పినవి, మరియు చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నవి. క్రీ.శ. 1480 నుండి 1545 వరకు జీవించాడని భావిస్తున్నారు.

పింగళి సూరన

తెలుగు సాహిత్యమును ఏలిన కవులలో పింగళి సూరన ఒకరు. సూరన రాఘవ పాండవీయము అనే ఒక అత్యుద్భుతమైన శ్లేష కావ్యమును రచించెను. ఈ కావ్యంలోని ప్రతి పద్యమును రామాయణంలోని కధకు, భారతంలోని కధకు ఒకేసారి అన్వయించుకోవచ్చును. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొది నవలగా భావిస్తారు. మరియు తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కావ్యంగా పరిగణిస్తారు. కళాపూర్ణోదయము ప్రేమకావ్యము.

ఇతని తల్లి అబ్బమాంబ తండ్రి అమరన్న. ఇతను నంద్యాలలోని కనాల గ్రామములో నివసించేవాడని భావిస్తున్నారు. కనాల గ్రామములో ఉన్న సమాధిని సూరన సమాధి అంటారు. ప్రతి సంవత్సరము ఇక్కడ కుమ్మరులు సూరన జయంతిని జరుపుతారు. సూరనకు సంబంధించిన స్కూలు సూరన సారస్వత సంఘం ఇక్కడ ఉన్నవి.

పింగళి సూరన ఇతర రచనలు : గిరిజా కళ్యాణము, గరుడపురాణము (తెనుగించాడు) రాఘవపాండవీవము. కళాపూర్ణోదయము – అరవీటి తిమ్మరాజ వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.

మాదయ్య గారి మల్లన

ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్తావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్న. లగ్నము పెట్టటం దగ్గరనుండి గృహప్రవేశము వరకు 75 గద్య పద్యములలో ఆనాటి పెళ్ళితంతు గురించి తన ”రాజశేఖర చరిత్రలో” వర్ణించాడు.

ఇతను 516 గద్య పద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అనే కావ్యమును రాయల ఆస్థానములో చేరక ముందే రచించినాడు. తన కావ్యమును వినుకొండ-గుత్తిసీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పన మంత్రికి అంకితమిచ్చాడు.

అప్పన మంత్రి తిమ్మరుసు మేనల్లుడు మరియు అల్లుడు కూడా. రాయలతో పాటు దండయాత్రలకు, తీర్థయాత్రలకు తప్పకుండా వెళ్ళే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదలు నుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో పెద్దగా చెప్పుకోలేదు. మల్లన కృష్ణాజిల్లా అయ్యంకి పురమునకు చెందిన వాడుగా భావిస్తున్నారు. కాని కడప జిల్లాలో పెరిగినాడు. ఈయన గురువు కడప జిల్లా పుష్ఫగిరికి చెందిన అఘోర శివాచార్యులవారు.

రామరాజ భూషణుడు (భట్టుమూర్తి)

రామరాజ భూషణుడుగా పేరుగాంచిన భట్టుమూర్తి తెలుగు కవి మరియు సంగీత విద్యాంసుడు.శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళీయ రామరాయలు ఆస్థానమునకు ఆభరణము వలె ఉండుట వలన ”రామరాజ భూషణుడు” అనే పేరు వచ్చినది. భట్టుమూర్తి నెల్లూరు ప్రాంతమునకు చెందినవాడుగా భావించుచున్నారు.

ఇతని రచనలు వసుచరిత్రము, నలోపాఖ్యానము మరియు సరస భూపాలీయము (కావ్యాలంకార సంగ్రహము మరోపేరు) అనే కావ్యములు. వసుచరిత్ర వీటన్నిలోని ప్రసిద్ధమైనది. కావ్యాలంకార సంగ్రహము భట్టుమూర్తి రచించిన మొది గ్రంధము. సరసభూపాలీయమని దీనికి మరోపేరు.

కావ్యధ్వని రసాలంకారములను గురించి, నాయికా నాయకులను గురించి, గుణదోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరమాలతో రచించిన అలజిహ్యము. ఇది సంస్కృతములో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధము.

అయ్యలరాజు రామభద్రుడు

ఈయన కడప జిల్లాకు చెందిన వాడు. క్రీ.శ 1500 నుండి క్రీ.శ 1565 కాలానికి చెందినవాడుగా భావిస్తున్నారు. అయ్యaరాజు వంశానికి చెందిన అయ్యరాజు తిప్పయ్యగారి మనుమడుని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పగారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన ”రామాభ్యుదయాన్ని” శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళీయ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు.

రామాభ్యుదయము ఎనిమిది ఆశ్యాశాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం. ఈ కావ్యం వ్యాకరణానికి, అలంకార శాస్త్రానికి చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధకావ్యంగా వ్రాయడం అయ్యలరాజు యొక్క గొప్ప ప్రయోగం.

నందితిమ్మన

నంది తిమ్మనను ముక్కుతిమ్మన అనికూడా అంటారు. ముక్కు పెద్దదిగా ఉండటం వలన మరియు కవితలలో ముక్కును చక్కగా వర్ణించడం వలన ఇలా పిలుస్తారు.తిమ్మన, రాయలు భార్య తిరుమలదేవితో అరణంగా వచ్చినవాడు. ఇతను అనంతపురానికి చెందినవాడని అంటారు.

తల్లిదండ్రులు సింగన్న, తిమ్మాంబ దంపతులు. తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడు. ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (మలయ మారుత కవి) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయ ఆస్థానంలో ఉండేవారు. తిమ్మన తన సమకాలికుడైన పెద్దన వలే క్లిష్ట పదప్రయోగాలు కాకుండా సున్నితమైన, సులువైన పద్ధతిలో రచనలు చేసేవాడు. ఈ రచనలు పండితులకే కాక పామర జనులను కూడా విశేషంగా ఆకర్షించేవి. అందుకే ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు.

ఇందుకు ఉదాహరణ పారిజాతాపహరణంలోని సుకుమార, శృంగార, రసాత్మకమైన పద్యాలు. ఇతని రచనలు : వాణీవిలాసం, పారిజాతాపహరణం

అల్లసాని పెద్దన

15-16 శతాబ్డాల మధ్య కాలంలో ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఆగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత గండపెండేరం తొడిగించుకున్నవాడు.

పెద్దన రచించిన మనుచరిత్ర ప్రధమ ప్రబంధంగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో రాయలవారికి సలహాలు ఇచ్చేవాడు. అందుచేత ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా పిలుస్తారు.

పెద్దన రచనలు : మనుచరిత్ర (స్వారోచిపమనుసంభవము)
లభ్యంకాని రచనలు : హరికథా సారము, రామస్తవ రాజము, అద్వైత సిద్ధాంతము, చాటుపద్యాలు.

గురజాడ అప్పారావు

ఈయన ఆ రోజు ల్లో చక్కటి భాషలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్యాశుల్కం. కన్యాశుల్కం నాటకం సాహితీ లోకం లో ఒక ప్రత్యేకమైనది. ఈ కన్యాశుల్కం నాటకం ఎంత గానో ప్రసిద్ధి చెందినది. ఇది నిజంగా సుస్థిర స్థానం దక్కించుకుంది నిజంగా ఈ నాటకం లో గిరీశం మధురవాణి రామప్పంతులు వంటి పాత్రలు ఎంత గానో ప్రఖ్యాతి చెందాయి.
 
ఈయన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో జన్మించారు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు తెలుగు సాహిత్యం లో వాడుక భాష ఒర వడికి కృషి చేశారు. ఈయనకు కవి శేఖర అనే బిరుదు కూడా వచ్చింది రచయితగా సంఘ సంస్కర్తగా సాహిత్యకారుడిగా హేతువాదిగా అభ్యుదయ కవి గురజాడ ప్రసిద్ధి చెందారు. తెలుగు భాష మహా కవి గా ప్రజల మన్ననలను పొందాడు.
 
గురజాడ అప్పారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన రచనలు నిజంగా సమాజంలో మార్పు తెచ్చాయి. గిడుగు రామ్మూర్తి గారు తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించారు. ఆ తర్వాత ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించారు. ప్రబలంగా వున్న కన్యాశుల్కం వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. నిజంగా అప్పటి దురాచారాల పై నాటకం వ్రాసి దానినే కథావస్తువుగా తీసుకుని నాటకపు తొలి ప్రదర్శన కూడా జరిపించారు. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చారు. ఆ తర్వాత 1909 లో రెండవ కూర్పును కూడా ఆయన రచించారు.
 
20వ శతాబ్దంలో తొలి నాళ్లలో జరిగిన వ్యవహారిక భాష ఉద్యమం లో గురుజాడ అప్పారావు తన సహాధ్యాయి అయిన గిడుగు రామ్మూర్తి గారి తో కలిసి పోరాటం చేసారు. వీరిద్దరూ పత్రికల్లో సభల్లో మద్రాస్ విశ్వవిద్యాలయం లో గ్రాంథిక భాషా వాదుల తో అలసట ఎరుగకుండా తలపడ్డారు ఈ భాషోద్యమం వ్యవహారిక భాషోద్యమానికి వినియోగ పడింది.
 
” దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్”
 
అంటూ ఆయన రాసిన ప్రముఖ గేయం ఎందరో మందిని బాగా ఆకర్షించింది. ఈయన రాసిన గేయాల్లో పుత్తడిబొమ్మ పూర్ణమ్మ సుప్రసిద్ధ గేయం…
 
” కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ పుత్తడి బొమ్మ పూర్ణమ్మ”
 
కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది దీన్ని వృత్తాంతం కూడా కన్యాశుల్కం దురాచారమే.
 
ఇలా గురుజాడ అప్పారావు పూర్ణమ్మ , నీలగిరి పాటలు, ముత్యాలసరాలు, కన్యక, సుభద్ర, సంస్కర్త హృదయం, మతము విమతము ఇలా అనేక రచనలు చేశారు గురజాడ-వెలుగుజాడ. చక్కటి రచనల తో గురజాడ సమస్యల తో అందించారు ఈ రచనలని.

కుక్కతోక వంకర


 పూర్వం కుక్కలకి తోక వంకరగా ఉండేది కాదు(ట)!.. సాఫీగా, కర్రలా ఉండేది, దాని తోక వంకరవడానికి ఒక కథ వుంది.  ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిలో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలుండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది.
అడవికి రాజైన సింహం.. కుక్కలోని ప్రతిభని గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబిరుసు తనంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు.. సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్రలాంటి తోకతో తరిమి కొట్టేది.
కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు ఏంతో విసిగిపోయాయి. ఒకనాడు దాని పొగరుబోతుతనం గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి. విచారణ కొరకు సింహం కుక్కని రమ్మని కబురు చేసింది. కుక్క సింహం రాజు దగ్గరకొచ్చింది.
”అడవిలో జంతువులన్నింటిని నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను.. సేనాధిపతివై ఉండి.. వారి కష్టాలను తీర్చాల్సింది పోయి.. నువ్వే ఇలాగ ప్రవర్తిస్తే ఎలా..! నీకిదే చివరి హెచ్చరిక.. ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు.. ఇకనుండైనా బుద్దిగా ఉండు పో!” అని మందలించింది సింహం.
”అయ్యో… ఒట్టి అబద్దం సింహరాజా..! నా తోకను చూడండి.. ఆ భగవంతుడు నాకు కర్ర లాంటి బలమైన తోకను ఇచ్చాడు.. అది చూసి మిగిలిన జంతువులు అసూయ పడుతూ.. నాపై నిందారోపణలు చేస్తున్నాయి. కావాలని నామీద లేని పోనీ చాడీలు చెబుతున్నాయి .. అంతే!..”  అంది కుక్కఅమాయకత్వాన్ని నటిస్తూ.
”అయితే.. మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేనో ఉపాయం చెబుతాను. ఈ కుక్క తోకను మడిచి తాడుతో కట్టు..” అని భటుడు తోడేలుకు చెప్పింది సింహం.
సింహం చెప్పినట్టే చేసింది తోడేలు. అలా నాలుగుగైదు నెలలు గడిచిపోయాయి.
తోక మడిచి రాయి కట్టడం వాళ్ళ కుక్కకు బాగా నొప్పి కలిగింది.. పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది.
ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుని ఇంటికి తిరిగి వెళుతూండగా తోకను కట్టేసిన కుక్కను చూసి జాలిపడి కట్టు విప్పదీశాడు.
మునుపటిమాదిరి కర్ర లాగా లేదు. వంపుతిరిగి పైకి లేచి ఉంది.
తలతిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క. ‘ఆ తోకతో ఇప్పుడు ఎవర్నీ బెదిరించలేదు. కర్రలా ఉపయోచించి ఎవ్వరనీ కొట్టలేదు.. ఇక అహంభావంతో ఉండకూడదు..’ అని మనసులో అనుకుంది.
రైతు వెంటే ఇంటికి వచ్చింది.
వెంట పడి వచ్చిన కుక్కకి కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు. పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క. అప్పట్నుంచి రోజూ తనతోనే ఉంటూ.. తాను పెట్టింది తింటూ.. తనతో పాటు పొలానికి వెళుతూ, ఇంటికి కాపలాగా ఉండిపోయింది.
కుక్కకి కూడా తను చూపించే ప్రేమ, ఆప్యాయత బాగా నచ్చేసింది..
ఎందుకంటే ”అడవి జంతువుకులుకన్నా మనుషులే మంచివారు, దయార్ద్ర హృదయులు” అని తలచి విశ్వాసం గల పెంపుడు జంతువుగా నాటి నుండి నిలిచిపోయింది.

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు – ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.    

10వ శతాబ్దంలో వారాణసిలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, వారిలో “నందవరం” గ్రామంలో స్థిరపడినవారు వందవారికులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవారికుడే. అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట. నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని బార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ.

అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొదిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

ఒకనాడు (8వ ఏట) ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. తిరుమలకు వెళ్ళే కొండదారిలో ఆయనకు అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించినదనీ, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించినదనీ చెబుతారు. అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి “నీడ తిరుగని చెంతచెట్టు”కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి “విరజానది”కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, “వంట యింటిలో వకుళా దేవి”కు నమస్కరించి, “యాగశాల”ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీమి) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమనంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు.

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞనను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్లతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ (పొత్తపినాడు) పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి “మూరురాయర గండ” అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట. అన్నమయ్య నరహరిని కీర్తించగా ఆ సంకెళలు తోలగిపోయాయట.

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న “మరులుంకు” అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.

ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. “మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే” అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు “సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే” అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. “పదకవితా పితామహుడు”, “సంకీరత్నాచార్యుడు”, పంచమాగమ సార్వభౌముడు”, ద్రవిడాగమ సార్వభౌముడు” – ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి “అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా” ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను “సంకీర్తనాచార్యుడు”, ‘పదకవితా పితామహుడు” అయ్యాడు.

అన్నమయ్య “యోగ వైరాగ్య శృంగార సరణి” మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

“సంకీర్తనా లక్షణమనే” సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో “శృంగార మంజరి” అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో “వేంకటేశ్వర శతకము” ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు ” ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు… నగుబాట్లైన దివిపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే”

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.